Telangana | ఎన్‌డీఏలోకి బీఆరెస్?
లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్, బీజేపీ మధ్య పొత్తు పొడవనున్నదా? ఇప్పటిదాకా రహస్యబంధమన్న ఆరోపణలు వచ్చిన రెండు పార్టీల వ్యవహారం ఇకపై బాహాటం కానున్నదా?

- లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పొడుస్తుందా?
- ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతల మంతనాలు!
- కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక మతలబేంటి?
- నరేంద్రమోదీ, అమిత్‌షాలతో సమావేశం!
- ఆ చర్చల్లో పొత్తులపై స్పష్టత వచ్చే చాన్స్
- కాళేశ్వరం అక్రమాలపై కాంగ్రెస్ టార్గెట్
- ఇప్పటికే పలు నివేదికల బహిర్గంతం
- విచారణ జరిపితే కీలక నేతల మెడకు!
- రక్షా కవచం కోరేందుకే ఢిల్లీకి కేసీఆర్?
- మొన్నటిదాకా దుమ్మెత్తుకున్న నేతలు
- ఇప్పుడు ప్రశంసలు కురిపించుకుంటారా?
- బీజేపీతో రహస్య ఒప్పందంపై అనుమానాలు
- పొత్తు పెట్టుకోవడం దాన్ని అంగీకరించడమే
- అది బీఆరెస్‌కు ఆత్మహత్యా సదృశ్యమే
- తేల్చి చెబుతున్న రాజకీయ విశ్లేషకులు
విధాత: లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్, బీజేపీ మధ్య పొత్తు పొడవనున్నదా? ఇప్పటిదాకా రహస్యబంధమన్న ఆరోపణలు వచ్చిన రెండు పార్టీల వ్యవహారం ఇకపై బాహాటం కానున్నదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడిని ఉపయోగించుకోవాలని బీఆరెస్ చూస్తున్నదా? రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడుకు అడ్డు కట్ట వేయడానికి, గత పాలనలో అక్రమాలపై విచారణలను తప్పించుకునేందుకు బీఆరెస్ నేతలు బీజేపీ నుంచి రక్షా కవచాన్ని కోరుతున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆరెస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక మతలబేంటి? ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ రాష్ట్ర నాయకులు ఒకవైపు బీఆరెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నా.. ఢిల్లీ స్థాయిలో మంతనాలు నడుస్తున్నాయని విశ్వసనీయంగా తెలుస్తున్నది.
లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు దిశగా బీఆరెస్ కీలక నేతలు బీజేపీ అగ్రనాయకులతో చర్చలు జరిపారని సమాచారం. పైగా.. బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఒకరిద్దరు బీఆరెస్ నాయకుల వద్దకు బీజేపీ అధిష్ఠానం దూతలను పంపిందని తెలుస్తున్నది. ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన సమావేశమవుతారని చర్చలు వినిపిస్తున్నాయి. ఎన్డీయేలో చేరికపై ఈ సమావేశం తర్వాత స్పష్టత రానున్నది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గత బీఆరెస్ పాలనలో అక్రమాలపై దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతి, అక్రమాలతో పాటు, ధరణిలో అక్రమాలపై ఫోకస్ చేసింది. ఇప్పటికే ఫార్ములా- ఈ రేసులో ఎలాంటి అనుమతి లేకుండా ఒక ఐఏఎస్ అధికారి రూ.53 కోట్లు చెల్లించడంపై నోటీస్‌లు జారీ చేసింది. హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణపై ఏసీబీ విచారణలో వెలుగు చూస్తున్న అక్రమాలు.. గత ప్రభుత్వ పెద్దలతో లింకులను సూచిస్తున్నాయని చెబుతున్నారు. వీటిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు దిగితే బీఆరెస్ నేతలను కూడా టచ్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆరెస్‌ను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కాచుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహంగా ఉండాలన్న నిర్ణయానికి బీఆరెస్ పెద్దలు వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేసీఆర్‌కు ఏమాత్రం పొడ కూడా గిట్టని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది.
గత పదేళ్లలో రేవంత్ రెడ్డిని బీఆరెస్ అధినేత కేసీఆర్ టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలన్నీ కేసీఆర్‌ను ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అక్రమాలపై నిగ్గు తేల్చడానికి సిద్దమైందమైదని, కాగ్ రిపోర్ట్‌ను, విజిలెన్స్ నివేదికను వెల్లడించిందని గుర్తు చేస్తున్నారు. జాతీయ ప్రాజెక్ట్ భద్రత కమిటీ నివేదిక కూడా బహిరంగ పరిచింది. ఇలా మూడు నివేదికలతో పాటు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్ట్‌లపై శ్వేత పత్రం విడుదల చేసిందని చెబుతున్నారు.
అవసరం ఎంతటి వాడినైనా..
కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తానన్న కేసీఆర్ ఒక దశలో బీఆరెస్ విధానాలే దేశానికి ప్రత్యామ్నాయం అని చెప్పుకున్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, తమకు బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అని అన్నారు. దేశాన్ని ఈ రెండు పార్టీలు నాశనం చేశాయని విమర్శలు గుప్పించారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో ఏకపక్షంగా కలిపినప్పుడు మోదీని ఫాసిస్టు అంటూ విరుచుకుపడ్డారు. ఒక దశలో బీజేపీ నేతలను హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ రాజకీయాల్లోకి వస్తానంటే బీజేపీ నేతలు గజ్జున వణికిపోతున్నారంటూ భీకర వచనాలు పలికారు.
కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ తల రాత మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ గెలుపును జీర్ణించుకోవడానికి బీఆరెస్ నేతలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి హాజరుకావడానికి కేసీఆర్ ఇబ్బంది పడుతున్న పరిస్థితిని పలువురు ప్రస్తావిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో రక్షణ కోసం ఎన్డీయే పంచన చేరాలని బీఆరెస్ నాయకత్వం భావించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మెరుగైన సీట్లు సాధించే చాన్స్
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆరెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి రెండు సీట్లకు మించి గెలిచే అవకాశం లేదన్న చర్చ జరుగుతున్నది. బీఆరెస్ అంతర్గతంగా సర్వేల్లోనూ ఇదే తేలిందని సమాచారం. కాంగ్రెస్ 10 నుంచి 11 స్థానాల వరకు గెలిచే అవకాశాలున్నట్లు సర్వే పేర్కొన్నట్టు తెలిసింది. మరో వైపు ఒక్కొక్కరుగా బీఆరెస్ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు.
అనేకచోట్ల బీఆరెస్ నుంచి క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌లో కి వలసలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనకు వచ్చి ఉంటారన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు, ఓట్లు పెరిగాయి. ఈ రెండు పార్టీల ఓట్లు కలిస్తే కాంగ్రెస్ విజయాలను అడ్డుకోవచ్చన్న ఆలోచన కూడా ఇందుకు కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అంత సాహసం చేస్తారా?
బీజేపీతో బీఆరెస్ రహస్య అవగాహన కుదుర్చుకున్నదని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ప్రచారం కూడా బీఆరెస్‌ను ఇరకాటంలో పెట్టింది. ఇప్పుడు నేరుగా పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశమేనని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.