Bird Species | పక్షుల్లో పెరుగుతున్న విడాకులు.. ఎందుకో తెలుసా?
Bird Species విధాత: మనుషుల్లానే సుమారు అన్ని పక్షి జాతులు (Bird Species) జీవితాంతం ఒకరితోనే ఉంటాయని ఇప్పటి వరకు చదువుకున్నాం. కానీ మన సమాజంలో విడాకులు (Divorce) తీసుకున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లే… పక్షుల్లోనూ విడిపోతున్న వాటి సంఖ్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంకా విచిత్రమేమిటంటే భాగస్వామి ఉన్నా వేరే పక్షితో జత కట్టడం, ఆహార సేకరణలో ఎక్కువ రోజులు భాగస్వామికి దూరంగా ప్రయాణంలో ఉండటం వంటి కారణాల వల్లే అవి విడిపోతున్నాయని వెల్లడించారు. కారణాలు […]

Bird Species
విధాత: మనుషుల్లానే సుమారు అన్ని పక్షి జాతులు (Bird Species) జీవితాంతం ఒకరితోనే ఉంటాయని ఇప్పటి వరకు చదువుకున్నాం. కానీ మన సమాజంలో విడాకులు (Divorce) తీసుకున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లే… పక్షుల్లోనూ విడిపోతున్న వాటి సంఖ్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇంకా విచిత్రమేమిటంటే భాగస్వామి ఉన్నా వేరే పక్షితో జత కట్టడం, ఆహార సేకరణలో ఎక్కువ రోజులు భాగస్వామికి దూరంగా ప్రయాణంలో ఉండటం వంటి కారణాల వల్లే అవి విడిపోతున్నాయని వెల్లడించారు. కారణాలు కూడా మానవ సమాజంలో ఉన్నట్టే అనిపిస్తున్నాయి కదూ.. అయితే ఇవి విడిపోయే ప్రక్రియ కాస్త వింతగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
పక్షి జాతుల్లో 90 శాతం పక్షులు ఏక జీవిత భాగస్వామి వ్రతాన్ని పాటిస్తుండగా.. మరికొన్ని పక్షులు మాత్రం ప్రతి బ్రీడింగ్ సీజన్‌కు తమ జీవిత భాగస్వామి జీవించి ఉన్నా సరే వారిని మార్చేసి.. కొత్త బంధాల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇలా మోనోగామి (Monogamy) కి దూరంగా జరుగుతున్న పక్షుల సంఖ్య పెరగడాన్ని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు.
ఈ పరిణామాల వెనక ఉన్న కారణాలను కనుగొనేందుకు చైనా, జర్మనీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మగ పక్షులు పలు ఆడ పక్షులతో శృంగార సంబంధాలు కలిగి ఉండటం, జీవిత భాగస్వామిని విడిచిపెట్టి ఎక్కువ రోజులు వలస పోవడం వంటివి కారణాలుగా గుర్తించారు.
ఎలా కనుగొన్నారు?
పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 232 జాతుల పక్షులను పరిశీలించారు. వాటి వలస విధానాన్ని, విడాకుల రేటును, సంతానోత్పత్తి రేటును నమోదు చేసుకున్నారు. వాటి పూర్వ చరిత్రను బట్టి ఒక్కో మగ పక్షి, ఆడ పక్షికి సంబంధించి లైంగిక సంబంధాలు ఎలా ఉన్నాయో గమనించారు. అందులో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్న పక్షి జాతులు దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాయి.
ప్లోవర్, స్వాలోస్, మార్టిన్స్, ఓరియోల్స్, బ్లాక్ బర్డ్స్ జాతి పక్షుల్లో మగ పక్షులు వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల విడాకుల రేటూ ఎక్కువగా ఉంది. మరోవైపు పెట్రెల్స్, ఆల్బట్రోసెస్, గీస్, స్వాన్స్ మొదలైన పక్షుల్లో మగ పక్షులు బుద్ధిగా ఉంటుండటంతో విడాకులు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఆడ పక్షులు వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ అవి ఎలాంటి నెగటివ్ ప్రభావాన్నీ చూపడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఏమిటి కారణం
మగ పక్షుల లైంగిక సంబంధాలే విడాకులకు దారి తీయడానికి ఆడ పక్షుల సంఖ్య, వాటి ఆకర్షణ శక్తి ఎక్కువ కారణాలు అయి ఉండొచ్చని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ ప్రొఫెసర్ డా.జిటన్ సంగ్ వెల్లడించారు. ఒక బ్రీడింగ్ సీజన్ గడిచిపోయాక.. మగ పక్షికి పాత కుటుంబంపై ఉన్న శ్రద్ధ కాస్త తగ్గుతుందని.. ఈ నిబద్ధత లోపించడం అనేది తమ జీవిత భాగస్వామికి అయిష్టం కలగడానికి కారణమవుతుందని తెలిపారు.
మరోవైపు పలు ఆడ పక్షులతో శృంగారంలో పాల్గొనడం వల్ల మగ పక్షులు మరింత ఫిట్‌గా మారి కొత్త పక్షులకు ఆకర్షణీయంగా కనపడతాయన్నారు. ఆడ పక్షుల లైంగిక సంబంధాల దగ్గరకి వస్తే.. వీటి బంధాలు విడాకులకు దారి తీయకపోవచ్చని జిటన్ అభిప్రాయపడ్డారు. ఈ కారణం వల్ల ఆడ పక్షిని దూరం చేసుకుంటే గుడ్లను పొదగడం, వాటిని రక్షించడం, ఆహారం తీసుకురావడం, పెట్టడం వంటి బాధ్యతలు మగపక్షి నెత్తిన పడతాయని వెల్లడించారు.
వలసలూ ఒక కారణం
పక్షుల్లో విడాకులకు వలస (Migration)లూ ఒక కారణమని ఈ అధ్యయనం గుర్తించింది. వలస వెళ్లే దూరం ఎంత ఎక్కువగా ఉంటే.. ఆ జాతుల్లో విడాకుల రేటు అంత ఎక్కువగా ఉందని తెలిపింది. వలసలకు బయలుదేరిన పక్షి జంట ఒకే సారి గమ్యస్థానం చేరుకునే అవకాశాలు చాలా తక్కువ. వాటిలో ముందు గమ్య స్థానాలకు చేరుకున్న పక్షులు ఒకదానితో ఒకటి సంబంధాలు ఏర్పరచుకుంటాయి. తర్వాత వచ్చిన జీవిత భాగస్వామితో మరి కలవవు అని డా.జిటన్ తెలిపారు.