BJP | మల్కాజిగిరి సీటుపై కమలం నేతల పోటాపోటీ
మల్కాజిగిరి లోక్ సభ టికెట్ కోసం బీజేపీ పార్టీ ముఖ్య నేతలు పోటీ పడుతుండటంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి సవాల్‌గా మారింది

- లోక్ సభ టికెట్ల కోసం పెరుగుతున్న ఆశావహులు
BJP | విధాత : మల్కాజిగిరి లోక్ సభ టికెట్ కోసం బీజేపీ పార్టీ ముఖ్య నేతలు పోటీ పడుతుండటంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి సవాల్‌గా మారింది. ఏకంగా ఎనిమిది మంది ముఖ్య నేతలు మల్కాజిగిరి బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతు అధిష్టానం వద్ధ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సీనియర్ నేత మురళీధ్రావుతో పాటు, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, చాడ సురేశ్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, వీరేందర్‌గౌడ్, మల్క కొమురయ్య, కరుణ గోపాల్, పన్నాల హరీశ్రెడ్డిలు టికెట్ కోసం గట్టి పట్టు పడుతున్నారు.
టికెట్ విషయంలో ఎవరు తగ్గకపోవడంతో నేతల మధ్య నెలకొన్న పోటీ అధిష్టానం తలనొప్పిగా తయారైంది. పట్టణ ప్రాంత ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆదరణ ఎక్కువగా ఉంటుందన్న ధీమాతో ఈ లోక్‌సభ నియోజకవర్గాల టికెట్ల కోసం ఆశావహులు ఎక్కువగా పోటీ పడుతున్నారు.
10స్థానాలే టార్గెట్
రాష్ట్రంలోని 17లోక్ సభ సీట్లలో బీజేపీ గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచింది. ఈ దఫా 8-10స్థానాలు ఖచ్చితంగా గెలువాని ఆ పార్టీ స్కెచ్ వేసుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజమాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, అదిలాబాద్ నుంచి బాబురావులకు తిరిగి టికెట్లు ఇవ్వనుండగా, మిగతా స్థానాల్లో చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ లేదా జితేందర్‌రెడ్డి, టి.ఆచారిలు, మెదక్ నుంచి రఘనందన్ రావు, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్‌లు టికెట్లు ఆశిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి రాజాసింగ్ లేక మహిళా నేతకు, నాగర్ కర్నూల్ నుంచి బంగారు శృతి, వరంగల్ నుంచి మంద కృష్ణ, మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్, జహిరాబాద్ నుంచి ఏలేటి సురేశ్‌రెడ్డి, రాజాసింగ్, ఆలే భాస్కర్, లేదా చీకోటి ప్రవీణ్, ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నల్లగొండ నుంచి పిల్లి రామరాజు, పెద్దపల్లి నుంచి సోగల కుమార్, మహబూబబాద్ నుంచి తేజావత్ రామచంద్రనాయక్, దీలిప్ నాయక్, హుస్సెన్ నాయక్‌లు టికెట్లు ఆశిస్తున్నారు. 10సీట్లు గెలిచే లక్ష్యంలో భాగంగా ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు పార్టీలో చేరితే వారికి టికెట్లు ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉంది. ఈ నేపధ్యంలో మునుముందు మరింత మంది కొత్త నేతల పేర్లు లోక్‌సభ టికెట్ల రేసులోకి రావచ్చని భావిస్తున్నారు.