బల్దియా బడ్జెట్ రచ్చ రచ్చ…

ఆందోళ‌న చేసిన బీజేపీ కార్పొరేట‌ర్లు పోటాపోటీగా నినాదాలు చేసిన బీఆర్ ఎస్‌, బీజేపీ కార్పొరేట‌ర్లు గంద‌ర‌గోళం మ‌ధ్య బ‌డ్జెట్‌కు మేయ‌ర్ ఆమోద ముద్ర‌ చ‌ర్చ లేకుండానే ముగిసిన స‌భ‌ విధాత, హైద్రాబాద్: అసెంబ్లీ సమావేశాలను తలపించేలా బల్దియా కౌన్సిల్ సమావేశం అట్టుడికింది. గ్రేటర్ హైదరాబాద్ 2023-24 ఏడాది బడ్జెట్ ఆమోదం ప్రత్యేకంగా పెట్టిన సర్వసభ్య సమావేశం రసాభాసాగా ముగిసింది. ఆరంభం నుంచి పోడియం వద్ద బిజెపి కార్పొరేటర్ల ఆందోళనతో సభ నడిపేందుకు అవకాశం లేకుండా పోయింది. అక్కడక్కడా […]

బల్దియా బడ్జెట్ రచ్చ రచ్చ…
  • ఆందోళ‌న చేసిన బీజేపీ కార్పొరేట‌ర్లు
  • పోటాపోటీగా నినాదాలు చేసిన బీఆర్ ఎస్‌, బీజేపీ కార్పొరేట‌ర్లు
  • గంద‌ర‌గోళం మ‌ధ్య బ‌డ్జెట్‌కు మేయ‌ర్ ఆమోద ముద్ర‌
  • చ‌ర్చ లేకుండానే ముగిసిన స‌భ‌

విధాత, హైద్రాబాద్: అసెంబ్లీ సమావేశాలను తలపించేలా బల్దియా కౌన్సిల్ సమావేశం అట్టుడికింది. గ్రేటర్ హైదరాబాద్ 2023-24 ఏడాది బడ్జెట్ ఆమోదం ప్రత్యేకంగా పెట్టిన సర్వసభ్య సమావేశం రసాభాసాగా ముగిసింది. ఆరంభం నుంచి పోడియం వద్ద బిజెపి కార్పొరేటర్ల ఆందోళనతో సభ నడిపేందుకు అవకాశం లేకుండా పోయింది.

అక్కడక్కడా బీఆర్ఎస్ కార్పోరేటర్లు సైతం పోటాపోటీ నినాదాలతో గ్రేటర్ సమావేశం హోరెత్తింది. గందరగోళం నడుమ ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్ కు మేయర్ ఆమోద ముద్ర వేయగా.. ఎలాంటి చర్చ లేకుండా బల్దియా జనరల్ బాడీ మీటింగ్ ముగియడం చరిత్రలో ఇదే తొలిసారి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 5 వ సర్వసభ్య సమావేశం ఆందోళనల నడుమ అట్టుడుకింది. సమావేశ ప్రారంభం నుంచే ప్రతిపక్ష కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. ఇటీవల ఉప్పల్ లో మేయర్ ను స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్న ఘటనపై స్పందించాలని.. మేయర్ పర్యటించే అవకాశం లేకపోతే ప్రతిపక్ష కార్పోరేటర్ల పరిస్థితి ఎంటని బిజెపి కార్పోరేటర్లు ప్రశ్నించారు.

శానిటేషన్ సిబ్బందిని పెంచాలని, పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కార్పోరేటర్ల బడ్జెట్ కేటాయించాలని, ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు రోజులు సభ నిర్వహించి బడ్జెట్, ప్రజా సమస్యలపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు.

ఆందోళన విరమించి సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని మేయర్ ప్రతిపక్ష బిజెపి కార్పోరేటర్లను కోరారు. వారు నిరాకరించడంతో స్టాండింగ్ కమిటీ ఆమోదించిన 2023-24 ఏడాది బడ్జెట్ 6 వేల 224 కోట్లను ఎలాంటి చర్చ లేకుండానే సర్వసభ్య సమావేశం ఆమోదిస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు.

బడ్జెట్ ఆమోదం పొందినట్లు మేయర్ ప్రకటనతో బిజెపి కార్పోరేటర్లు మరింత ఆందోళన చేశారు. నినాదాల నడుమ సభను నిర్వహించలేక మేయర్ పది నిమిషాలు వాయిదా వేశారు. బిజెపి నుంచి నలుగురు కార్పోరేటర్ల రావాలని, సభ నిర్వహణ వ్యవహారాలు చర్చిద్దామన్న మేయర్ ఆహ్వానానికి బిజెపి కార్పోరేటర్లు స్పందించలేదు.

అయినా 10 నిముషాల తరువాత తిరిగి సభను మేయర్ ప్రారంభించినా గందరగోళం తగ్గకపోవడంతో బిజేపి సభ్యులలో కొందరిని సప్సెండ్ చేస్తానంటూ హెచ్చరించారు మేయర్. మార్షల్స్ ను లోపలికి పిలిపించారు మేయర్. సభలో బిఆర్ఎస్.. బిజేపి సభ్యుల పోటా పోటీ నినాదాల మధ్య బిజేపి సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి సభను వాయిదా వేశారు మేయర్.

అయినా బిజెపి కార్పొరేటర్ సభ్యులు పోడియం వద్ద నుండి కదలలేదు. మార్షల్స్ రక్షణ మధ్య తిరిగి సభను ప్రారంభించారు మేయర్. ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. టీఆర్ఎస్.., ఎంఐఎం కార్పోరేటర్లు ప్రశ్నలపై మాట్లాడుతుండగా మరోసారి బిజెపి కార్పొరేటర్లు ఆందోళన చేశారు. దాంతో సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చినట్లు గా భావిస్తూ సభను ముగిస్తున్నట్లు ప్రకటించింది.

దాంతో సభనిర్వహణపై కాంగ్రేస్.., బిజేపి కార్పోరేటర్లు ఆందోళన చేశారు. మేయర్ చాంబర్స్ వద్ద కాంగ్రేస్ కార్పోరేటర్లు బైటాయించి సేవ్ డెమెక్రసి అంటూ నినదించారు. జిహెచ్ఎంసి ప్రజాసమస్యలపై చర్చించకుండా బిఆర్ఎస్.., బిజేపి పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు కాంగ్రేస్ కార్పోరేటర్ విజయా రెడ్డి. జిహెచ్ఎంసిని చంపే ప్రయత్నం చేస్తున్నారని.., దీనిని ప్రయివేట్ లిమిటెడ్ కంపనీగా మార్చుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

ఇక బడ్జెట్ పై చర్చించకుండా ఆమోదించడం చట్టవిరుద్దం అంటూ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేశారు బిజేపి కార్పోరేటర్లు. చట్టవిరుద్ధంగా మేయర్ వ్యవహరించారని.., కనీసం బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టకుండా ఎలా ఆమోదించినట్లు ప్రకటిస్తారని ప్రశ్నించారు.

కేంద్ర నుండి వచ్చిన నిధులు 20 శాతం ఉన్నట్లు అధికారులు బడ్జెట్ లో చూపించారని అన్నారు. జనవరి 10వ తేదీలోపు బడ్జెట్ సమావేశాలు నిర్వహించి చర్చించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే లీగల్ గా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు బిజేపి కార్పొరేటర్లు.

అయితే సమావేశాల్లో బీజేపీ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. ప్రజా సమస్యలపై చర్చించకుండా సమయాన్ని వృథా చేశారని ఆమె మండిపడ్డారు. బిజేపి సభ్యలకు సమావేశం గురించి ముందే తెలియజేసిన ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా, సభ ప్రారంభంలో అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై.., అభివృద్దిపై శ్రద్ద ఉంటే వాళ్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము సిటీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు మేయర్.

ఇక జిహెచ్ఎంసి మేయర్ తీరుకు నిరసనగా బిజేపి కార్పొరేటర్లు రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే బడ్జెట్ పై ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించడం జిహెచ్ఎంసి చరిత్రలో మొదటి సారి అని విమర్శించారు ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు.