BRS , BJP నిన్న వైరం.. నేడు దోస్తానా ఏమా కథా.. ఎందుకీ మార్పు

BRS , BJP | విధాత: రాష్ట్ర రాజకీయాలలో ఉప్పు నిప్పుగా ఉన్న బీఆరెస్‌, బీజేపీల మధ్య అనుబంధం చిగురిస్తోందా? గవర్నర్ తమిళిసై.. సీఎం కేసీఆర్ ల మధ్య నిన్నటిదాకా సాగిన వైరం ఆకస్మాత్తుగా దోస్తానగా మారిపోవడం చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌ను బీఆరెస్‌గా మార్చి బీజేపీపై, ఆ పార్టీ అధిష్టానం నరేంద్ర మోడీ, అమిత్‌షాలపై ఒంటికాలి మీద లేచిన గులాబీ బాస్ వైఖరీలో ఇంతలో అంతటి మార్పు ఎలా సాధ్యమైందన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో సాగుతోంది. తెరవెనుక మతలబు […]

  • By: krs    latest    Aug 27, 2023 11:22 AM IST
BRS , BJP నిన్న వైరం.. నేడు దోస్తానా ఏమా కథా.. ఎందుకీ మార్పు

BRS , BJP |

విధాత: రాష్ట్ర రాజకీయాలలో ఉప్పు నిప్పుగా ఉన్న బీఆరెస్‌, బీజేపీల మధ్య అనుబంధం చిగురిస్తోందా? గవర్నర్ తమిళిసై.. సీఎం కేసీఆర్ ల మధ్య నిన్నటిదాకా సాగిన వైరం ఆకస్మాత్తుగా దోస్తానగా మారిపోవడం చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌ను బీఆరెస్‌గా మార్చి బీజేపీపై, ఆ పార్టీ అధిష్టానం నరేంద్ర మోడీ, అమిత్‌షాలపై ఒంటికాలి మీద లేచిన గులాబీ బాస్ వైఖరీలో ఇంతలో అంతటి మార్పు ఎలా సాధ్యమైందన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో సాగుతోంది. తెరవెనుక మతలబు ఏమిటన్నది సామాన్య జనానికి మాత్రం అంతుపట్టడం లేదు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు..కానీ గత ఆరు నెలలుగా తెలంగాణ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం కొన్ని గుణాత్మక మార్పులు జరుగుతున్నట్లు మేధావివర్గం గుర్తిస్తోంది. సీఎం కేసీఆర్ ఉన్నపళంగా బీజేపీతోనూ, గవర్నర్‌తోనూ తన వైఖరిని మార్చుకోవడం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనుండటంతో సహజంగానే ఈ పరిణామం చర్చనీయాంశమైంది.

అయితే ఇప్పటిదాకా కేసీఆర్ తానా అంటే తందనా అన్నట్లుగా బీజేపీని, గవర్నర్‌ను తిట్టిపోసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ వైఖరి మార్చుకోవడం ప్రజాక్షేత్రంలో వారికి ఇబ్బందికరమే. కాగా గవర్నర్‌తో సీఎం కేసీఆర్ తాజా నెయ్యం ఫలితాలు ఎలా ఉన్నా ఇంతకాలం అనుసరించిన కయ్యంతో పరిపాలన, విధాన పరమైన బిల్లుల ఆమోదంలో జరిగిన జాప్యం రాష్ట్ర ప్రగతికి, పాలనా పురోగతికి చేసిన నష్టం మాత్రం మారిపోదు.

నిన్న కయ్యం.. నేడు నెయ్యం

నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవాలకు పిలవకుండా, ప్రోటోకాల్‌ మర్యాద కూడా ఇవ్వకుండా అవమానించినట్లు మొన్నటివరకూ బీజేపీ నేతలు, గవర్నర్ కార్యాలయం కూడా బీఆర్ ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడింది. సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య సయోధ్య ఎలా సాధ్యమైందనే విషయం గులాబీ బాస్ కే తెలియాలి అంటున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు.

గవర్నర్ ఎట్ హోంకు కూడా హాజరు కాకుండా, ఆమె పర్యటనలకు విమానం సైతం ఇవ్వకుండా, యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానించకుండా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశ సమావేశాలపై గవర్నర్‌కు వ్యతిరేకంగా కోర్టులలో పోరాటాలకు దిగిన కేసీఆర్ వైఖరిని, నిన్నమొన్న సయోధ్యను జనం యాది చేసుకుంటున్నారు. రాజభవన్ ను రాజకీయ భవన్ గా, గవర్నర్ ను బీజేపీ ఏజెంట్‌గా మాట్లాడిన మాటలు ఇంకా సోషల్ మీడియా పోస్టుల్లో కనబడుతూనే ఉన్నాయి.

గవర్నర్ దగ్గరకు వెళ్లాల్సివస్తుందన్న ఆలోచనతో ఈటెల రాజేందర్ బర్తరఫ్ తో ఖాళీయైన కేబినెట్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కూడా సీఎం కేసీఆర్ ఇంతకాలం దూరంగా ఉన్నారు. గవర్నర్ తమిళ సై కూడా తనను సీఎం కేసీఆర్ మహిళనన్న గౌరవం కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారంటు వాపోయారు.

గవర్నర్ పట్ల అంతటి వ్యతిరేకత ప్రదర్శించిన సీఎం కేసీఆర్ అకస్మాత్తుగా గవర్నర్‌కు రెడ్ కార్పెట్ వేసి, సచివాలయం ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి పిలిచి దగ్గరుండి సచివాలయం అంత తిప్పి చూపించి తన చాంబర్‌లో హైటీ ట్రీట్ ఇచ్చిన తీరు చూసి రాజకీయవర్గాలు, సొంత పార్టీ నేతలు, ఉన్నతాధికారులు సైతం ఖంగుతిన్నారు. ఇక సామాన్య జనం కేసీఆర్ వైఖరిపై విస్మయం చెందడంలో విశేషం లేదు. దీనిని కొందరు కేసీఆర్ చాణక్యం అని చెబితే మరికొందరు పచ్చి అవకాశవాద రాజకీయం అంటూ విమర్శిస్తున్నారు.

కత్తులు నూరారు.. కలిసిపోయారు

గవర్నర్ తో సీఎం కేసీఆర్ వైరం అటు ఉంచితే ప్రధాని మోడీ, అమిత్ షాలను సైతం సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. మోదీ, షాలు మమ్మల్ని ఏమి చేయలేరంటూ బహిరంగ వేదికలపై బస్తీమే సవాల్ అన్నారు. అటు ప్రధాని మోడీ సైతం తన రాష్ట్ర పర్యటన సందర్భంగా దేక్‌లేంగా(చూసుకుందాం) అన్నట్లుగా చేసిన హెచ్చరికలతో నిజంగానే బీజేపీకి, బీఆరెస్‌కు గట్టిపోరాటమే సాగుతుందన్న వాతావరణ నెలకొంది.

దీనికి తోడు బండి సంజయ్ పోరాటాలు సైతం రెండు పార్టీల మధ్య తీవ్ర వేడినే రగిలించాయి. స్వయంగా ప్రధానీ మోడీ, అమిత్ షా, నడ్డాలు సైతం బహిరంగ సభలలో కాళేశ్వరం సీఎం కేసీఆర్‌కు ఏటీఎం అని, తెలంగాణలో కేసీఆర్ అవినీతి కుటుంబ పాలన అంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. కౌంటర్‌గా సీఎం కేసీఆర్ సైతం టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చేసి జాతీయ రాజకీయాల్లో కమలం పార్టీపై తొడగొట్టారు.

రైతు ఉద్యమంలో, 2000 నోట్ల రద్దులో మోడీకి వ్యతిరేకంగా ఊదరగొట్టారు. సింగరేణి విక్రయం, ధాన్యం కొనుగోలు సమస్యలపై కేంద్రాన్ని బదనాం చేసేలా కౌంటర్ పాలిటిక్స్‌తో అటాక్ చేశారు. బీజేపీ సైతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసినంత హడావుడి చేసింది. ఐటి, ఈడి, సీబీఐ దాడులు ఆరు నెలల క్రితం వరకూ తెలంగాణ రాష్ట్రంలో ఉదృతంగా కొనసాగాయి.

నిన్నటికి నిన్న ఆర్టీసీ విలీన బిల్లుపై అసెంబ్లీ వేదికగానే కొన్ని సంకుచిత శక్తులు బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశాయంటూ ఇటీవల సమావేశాల్లో కేసీఆర్ విమర్శలు చేశారు. ఇంతలోనే గంగ చంద్రముఖీ.. చంద్రముఖీ గంగగా మారిపోయినట్లు గవర్నర్ పట్ల, బీజేపీ పట్ల కేసీఆర్‌ తీరులో గుణాత్మక మార్పు రావడం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనటానికి నిదర్శనంగా నిలిచింది.

యువరాజు రాయబారమేనా

గవర్నర్ తో గాని, బీజేపీ పార్టీతో రహస్య స్నేహంపై గాని బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ వైఖరీ మారడానికి మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో మొగ్గ తొడిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమిత్‌షాతో కేటీఆర్ సంధి చర్చలతోనే బీజేపీ, బీఆరెస్‌ల మధ్య తెర వెనుక సయోధ్య కుదిరి కవిత అరెస్టు అటకెక్కడంతో పాటు దర్యాప్తు సంస్థల దాడులకు బ్రేక్ పడిందంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ-బీఆర్ ఎస్ గొడవల క్రమంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందన్న వార్తలు ఇరు పార్టీలను కలవరపెట్టాయని చెబుతున్నారు. కర్ణాటక ఫలితాలతోనే డీలాపడ్డ కమలం అధినేతలకు తెలంగాణలో హస్తం పైకిలేస్తోందన్న సర్వే రిపోర్టులు బీఆర్ ఎస్‌-బీజేపీల షరతులతో కూడిన స్నేహానికి దారితీసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడి స్థానం నుంచి తొలగింపు, గవర్నర్ తో రాజీ వంటి అనూహ్య మార్పులు జరిగాయని చెబుతున్నారు.

ఈ పరిణామాలలో మరో ఆసక్తికర కోణం చిన జీయర్ స్వామితో రాజీ కూడా ఇందులో ఒక భాగంగానే చెబుతున్నారు. దుండిగల్ సమతామూర్తి ప్రారంభోత్సవ సమయంలో శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో జీయర్ పై పంతం పెట్టుకున్న సీఎం కేసీఆర్ మొత్తానికి ఆ వివాదం నుంచి శాంతించారని చెబుతున్నారు. జీయర్ కూడా యాదాద్రి సందర్శించడానికి వెళ్లడం వారి మధ్య సయోధ్యకు, బీజేపీతో, గవర్నర్‌తో రాజీకి ముడిపడి ఉందన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.

అంతకుముందు యాదాద్రి శంకుస్థాపన, నిర్మాణ దశలో చిన జీయర్ స్వామితో కలసి సాగిన కేసీఆర్ సమతా మూర్తి ప్రారంభోత్సవం సందర్భంగా రేగిన వివాదంతో జీయర్‌ను యాదాద్రి ఆలయ పునః ప్రారంభోత్సవానికి సైతం ఆహ్వానించకుండా దూరం పెట్టారు. ఇటీవల పరిణామాల క్రమంలో మళ్లీ వీరి మధ్య కూడా సయోధ్య కుదిరినట్లుగా చెబుతున్నారు.

బిల్లుల కోసం రాజీపడ్డారా..

బీజేపీతో, గవర్నర్‌తో బీఆరెస్‌ అధినేత సీఎం కేసీఆర్ రాజీ వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి- అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఆమోదించుకోవాల్సిన బిల్లులు అని ప్రతిపక్షనేతలు చెబుతున్నారు. మూడోసారి అధికార సాధన వ్యూహం, అన్నిటికీ మించి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణలో వేగంగా పుంజు కుంటున్న కాంగ్రెస్ గ్రాఫ్ బీఆరెస్‌-బీజీపీల మధ్య అంతర్గత స్నేహానికి బలమైన కారణాలుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బిల్లుల విషయం చూస్తే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండడం పరిపాలన పరంగా, రాజకీయంగా కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే పరిస్థితి ఏర్పడింది.

ఆర్టీసీ విలీన బిల్లు, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీ సిఫారసు ఫైల్ సహా 12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం మరోసారి రానిపక్షంలో బిల్లులు పెండింగ్‌లో పడిపోతే ఇబ్బంది పడతామన్న భావనతో గవర్నర్ తో సీఎం కేసీఆర్‌ రాజీపడినట్లు చెబుతున్నారు.

ఇలా స్నేహపూర్వకంగా ఉంటూ పెండింగ్‌ బిల్లులను గట్టెక్కించుకోవచ్చన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ గవర్నర్ తో వైరానికి ఫుల్‌స్టాప్ పెట్టారంటున్నారు. బీజేపీతో మొదలైన రాజీ బంధంలో భాగంగా కూడా గవర్నర్ తో కూడా రాజీకి వచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే కేంద్రంతో ఎన్నికలవేళ రాజీ కుదరకపోతే ఎన్నికలను ఆలస్యం చేసే పరిస్థితులు ఉంటాయన్న ఆందోళన కూడా కేసీఆర్ రాజీ ధోరణికి ఒక కారణం కావచ్చంటున్నారు.

కన్నడ గాలికి జడిసే..

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాతా తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పెరగడం, వరుసగా రెండు పర్యాయాల తమ ప్రభుత్వం పట్ల ముఖ్యంగా బీఆరెస్‌ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, మూడోసారి అధికార సాధనకు ప్రతికూలంగా పరిణమిస్తాయని కేసీఆర్ అంచనాకు రావడం వల్ల ఇరుపార్టీల మధ్య అనివార్యమైన స్నేహం మొదలైనట్లు అంటున్నారు.

సొంత పార్టీలోనూ ముందేన్నడూలేని రీతిలో అసమ్మతి కూడా కేసీఆర్ ను ఆత్మ రక్షణలో పడేస్తుందని, అందుకే ఇంతకుముందున్న నియంతృత్వ విధానాన్ని పక్కన పెట్టేసి తనను ధిక్కరించిన పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి, చెన్నమనేని రమేష్ బాబుకు కేబినెట్ హోదా, తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హనుమంతరావు, రాజయ్య వంటి వారికి బుజ్జగింపులతో మెట్టు దిగారు.

ఇదంతా కేసీఆర్ నైజానికి విరుద్ధమైన పనే. ఇక అధికార సాధన పట్ల ,ఓట్ల లెక్కలలో సీఎం కేసీఆర్ చేసుకున్న సర్వేల లెక్కల మేరకు అధికార వ్యతిరేక ఓటు చీలి బీజేపీ లబ్ధిపొందకుండా కాంగ్రెస్ ఖాతాలోకి పోవడమే అంటున్నారు. వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలిపోయి, బీఆరెస్ కు అనుకూలించే వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌, బీజేపీతో రాజీకి వచ్చినట్లు నమ్ముతున్నారు.

కేసీఆర్ పాజిటివ్ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి ఇప్పటిదాకా పెండింగ్‌లో పెట్టిన రుణమాఫీ, ఆర్టీసీ విలీనం, వీఆర్‌ఏ, జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ, అంగన్‌వాడీలకు వరాలు, బీసీ, మైనార్టీ బంధులను అమల్లోకి తెచ్చారు. అందుకు గవర్నర్ సహకారం అంటే బీజేపీ తో సయోధ్య చాలా అవసరమైంది. సంక్షేమ పథకాలు, వివిధ వర్గాలకు ఇచ్చిన, ఇవ్వనున్న వరాలు ఎన్నికలలో తన ఓటు బ్యాంకును నిలబెడుతాయని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ ఎన్నికల స్ట్రాటజీ కోసం బీజేపీకి దగ్గరయ్యే క్రమంలో కేసీఆర్‌ కమ్యూనిస్టులను సైతం దూరం పెట్టేశారంటున్నారు. కమ్యూనిస్టులు కూడా ఎన్నికల బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింత చిన్నాభిన్నమై అంతిమంగా తమకు ప్రయోజనకరమవుతుందని కేసిఆర్ భావన. ఇక్కడ బీఆరెస్‌ను గుడ్డిగా నమ్మి మోసపోయిన కమ్యూనిస్టుల కథ మరో విషాద గాధ. తెలంగాణ వచ్చాక మాది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని కేసిఆర్ చెప్పినా..ఇండియా కూటమి కహాని వినిపించినా ఇవన్ని అసలు కారణాలు కావనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణ ఇస్తే మా పార్టీని కాంగ్రెస్ లో కలుపుతామని గతంలో కాంగ్రెస్ కే హ్యాండిచ్చిన కేసీఆర్ మోసం ముందు కమ్యూనిస్టుల పొత్తు మోసం కథ చాలా చిన్నదేనంటున్నారు. ఎన్నికల్లో మూడోసారి అధికార పీఠానికి ఏమైనా సీట్లు తగ్గితే ఎంఐఎం సహకారంతో పాటు కాంగ్రెస్ కు దూరంగా ఉండే బీజేపీకి వచ్చే సీట్ల మద్దతు తీసుకోవచ్చన్న వ్యూహంతో కూడా సీఎం కేసీఆర్ బీజేపీతో తెరవెనుక సయోధ్యకు సిద్ధపడటానికి మరో బలమైన కారణంగా విపిస్తుంది.

ఇదే సమయంలో బీజేపీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ను నిలువరించేందుకు బీఆరెస్‌తో లోపాయికారిగా దగ్గర అయిందన్న వాదన కూడా ఉంది. అంతిమంగా తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే రాజకీయ వ్యూహాల నేపధ్యంలోనే బీఆరెస్‌, బీజేపీలు అనివార్యంగా లోపాయికారి సయోధ్యకు రావాల్సివచ్చిందంటూ అందులో భాగంగానే గవర్నతో రాజీ అంటూ రాజకీయ విశ్లేషకుల తేల్చేసున్నారు.

ఈ పరిణామాలను బీజేపీకి బీఆరెస్‌, మజ్లీస్‌లు బీటీమ్‌లు అంటూ ప్రచారం చేసి ఎన్నికల్లో వాటికి రాజకీయ ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పుకుని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్‌ చేసే ప్రయత్నం ఎంతమేరకు సఫలీకృతమవుతుందన్నది వేచి చూడాల్సివుంది.