Bengaluru | యువతిని బైక్ ఎక్కించుకుని.. ర్యాపిడో డ్రైవర్ పాడు పని..!
Bengaluru పైగా ఇతర నెంబర్లతో ఫోన్ చేస్తూ వేధింపులు మణిపూర్ ఘటనపై నిరసన ప్రదర్శనకు వెళ్లి వస్తుంటే ఘటన బెంగళూరు: సందు దొరికితే చాలు.. పోకిరీలు యువతుల పట్ల అసభ్య ప్రవర్తనకు దిగుతుంటారు. నీచమైన చేష్టలకు పాల్పడుతుంటారు. కొందరు ఇటువంటి ఘటనలు మౌనంగా భరిస్తారు. కానీ.. ఒక యువతి మాత్రం తనకు ఎదురైన ఘటనను ధైర్యంగా బయటపెట్టింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనపై జరిగిన నిరసనలో పాల్గొని ఇంటికి వెళ్లేందుకు బైక్‌ను బుక్ […]

Bengaluru
- పైగా ఇతర నెంబర్లతో ఫోన్ చేస్తూ వేధింపులు
- మణిపూర్ ఘటనపై నిరసన ప్రదర్శనకు వెళ్లి వస్తుంటే ఘటన
బెంగళూరు: సందు దొరికితే చాలు.. పోకిరీలు యువతుల పట్ల అసభ్య ప్రవర్తనకు దిగుతుంటారు. నీచమైన చేష్టలకు పాల్పడుతుంటారు. కొందరు ఇటువంటి ఘటనలు మౌనంగా భరిస్తారు. కానీ.. ఒక యువతి మాత్రం తనకు ఎదురైన ఘటనను ధైర్యంగా బయటపెట్టింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనపై జరిగిన నిరసనలో పాల్గొని ఇంటికి వెళ్లేందుకు బైక్‌ను బుక్ చేసుకున్న తనకు ఎదురైన దారుణమైన అనుభవాన్ని ఆమె ట్విట్టర్‌లో పంచుకున్నది.
బైక్‌పై వెళుతుండగా.. ఆ బైక్ డ్రైవర్.. మార్గమధ్యంలో హస్తమైధునం చేయమే కాకుండా.. అసభ్యకర్తంగా ప్రవర్తించాడంటూ ఆమె వెల్లడించారు. అంతేకాకుండా.. వేరే నంబర్ల నుంచి తనకు ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడని తెలిపారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన దారుణకాండపై బెంగళూరులోని టౌన్‌హాల్ వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న యువతి.. ఇంటికి వెళ్లేందుకు ఆటోలో, ట్యాక్సీలు బుక్ కాకపోవడంతో ర్యాపిడోబైక్‌ను బుక్ చేసుకున్నారు. కానీ.. తాను బుక్ చేసిన బైక్ నంబర్ కాకుండా వేరే బైక్‌పై డ్రైవర్ వచ్చాడని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.
We have informed to @sjparkps to take necessary action in this regard, Please DM your contact number.
— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) July 21, 2023
అయితే.. యాప్‌లో కన్ఫర్మ్ కావడంతో ఆమె దానిపై బయల్దేరారు. అయితే.. రైడ్ మొదలైన కాసేపటికి జనసంచారం లేని ప్రాంతంలోకి వెళ్లగానే.. బైక్ నడుపుతూనే సదరు డ్రైవర్ హస్తమైధునం చేయడం మొదలు పెట్టాడని ఆమె పేర్కొన్నారు. భయంతో తాను ఏ మాట్లాడ లేక పోయానని తెలిపారు. తన ఇల్లు అతడికి తెలియకూడదనే ముందు జాగ్రత్తతో ఇంటికి కొంత దూరం ముందే బైక్ ఆపాలని కోరానని తెలిపారు. తాను పూర్తి రైడ్‌కు డబ్బు చెల్లించినప్పటికీ సదరు డ్రైవర్ పదే పదే తనకు ఫోన్ చేసి, మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడని పేర్కొన్నారు. సదరు డ్రైవర్ వాట్సాప్‌లో పంపిన అసభ్య స్ర్కీన్‌షాట్‌లను సైతం ఆమె పోస్ట్ చేశారు.
సదరు బైక్ ట్యాక్సీ సంస్థను థ్రెడ్‌లో పెట్టిన మహిళ.. ప్రయాణికుల రక్షణకు తీసుకుంటున్న చర్యలేంటని ప్రశ్నించారు. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కు ఏం చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు. ప్రయాణికుల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మహిళ పోస్ట్‌పై స్పందించిన పోలీసులు.. ఇతర వివరాలు ఇవ్వాలని ఆమెను ట్విట్టర్‌లో కోరారు. బెంగళూరులో ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. ఒక ఘటనలో బైక్ డ్రైవర్ అసభ్య చేష్టలకు భయపడిపోయిన మహిళ.. నడుస్తున్న బైక్ నుంచి దూకేసిన విషయం తెలిసిందే.
వీళ్లతో జాగ్రత్త
అందరూ దుర్మార్గులే ఉండకపోవచ్చు. కానీ.. ఉంటారు. సాధారణంగా యాప్‌లో బైక్ నంబర్, ఫోన్ నంబర్ రిజిస్టర్ అయి ఉంటాయి. కానీ.. కొన్ని సందర్భాల్లో వేరే ఫోన్ నంబర్లతో లేదా వేరే బండి నంబర్లతో డ్రైవర్లు వస్తుంటారు. అటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మనం ఆటో, క్యాబ్ లేదా బైక్ బుక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన లొకేషన్ వెళ్లిపోతుంది. మళ్లీ విడిగా వాట్సాప్‌లో వారికి పంపాల్సిన అవసరం లేదని గుర్తు పెట్టుకోండి. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయాల్లో కాలనీల్లో దిగేటట్టయితే.. ఒకటి రెండు ఇండ్ల ముందే ఆగిపోవడం ఉత్తమం.