మరో రెండు ఎంపీ స్థానాలకు బీఆరెస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌

పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు

మరో రెండు ఎంపీ స్థానాలకు బీఆరెస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌
  • అదిలాబాద్‌కు ఆత్రం సక్కు..మల్కాజిగిరి రాగిడి లక్ష్మారెడ్డి
  • 11స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పూర్తి
  • మిగిలిన స్థానాల్లో కేసీఆర్‌, కేటీఆర్‌, కవితల పోటీకి చాన్స్‌ ?
  • అదిలాబాద్ పార్లమెంటు సమీక్షకు మాజీ మంత్రి అల్లోలా డుమ్మా

విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ బీఆరెస్ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ జిల్లా ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేణుగోపాలాచారి, జోగు రామన్న, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కుకు ఆయనకు శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్‌ ఇవ్వలేదు. లోక్‌సభకు అవకాశం ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆయనకు టికెట్ ఖరారు చేశారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డిని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. కాగా కేసీఆర్ నిర్వహించిన అదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సమావేశానికి జిల్లా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం బలపడింది.

ఇప్పటి వరకు మొత్తం 17లోక్‌సభ స్థానాల్లో మల్కాజిగిరి రాగిడి లక్ష్మారెడ్డి, అదిలాబాద్ ఆత్రం సక్కులతో పాటు 11స్థానాల అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్లకు కాసాని జ్ఞానేశ్వర్‌, జహీరాబాద్‌కు గాలి అనిల్‌కుమార్‌, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్‌రావు, మహాబూబాబాద్ నుంచి మాలోతు కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌, మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి బాజీరెడ్డి గోవర్ధన్‌, వరంగల్‌కు కడియం కావ్య, అభ్యర్థిత్వాలను ప్రకటించారు. ఇక హైదరాబాద్‌, మెదక్‌, సికింద్రాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, భువనగిరి స్థానాల అభ్యర్థులు ఖరారు కావాల్సివుంది. వీటిలో ఏదో ఒక స్థానం నుంచి కేసీఆర్ లేదా కేటీఆర్‌, కవిత బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తుంది.