BRS, కమ్యూనిస్టుల ఎజెండా ఒక్కటే: కూనంనేని
BRSతో నడిచినా.. పోరాటంలో నో కాంప్రమైజ్ బీజేపీని నిలవరించటమే లక్ష్యం మునుగోడు తరహాలోనే ఖమ్మంలో కూడా బీజేపీని నిలవరిస్తాం బీఆర్ఎస్తో కమ్యూనిస్టులకు రాజకీయ సారూప్యత ఉన్నది ఎన్నికలు, కార్యాచరణపై ఉమ్మడి నిర్ణయం తీసుకుంటాం ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు డి.రాజా, పినరయి విజయన్ విధాత: బీజేపీని నిలవరించటంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల భావజాలం, ఎజెండా ఒక్కటేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన ప్రకటన ప్రకంపనలు పుట్టిస్తున్నది. రాబోయే రోజుల్లో బీజేపీని ఎదుర్కోవటంలో కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ […]

- BRSతో నడిచినా.. పోరాటంలో నో కాంప్రమైజ్
- బీజేపీని నిలవరించటమే లక్ష్యం
- మునుగోడు తరహాలోనే ఖమ్మంలో కూడా బీజేపీని నిలవరిస్తాం
- బీఆర్ఎస్తో కమ్యూనిస్టులకు రాజకీయ సారూప్యత ఉన్నది
- ఎన్నికలు, కార్యాచరణపై ఉమ్మడి నిర్ణయం తీసుకుంటాం
- ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు డి.రాజా, పినరయి విజయన్
విధాత: బీజేపీని నిలవరించటంలో బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల భావజాలం, ఎజెండా ఒక్కటేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన ప్రకటన ప్రకంపనలు పుట్టిస్తున్నది. రాబోయే రోజుల్లో బీజేపీని ఎదుర్కోవటంలో కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ చేయి చేయి కలిపి నడువనున్నాయని కూనంనేని ప్రకటనతో తేటతెల్లమైంది.
హిమాయత్‌నగర్‌లోని ముగ్దుం భవన్లో కూనంనేని సాంబశివరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. అడ్డదారుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్తో కలిసి నడుస్తున్నప్పటికీ, ప్రజా సమస్యల విషయంలో, పోరాటంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని కూనంనేని తేల్చిచెప్పారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అర్హతలపై తామే పోరాటం ప్రారంభించామని, ఎఐఎస్ఎఫ్ కార్యకర్తలు ప్రగతిభవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారని, ఇళ్ళ స్థలాల కోసం అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నామని తెలిపారు.
సింగరేణిలో ఐటీ అంశంపై ఉద్యమిస్తున్నామని ఆయన వివరించారు. పోరాటాల విషయంలో రాజీ, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతానికైతే బిజెపి విషయంలో బీఆర్ఎస్ రాజకీయ, భావ సారూపత్య ఉన్నదని, ఎన్నికలలో కలిసే ఉంటామని అనుకుంటున్నామని, అలాగని ఇప్పుడే చెప్పలేమని, ఎన్నికల సమయంలో దాని గురించి మాట్లాడుకుంటామని అన్నారు
తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడం మునుగోడుతో మొదలైందని, ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ ఎంత ప్రయత్నించినా తిప్పి కొడతామని ఆయన అన్నారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ ఆహ్వానం మేరకు ఈ నెల 18న ఖమ్మంలో జరిగే ఆ పార్టీ ఆవిర్భావ సభకు హాజరు కావాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించటం గమనార్హం.
ఖమ్మం సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ , ఇరు పార్టీల రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. సిద్ధాంతాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలను ఒప్పించడం ద్వారా కాకుండా, బల ప్రయోగంతో అదిరించి, బెదిరించడం ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్తో చేతులు కలపాలని నిర్ణయించాయి.
ఇప్పటికే అదిరింపు, బెదిరింపులు, ప్రలోభాల ద్వారా సుజానా చౌదరి, సి.ఎం.రమేశ్ వంటి వారు బీజేపీలో చేరారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి వంటి వారిది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ జాబితాలో చేరారు.
ఖమ్మం జిల్లాకు కమ్యూనిస్టుల జిల్లాగా పేరుంది. ఆ జిల్లాలో కమ్యూనిస్టులు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారు. ఎవరు అధికారంలో ఉండాలో, దిగిపోవాలో కమ్యూనిస్టుల పాత్ర బట్టి ఉంటుంది. ఏం చేసినా బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మంలోకి అడుగుపెట్టనీయబోమని సీపీఐ నేత ప్రకటించటం గమనించదగినది.
బీజేపీని నిలవరించడంలో కమ్యూనిస్టుల పాత్రను ఇప్పటికే మునుగోడులో చూశామని, అదే పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా రుజువు చేస్తామని ప్రకటించారు. ఇందుకు ఖమ్మం మొదటి అడుగు కాబోతున్నదని కూనంనేని ప్రకటించటం వారి పట్టుదలకు నిదర్శనం.
కమ్యూనిస్టుల ప్రభావం కలిగిన ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాలో గణనీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒకే తాటిపై ఉండాలని, ఉమ్మడిగా కార్యాచరణ ఉండాలని రెండు రోజుల క్రితం జరిగిన రెండు పార్టీల రాష్ట్ర నాయకుల సమావేశంలో నిర్ణయించటం గమనార్హం.
దేశ ఆర్థిక విధానాల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల పట్ల కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలది భావసారుప్యంగా ఉన్నది. ఈ నేపథ్యంలోంచే… కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్తో భుజం కలిపి నడువాలని నిర్ణయించటం రాబోయే కాలంలో రాజకీయ సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనటంలో సందేహం లేదు.