BJP | హిందూ.. రాజ్య స్థాపనకు ప్లాన్?
BJP | సిద్ధమవుతున్న సైద్ధాంతిక వేదిక! ఎన్నికలకు ముందు వ్యూహాలు హర్యానా, మణిపూర్ ఘర్షణలు ఈ ప్రణాళికలో భాగమేనా? మణిపూర్‌పై మోదీ మౌనం అందుకే? 2019లో బీజేపీకి 37.4 % ఓట్లు 40 శాతానికి పెంచడమే లక్ష్యం! రాజకీయ విశ్లేషకుల్లో అనుమానాలు న్యూఢిల్లీ: భారత దేశాన్ని పూర్తి హిందూ రాజ్యంగా మార్చాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదా? 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సైద్ధాంతిక వేదికను సిద్ధం చేయాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యూహ రచన చేస్తున్నాయా? హిందుత్వ ఎజెండా అమలులో […]

BJP |
- సిద్ధమవుతున్న సైద్ధాంతిక వేదిక!
- ఎన్నికలకు ముందు వ్యూహాలు
- హర్యానా, మణిపూర్ ఘర్షణలు ఈ ప్రణాళికలో భాగమేనా?
- మణిపూర్‌పై మోదీ మౌనం అందుకే?
- 2019లో బీజేపీకి 37.4 % ఓట్లు
- 40 శాతానికి పెంచడమే లక్ష్యం!
- రాజకీయ విశ్లేషకుల్లో అనుమానాలు
న్యూఢిల్లీ: భారత దేశాన్ని పూర్తి హిందూ రాజ్యంగా మార్చాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదా? 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సైద్ధాంతిక వేదికను సిద్ధం చేయాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యూహ రచన చేస్తున్నాయా? హిందుత్వ ఎజెండా అమలులో భాగంగానే మణిపూర్, హర్యానాలో అల్లర్ల అణిచివేతలో మోదీ సర్కారు కావాలనే తాత్సారం చేసిందా? అందుకే పార్లమెంట్లో మణిపూర్ అంశంపై మాట్లాడటానికి మోదీ ఇష్టపడలేదా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది.
వరుసగా మూడోసారి కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడానికి బీజేపీ-ఆర్ఎస్ఎస్ అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందువుల ఓట్లు గంపగుత్తగా బీజేపీ ఖాతాలో పడాలని, ఇందుకు హిందు ముస్లింల మధ్య విభజన రేఖలు గీయాలని భావిస్తున్నదని పలువురు ప్రతిపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2019లో వచ్చిన 37.4 శాతం ఓట్లను 40 శాతానికి పెంచుకోవాలని చూస్తున్నదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు ఊసిగొల్పుతున్నదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హర్యానా అల్లర్లు ఇందుకు తాజా ఉదాహరణగా చూపుతున్నారు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం ప్రజాస్వామ్య రాజకీయాలకు గట్టి పునాది వేసింది. జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశారు. భారతీయులందరికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సమానంగా కల్పించారు. అందరికీ సమాన హక్కులు కల్పించారు. అలాంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తారుమారు చేయడం మోదీ ప్రతిపాదకుల వ్యూహాత్మక లక్ష్యంగా మారినట్టు తెలుస్తున్నది.
స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచే కొందరు విభజన బీజాలు నాటారు. బ్రిటీష్ వలస పాలనను అంతం చేయడంలో ఆసక్తి చూపని ముస్లిం లీగ్ నేతలు కొందరు, హిందూ మహాసభ నాయకులు సావర్కర్, నాథూరామ్ గాడ్సే మత యుద్ధాలను సృష్టించడం ద్వారా తమ సిద్ధాంతం, భావజాలాన్ని గెలిపించు కోవాలని భావించారని సీనియర్ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కొంత విజయం సాధించారని అంటున్నారు. ముహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని లీగ్ వలసవాద ప్రోత్సాహం, సహాయంతో భారత విభజన జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆ సమయంలో కొన్ని శక్తులు రక్తపుటేరులు పారించాయి. నాథూరామ్ గాడ్సే గాంధీని పొట్టనపెట్టుకున్నాడు.
గత పదేండ్లుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంరక్షణలో అపరిమితమైన రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారన్న విమర్శలకు కొదవే లేదు. గాంధీ ఆలోచనలను రూపుమాపి, భారత దేశాన్ని ఏ విధంగా అయినా సైద్ధాంతికంగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, అందులో భాగంగానే మత హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శిస్తున్నారు. మణిపూర్ అల్లర్లు చల్లారక పోవడానికి, హర్యానాలో కొత్తగా ఘర్షణలు చెలరేగడానికి కారణమవుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్వయంగా మోదీ రంగంలోకి దిగి ప్రచారం చేసినా కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం, కాంగ్రెస్ అద్భుతమైన విజయం సాధించడం, భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజల్లో ఆదరణ పెరగడం వంటి పరిణామాలు సహజంగానే బీజేపీ శ్రేణులకు రుచించేవి కాదు. ఇదే తరుణంలో 26-పార్టీల ప్రతిపక్ష కూటమి ఇండియా ఏర్పడటం, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి దానికి అనూహ్య మద్దతు లభించడం బీజేపీ శక్తుల అత్యుత్సాహం నీరుగారింది. తమ సైద్ధాంతిక లక్ష్యానికి ప్రమాదం పొంచి ఉన్నదని గమనించిన ఆర్ ఎస్ ఎస్ శక్తులు మరికొన్ని అస్త్రాలను సంధించాయి.
పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించడంలో బీజేపీ గెలిచాననుకున్నా.. మళ్లీ పార్లమెంట్లో అడుగుపెట్టడం మింగుడుపడలేదు. ఈ క్రమంలోనే రాహుల్‌పై ప్లయింగ్ కిస్ ఆరోపణలు కూడా చేశాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ద్వారా హిందూ రాజ్య లక్ష్యాన్ని చేరుకోవడానికే ఎన్నికల అధికారుల నియమాకాలపై పార్లమెంట్లో బిల్లు పెట్టాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
దేశంలోని దాదాపు సగం మంది హిందూ ఓటర్ల ఆమోదాన్ని పొందటం బీజేపీ లక్ష్యంగా కనిపిస్తున్నది. మతపరంగా ప్రజలను విభజించ గలిగితే దాదాపు 40 శాతం కంటే ఎక్కువ ఓట్లను దేశవ్యాప్తంగా గెలుచుకోవచ్చని భావిస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికలలో 37.4 శాతం ఓట్లను పొందిన నేపథ్యంలో దానిని 40 శాతానికి పెంచుకోవడానికి కుట్రలు పన్నుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బుల్డోజర్ విధానం కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొంటున్నదనేది బహిరంగ రహస్యమే. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఇవి కనిపిస్తాయి. హిందూ రాజ్య స్థాపన దిశలో ఇటీవలే చట్టాల పేర్లు మార్చిన బీజేపీ సర్కారు.. మూడో సారి కూడా అధికారంలో వచ్చి న్యాయ, పోలీసు, పరిపాలన, మీడియా రంగాల్లో తమ భావజాల వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించాలని చూస్తున్నదని ప్రగతిశీల శక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదే జరిగితే దేశం మరింత ప్రమాదం పడుతుందని అంటున్నాయి.