పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, కార్మిక, కర్షకుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న ప్రధాని మోదీని గద్దె దించాలని

– మా పోరాటం కార్పొరేట్, మతోన్మాదుల మీదే..
– సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని, కార్మిక, కర్షకుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న ప్రధాని మోదీని గద్దె దించాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ఆలిండియా ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం హన్మకొండ జిల్లాకేంద్రంలో సీఐటీయూ ఆలిండియా వర్కింగ్ కమిటీ సమావేశాల్లో భాగంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టీ ఉప్పలయ్య అధ్యక్షతన సభ జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు సీఐటీయూ ఆలిండియా వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం జరిగిన బహిరంగసభలో ముఖ్య అతిథిగా హాజరైన తపన్‌సేన్ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదిన్నరేండ్లుగా విద్వేష, మత రాజకీయాలు చేస్తుండడంతో దేశ ప్రజల జీవితాలు సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. కేంద్రంలో పాలిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్టోర్గా వ్యవహరిస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికుల హక్కులను కేంద్రం తుంగలోకి తొక్కిందన్నారు. కార్మిక కోడ్లను తీసుకువచ్చి యాజమాన్యాలకు కేంద్రం వత్తాసు పలికి కార్మికు హక్కులను అణిచివేసిందన్నారు. మన పోరాటం కార్పొరేట్, మతోన్మాద శక్తుల మీదనేనన్నారు. అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్న మోదీ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదన్నారు. ఇటీవల దేశంలో ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమ్మె అభినందనీయమైందన్నారు. ఫాసిస్టు విధానాలు తరుచూ విజయాలు సాధించిన దాఖలాలు చరిత్రలో లేవన్నారు. ఈ 75 ఏండ్లలో అభివృద్ధి జరుగలేదేని, ఈ తొమ్మిదిన్నరేండ్లలోనే అభివృద్ధి జరిగిందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్, బడా వ్యాపారులకు మేలు చేసే విధానాలను అమలు చేస్తూ వారికి మాత్రమే లాభాలు వచ్చేలా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడన్నారు. మతాన్ని రాజకీయాల్లో మిళితం చేసి బీజేపీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలని చూస్తుపన్నదన్నారు. ఇందులో భాగంగానే జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రారంభించి తనవల్లే రామాలయ నిర్మాణం సాధ్యమైందని ప్రచారం చేసుకుంటూ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నెల రోజులుగా ఇటువంటి ప్రచారంలోనే కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై వుందన్నారు. కేంద్రంలోని బీజేపీ తన మత ఎజెండాతో ముందుకు వెళ్తున్నా, మనం మన ఎజెండాతో ముందుకు సాగుతూనే వున్నామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపుతామని హెచ్చరించడంలో భాగంగా ఈనెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని తపన్‌సేన్ కార్మికులను కోరారు.
– బీజేపీని ఓడించకపోతే హక్కులుండవ్
– సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే దేశంలో హక్కులుండవని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సీఐటీయూ పూర్వ ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. బీజేపీని ఓడించడమే కర్తవ్యం కావాలన్నారు. దేశంలో మోదీ ప్రధాని అయ్యాక రాజ్యాంగానికి, హక్కులకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రశ్నించే కవులను, మేధావులను, ఉద్యమకారులను మోదీ జైల్లో పెట్టించారన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావుల ఆరోగ్యం బాగో లేకపోయిన జైళ్లల్లో వేసి ఇబ్బందులకు గురిచేశారన్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని అమలు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని, సనాతన ధర్మమంటే ఆడవాళ్లు అఠాలుగా, అంగన్వాడీలు పనిచేయలేరని, ఇంట్లో వంట చేయడం, పిల్లల్ని కనడం వరకే పరిమితం చేయాలని చూస్తున్నారన్నారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి మారన్ సనాతన ధర్మాన్ని రూపుమాపాలని ప్రకటించారని, దీనిపై బీజేపీ నేతలు పెద్ద పెట్టున దుష్ప్రచారం చేశారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి గత పార్లమెంటు ఎన్నికల్లో 17 శాతం ఓటింగ్, 4 పార్లమెంటు సీట్లు గెలిచారని, ఈసారి ఆ ఓట్లు, సీట్లు కూడా రావొద్దన్నారు. రెండు నెలల క్రితం బీఆర్ఎస్ ను ఓడించి సీఎం కేసీఆర్ ను ప్రజలు గద్దె దింపారన్నారు. కార్మికుల వద్ద పోరాటాలను అణిచివేసినందుకే బీఆరెస్ ను ఓడించారన్నారు. 4.30 కోట్ల తెలంగాణ ప్రజల్లో 1.50 కోట్ల మంది కార్మికులున్న విషయాన్ని నాటి సీఎం కేసీఆర్, నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ గుర్తించలేదన్నారు. ఈ సభలో సీఐటీయూ అలిండియా కార్యదర్శి వీఆర్ సింధు, రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడారు. సీఐటీయూ ఆలిండియా కోశాధికారి ఎం సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు జే వెంకటేష్, రాగుల రమేష్, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు గాదె ప్రభాకర్‌రెడ్డి, ఎమ్ రజిత, చక్రపాణి, ఎం చుక్కయ్య, సారంపల్లి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
కౌలు రైతులను ప్రభుత్వమే గుర్తించాలి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కౌలు రైతులను ప్రభుత్వమే గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్ లో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెట్టెం నారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో పశ్య పద్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కౌలు రైతులను గ్రామ సభల ద్వారా ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ కార్యాలయాలలో కౌలు రైతుల పేర్లు నమోదు చేయాలని, భూములు కలిగిన రైతులను విచారించి కౌలు చేస్తున్న రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం వీటిని కౌలు రైతుల జీవనోపాధి కార్డులుగా జారీ చేసి సంవత్సరానికి రూ.12500 ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే విత్తనాలు, ఎరువులు, ఇతర సబ్సిడీలు కూడా కౌలు రైతులకు అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులను సొసైటీలుగా గుర్తించి వారి సాధికారతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సదస్సులో మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, బొల్లు ప్రసాద్, కొంగర రామచంద్రారెడ్డి, పాపి రెడ్డి, ఏపూరి బ్రహ్మం, కంజర భూమయ్య, ప్రభు లింగం, దొండపాటి రమేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొల్లూరి రాజయ్య, కంబాల శ్రీ నివాస్, వీరగోని శంకరయ్య, పాల రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సదస్సుకు రాష్ట్రంలోని 20 జిల్లాల నుండి కౌలు రైతులు హాజరయ్యారు.