Komati Reddy| ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాహుల్ గాంధీ అనర్హత వేటుపై కాంగ్రెస్ నిరసనలు బొమ్మలరామరంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా విధాత: Komati Reddy Venkat Reddy | ఏఐసీసీ నేత ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, దిష్టిబొమ్మ దహనాలు నిర్వహించారు. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, దేవరకొండ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోడీ దిష్టిబొమ్మను […]

Komati Reddy| ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • రాహుల్ గాంధీ అనర్హత వేటుపై కాంగ్రెస్ నిరసనలు
  • బొమ్మలరామరంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా

విధాత: Komati Reddy Venkat Reddy | ఏఐసీసీ నేత ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, దిష్టిబొమ్మ దహనాలు నిర్వహించారు. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, దేవరకొండ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ పై అనర్హుత వేటు వేసిన మార్చి 23 తేదీ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిపై కుట్రలు తగదన్నారు.

పార్టీ నేతలంతా ఆయన వెంటే ఉంటామని, అవసరమైతే పదవులకు రాజీనామాకైనా సిద్ధమన్నారు. దేశం కోసం ఆయన తండ్రి, నాయనమ్మ ప్రాణాలు విడిచారని, తల్లి ప్రధాని పదవి అవకాశాన్ని వదులుకున్న గొప్ప కుటుంబం అన్నారు. దేశ ప్రజలంతా ఒక్క తాటిపై ఉండాలని నిరంతరం ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు.

భారత్ జోడో యాత్ర పేరుతో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 3500కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు. మైనస్ డిగ్రీల చలిలో కూడా టీషర్ట్ పైనే జోడో యాత్ర చేశారని, ఎన్నికల ప్రచారంలో ఎప్పుడో అన్న ఒక మాట పట్టుకుని కుట్రలు చేయడం కరెక్ట్ కాదన్నారు.

సూరత్ కోర్టు తీర్పు ఇచ్చాక బెయిల్ ఇచ్చి అప్పీల్ కు 30 రోజుల సమయం ఇచ్చిందని, కానీ, 24 గంటలు గడవక ముందే అనర్హత వేటు ప్రకటించడం దుర్మార్గమన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడాలని, అంతేగానీ ఇలా కుట్రలు చేయకూడదన్నారు. జోడోయాత్రలో రాహుల్ గాంధీ రాజకీయాల కంటే ప్రజలంతా ఐక్యంగా ఉండాలని చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీని, గాంధీ ఫ్యామిలీని దెబ్బ తీయాలని మోడీ చేస్తున్న ఈ చర్యలను ఖండిస్తున్నామన్నారు.

రాహుల్ పై అనర్హతకు వ్యతిరేకంగా, ప్రభుత్వ నిరంకుశ చర్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. కేంద్రం కుట్రలను తట్టుకుంటూ.. రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ కాంగ్రెస్ శ్రేణుల గుండెలకు హత్తుకు పోయిందన్నారు. దేశం కోసం తన గొంతు విప్పుతూనే ఉంటానని ఆయన అన్నారని, ఆ పోరాటానికి మేమంతా అండగా ఉంటామన్నారు.. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తామంతా సిద్ధమన్నారు.

గాంధీ ఫ్యామిలీకి పదవులు లెక్కకాదన్నారు. ప్రధాన మంత్రి పదవి వాళ్లకు ముఖ్యం కాదని, ప్రధాని పదవీ అవకాశాన్ని వదులుకొని ఆనాడు మన్మోహన్ ను పీఎం చేశారన్నారు. గాంధీ కుటుంబం వలనే ఈనాడు పేదలు రెండు పూటలా భోజనం చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత వారిదేనన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మా పోరాటం ఆగదని, రాహుల్ వెంట ఉండి కేంద్రం చర్యలను తిప్పికొడతామన్నారు.