ఒడిశాలో బీజేపీ, బీజేడీ పొత్తు? నేతలేమంటున్నారు?
ఒడిశాలో బీజేడీ, బీజేపీ మధ్య పొత్తు అంశంలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే.. రెండు పార్టీలూ ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు

- రెండు పార్టీల్లో జోరుగా చర్చలు
- పొత్తు ఉండవచ్చని సంకేతాలు
- గతంలోనూ పొత్తులపై వార్తలు
- ఖండించిన బీజేడీ, బీజేపీ నేతలు
భువనేశ్వర్: ఒడిశాలో బీజేడీ, బీజేపీ మధ్య పొత్తు అంశంలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే.. రెండు పార్టీలూ ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భువనేశ్వర్‌లోని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో బుధవారం రాత్రి వరకూ బీజేపీ నేతలు సమావేశమయ్యారు.
మరోవైపు దేశ రాజధానిలో బీజేపీ నాయకులు సైతం ఇదే అంశంలో సమావేశమైనట్టు తెలుస్తున్నది. మూడు గంటలపాటు సాగిన చర్చల అనంతరం బీజేడీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబి ప్రసాదధ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు కుదిరే అవకాశం ఉన్నదని చెబుతూ.. స్పష్టంగా చెప్పడానికి నిరాకరించారు. ‘బిజూ జనతాదళ్ ఒడిశా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అవును.. పొత్తు విషయంలో చర్చలు జరిగాయి’ అని ఆయన వెల్లడించారు.
నవీన్ పట్నాయక్ నాయకత్వంఓల ఒడిశా గణనీయమైన ప్రగతి సాధించిందని, ఇప్పుడు దీనిని కొత్త ఎత్తులకు తీసుకుపోవాల్సి ఉన్నదని తెలిపారు. మిశ్రాతోపాటు పార్టీ సీనియర్ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ సాహూ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘బీజేడీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలో పార్టీ సీనియర్ నేతలు రాబోయే లోక్‌సభ, విధాన సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు’ అని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ సీనియర్ నేత, ఎంపీ జుయల్ ఓరమ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేడీతో ఎన్నికలకు ముందు పొత్తులపై చర్చ జరిగిందని అంగీకరించారు. అయితే.. ఈ అంశంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే.. బీజేడీతో పొత్తును ఓరమ్ వ్యతిరేకిస్తున్నారు. నడ్డాతో జరిగిన సమావేశానికి ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఒడిశాలో బీజేడీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని గతంలో వార్తలు వచ్చినప్పుడు రెండు పార్టీలూ వాటిని ఖండించాయి. పొత్తు విషయంలో వస్తున్నవన్నీ ఊహాగానాలేనని ఫిబ్రవరి 29న బీజేడీ జాతీయ అధికార ప్రతినిధి శశ్మిత్ పాత్రా, బీజేపీ ఒడిశా ఎన్నికల ఇన్‌చార్జ్ విజయ్‌పాల్ సింగ్ తోమర్ కొట్టిపారేశారు.