Telangana BJP | 8 సీట్లపై కమలం గురి

కమలం పార్టీ గతం కన్నా మరో నాలుగు స్థానాలలో విజయం సాధించి మొత్తం 8 పార్లమెంటు సీట్లను దక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది

  • By: Somu    latest    Feb 24, 2024 12:03 PM IST
Telangana BJP | 8 సీట్లపై కమలం గురి
  • నాలుగు పాత స్థానాల కోసం ఆరాటం
  • మరో నాలుగు కొత్త సీట్లపై పోరాటం


విధాత, హైదరాబాద్: కమలం పార్టీ గతం కన్నా మరో నాలుగు స్థానాలలో విజయం సాధించి మొత్తం 8 పార్లమెంటు సీట్లను దక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లను గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి ఆ నాలుగుతో పాటు అదనంగా మరో నాలుగు సీట్లపై గురి పెట్టింది.


సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు లు మరోసారి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు బిజెపి కేంద్ర నాయకత్వం నుంచి సంకేతాలు అందాయి. వీరితో పాటు మల్కాజిగిరి నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ నుంచి డికె.అరుణ, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు పోటీ చేయనున్నారు. పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధిష్టానం నుంచి సంకేతాలు ఇప్పటికే అందాయి.


మొత్తం 17 స్థానాల్లో 8 స్థానాల్లో విజయబావుటా ఎగురవేయాలని కమలనాథులు దూకుడు పెంచారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రెండోసారి కిషన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇక్కడి నుంచి గెలుపు సునాయసంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించే అభ్యర్థిని బట్టి కిషన్ రెడ్డి భవితవ్యం ఆధారపడి ఉంది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ హైదరాబాద్ నగర అభివృద్ధికి అంతగా పాటుపడలేదనే విమర్శ ఉంది.


ఎంఎంటిఎస్ తో పాటు మెట్రో రైలు విస్తరణ, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, రైల్వే లైన్లు, కొత్త రైళ్ల విషయంలో ఆశించిన స్థాయిలో పని చేయలేదనే అపవాదు ఉంది. సికింద్రాబాద్ నుంచి కాజిపేట వరకు అదనపు రైల్వే లైన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయించలేదు. ఇప్పుడున్న రెండు లైన్లకు అదనంగా మరో లైను వస్తే ప్యాసెంజర్ రైళ్ల రాకపోకలు పెరిగి, ప్రయాణ సమయం తగ్గేదంటున్నారు.


ప్రతి ఏటా ఇచ్చే కేంద్రం ఇచ్చే నిధులు తప్ప అదనంగా నిధులు తీసుకు రాలేకపోయారు. గోల్కోండ కోట చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించి, ఆధునీకరణ పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను ఆధునీకరించి, పర్యాటకులను ఆకర్షించడంలో ఫెయిలయ్యారనే చెప్పాలి. నగరంలో వాహనాల రద్దీ కారణంగా కాలుష్య తీవ్రత పెరిగింది. హైదరాబాద్ నగరానికి మెట్రోపాలిటన్ హోదా తీసుకురాలేకపోయారు.


కరీంనగర్ నుంచి రెండోసారి గెలుపు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బండి సంజయ్ రెండోసారి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికలలో ముందుండి అభ్యర్థులు గెలిచేలా ప్రచారం చేశారు. అయితే కరీంనగర్ లో ఆశించిన విధంగా అభివృద్ధి పనులు చేయించలేదనే దురాభిప్రాయం ఓటర్లలో ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ ఓటమిపాలయ్యారు. బిఆరెస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోవడం మైనస్ గా చెబుతున్నారు.


ఆ ఓటమి ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లో చూపిస్తుందనే భయం సంజయ్ కు పట్టుకుంది. నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీ చేసి గెలుపొందాలనే ఉబలాటంలో ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ సిఎం, బిఆరెస్ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కె.కవిత ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికీ నియోజకవర్గం ప్రజలతో టచ్ లో ఉంటూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె కు సిబిఐ, ఈడి కేసులు ప్రతిబంధకాలుగా పరిణమించాయి.


నిన్నటి వరకు ఈడి నోటీసులు అందుకున్న ఆమె తాజాగా సిబిఐ నోటీసులు అందుకున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించడంతో ఆమె కలవరానికి గురవుతోంది. పార్లమెంటు పోలింగ్ తేదీకి ముందే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కవితను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకునే అవకాశాలను మెండుగా ఉన్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అరవింద్ కు కవిత ముప్పు తప్పినట్లేనంటున్నారు.


ఇక అదిలాబాద్ నుంచి సోయం బాబూరావు మరోసారి రంగంలో నిల్చుని సత్తా నిరూపించుకోవాలనే కసితో పని చేసుకుంటున్నారు. తన నియోకవర్గంతో పాటు చుట్టు పక్కల బిజెపి అభ్యర్థులు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రి డికె.అరుణ పోటీ చేయనున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అరుణకు రాజకీయాల్లో సీనియర్ గా అనుకూలంశాలు ఉన్నాయి.


అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించారు, పార్లమెంటు ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రచారం చేయనున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం విషయానికి వస్తే మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీకి దాదాపు సిద్ధమైంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లో పోటీ చేసి ఓడిపోయారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నారు.


అయితే ఇక్కడి నుంచి పలువురు టికెట్ ఆశిస్తున్నారు. పార్టీకి ఎంతోకాలంగా పనిచేస్తున్నవారు తమకే టికెట్ కేటాయించాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. వారందరినీ కాదని ఈటలకు సీటిస్తే, ఎన్నికల్లో సహకరిస్తారా, వేరే పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకుంటారా అనేది అనుమానంగా ఉంది. గజ్వేల్ లో కెసిఆర్ పై పోటీ చేసి ఓడిపోయినందున ఆయనపై తెలంగాణ సమాజంలో సానుభూతి ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉన్నందున, వారంతా బిజెపి వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.


కాగా ఈ నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థిని నిలిపి గెలిపించుకోవాలనే పట్టుదలతో సిఎం ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థికబలం, అంగబలం ఉన్న అభ్యర్థిని బరిలో నిలుపనున్నారు. చేవెళ్ల నుంచి మరోసారి పోటీ చేసి అదృష్టం పరీక్షించుకునేందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెడీగా ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, బిఆరెస్ నుంచి ప్రస్తుత ఎంపి రంజిత్ రెడ్డి బరిలో ఉండనున్నారు.


త్రిముఖ పోటీలో ఎవరిని విజయం వరించునో కాని ఈ సీటును దక్కించుకోవాలని రాష్ట్ర బిజెపి నాయకత్వం ప్రణాళికలు వేస్తోంది. దుబ్బాక నుంచి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు మెదక్ నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరుంటారనేది తెలియదు కాని రఘును గెలిపించుకోవాలనే పట్టుదలతో పార్టీ కార్యకర్తలున్నారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బిఆరెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ఉత్సాహం చూపిస్తున్నారు.


ఈ సీటు తన కుమారుడికి ఇప్పించుకునేందుకు సుఖేందర్ ప్రయత్నిస్తున్నప్పటికీ బిఆరెస్ నాయకత్వం అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యలో బిజెపి అధినాయకత్వం ఆయనకు గాలం వేసిందంటున్నారు. నల్లగొండ నుంచి పోటీ చేసేందుకు అమిత్ కు అవకాశం ఇస్తామని సమాచారం పంపించింది. అమిత్ కు టికెట్ ఇస్తే ఇద్దరూ పార్టీలో చేరిపోతారనే ఆశతో బిజెపి ఉందని ముఖ్య నాయకుడు ఒకరు చెప్పారు.