బిఆరెస్ భవితవ్యం – కిం కర్తవ్యం?
ఆయనో ధీరుడు.. పోరాటయోధుడు.. పట్టువదలని విక్రమార్కుడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేదాకా మడమ తిప్పని వీరుడు. యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకతాటిపైకి తెచ్చి ఢిల్లీ మెడలు

ఆయనో ధీరుడు.. పోరాటయోధుడు.. పట్టువదలని విక్రమార్కుడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేదాకా మడమ తిప్పని వీరుడు. యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకతాటిపైకి తెచ్చి ఢిల్లీ మెడలు వంచిన నాయకుడు. కేసీఆర్.. ఈ పేరు యావత్ ప్రపంచంలో మారుమోగింది. సమకాలీన ఉద్యమ రాజకీయాలలో పెను సంచలనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఇదంతా గతం. కానీ.. ఈ పదేళ్ల వినాశనం స్వయంకృతం.
కేసీఆర్ గొప్ప నాయకుడనడంలో ఎవరికీ ఏమాత్రం సందేహం లేదు. అపరచాణక్యుడిగా పేరుగాంచిన మేధావి. ఆసాధారణ ప్రజ్ఞావంతుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఎన్నో గ్రంథాలు చదివిన ఏకసంథాగ్రాహి. ఇవన్నీ ఎవరూ కాదనలేని సత్యాలు. రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాలను, సామాజిక, ఆర్థిక, భౌగోళిక స్థితిగతులను ఔపోసన పట్టిన జిజ్ఞాసి. మరే రాష్ట్రంలోనూ లేని వినూత్న పథకాలను ప్రవేశపెట్టి, ఇతరులకు ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి. కానీ ఈనాడు? తిరస్కరణకు గురైన నాయకుడు. ఉవ్వెత్తున ఎగసి, పాతాళంలోకి జారిపోయిన పార్టీ నేత. ఎందుకు? ఎలా?
2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, ఇతరులు ఎక్కడ విఫలురయ్యారో, అక్కడే విజయవంతమైన నేత. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగల నాయకుడినని రాష్ట్ర, దేశ మేధావులను సైతం నమ్మించగలిగాడు. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సంచలనం సృష్టించాడు. చేసిన బాసను కాదని.. తాను కాకపోతే, ఇంకెవరూ రాష్టాన్ని పాలించలేరని ముఖ్యమంత్రిగా సింహాసనం అధిష్ఠించాడు. తెలంగాణంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా జనాన్ని మురిపించాడు. ఉద్యమకాలంలో ఏవైతే తెలంగాణ సమస్యలో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసాడు.
ఆ అడుగులు అవినీతి వైపు కూడా పడ్డాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ సాధన నినాదం కేవలం ధనసాధనగా మారిపోయింది. ఫలితం, ఎక్కడ చూసినా అవినీతి తాండవం చేయడం మొదలుపెట్టింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు బరితెగించారు. కబ్జాలు, సెటిల్‌మెంట్లు, దందాలు, లంచాలు చాలా మామూలైపోయాయి. మేమేం తక్కువ తినలేదంటూ ప్రభుత్వ ఉద్యోగులు కొందరు బరిలో దిగారు. ఎక్కడాలేని విధంగా జీతాలు పెంచినా, మహా జలగల్లా మారిపోయారు.
ఉద్యమకాలంలో తోడున్న మేధావులను, నాయకులను కాదని, శత్రువులందరినీ మిత్రులుగా చేసుకున్నాడు. అమ్మనాబూతులు తిట్టినవారిని అక్కున చేర్చుకున్నాడు. వీళ్లను సాధారణంగా ‘ఫ్లోటింగ్ లీడర్స్’ అంటారు. వీళ్లకి పార్టీపై గానీ, అధినేతపై గానీ ఎలాంటి నమ్మకం, ప్రేమ ఉండవు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికే పరాన్నభుక్కులు. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడికి వెళ్లపోయే ఈగలు. వీళ్లను నమ్ముకుంటే నేడు ఒక్కడూ లేకుండా పోతున్నాడు. నాటి మిత్రులు నేటికీ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. పార్టీ అయినా, సంస్థ అయినా, పైనుంచి కింది దాకా ఒక నిర్మాణం ఉండాలి. తృటిలో అట్టడుగు కార్యకర్తను కూడా సంప్రదించగలిగే సమాచార వ్యవస్థ ఉండాలి. ఇది పూర్తిగా బీఆరెస్‌లో లోపించింది.
అప్పుడు పుట్టింది కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయతలపెట్టిన బృహత్తర జల యజ్ఞం. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చాడానికి శ్రీకారం చుట్టిన సాగరమథనం. అక్కడే అహంకారానికి బీజం పడింది. నన్ను మించిన ఇంజినీరు ఎవడు? అనే స్థాయికి ఎదిగాడు. అమృతజలధారలతో పాటు అవినీతి కాలకూటం కూడా ఎగిసింది. ఆ కాలకూటాన్ని దిగమింగగలిగిన గరళకంఠుడెవరూ లేరు. ఫలితం.. బీటలు వారిన కోటలు. నిజాయితీ కలిగిన అధికారులంతా ఏ మారుమూలలకో మార్చబడ్డారు.
ఇతర రాష్ట్ర తిమింగలాలన్నీ ఉన్నత పదవులు అలంకరించాయి. మింగడానికి అనువుగా ఉన్న అన్నింటినీ హాంఫట్‌మనిపించారు. అస్మదీయులందరూ ఇదే అదనుగా భావించి, తమ శక్తి మేర సంపాదించారు. ఒకనాడు స్లిప్పర్లు, స్కూటర్‌తో ఉన్న ఓ సేవకుడు నేడు వందల కోట్ల ఆస్తులకు అధిపతి. కుటుంబసభ్యులందరూ రాష్ట్రాన్ని తలోముక్కా పంచుకున్నారు. కానీ, ప్రజలు ఓర్పు వహించారు. భరించారు. మొదటి ఐదేళ్లు ఈ ఓపిక మౌనంగానే ఉంది. కొత్త రాష్ట్రం కదా, చూద్దాం.. అనే ఎదురుచూపులతో.
రెండవసారీ బీభత్సంగా గెలిపించారు. అప్పుడు తలకెక్కిన పొగరు, పరిపరివిధాలుగా విస్తరించింది. ఎక్కడిదాకా అంటే, ‘కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే, కుక్కయినా గెలవాల్సిందే’ అనే దాకా. ఇదే కృష్ణావతారం. “అభ్యర్థీ నేనే, ఓటరూ నేనే. పైసలిచ్చేదీ నేనే, పంచేది నేనే.. మీరంతా నిమిత్తమాత్రులు. నేను అనుకుంటేనే మీరు గెలుస్తారు. నేను తలుచుకుంటేనే మంత్రులవుతారు. అంతా నేనే, అంతటా నేనే”. ఇదీ ఆ అవతార పరమార్థం.
రెండవసారి అధికారంలోకి వచ్చాక, అహంకారం కాస్తా నియంతృత్వంగా మారింది. ప్రగతిభవన్ కాస్తా దుర్బేధ్యమైన కోటలాగా రూపుమార్చుకుంది. తన పర బేధం లేని మిలిటరీ జోన్‌గా అవతరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర అధికార, అనధికార ప్రముఖులెవ్వరికీ ప్రవేశార్హత లేకుండా పోయింది. కేసీఆర్ చుట్టూ ఉండే బలమైన కోటరీదే అధికారమయింది. అందులో ఒక్కడంటే ఒక్కడు పనికొచ్చేవాడుండడు. వారి అనుయాయూలకే అక్కడ స్వాగతాలు. వచ్చినవాడెంత చిల్లరగాడైనా, కోటరీకి దగ్గరివాడైతే చాలు.
సెక్రటేరియట్ వాస్తుకు విరుద్ధంగా ఉన్నదని అడుగే పెట్టని కేసీఆర్, నభూతో నభవిష్యతి అన్న చందాన కొత్త సచివాలయం నిర్మించాడు. కానీ, పట్టుమని పదిరోజులు కూడా అందులో ఉండలేకపోయాడు. కాదు, జనం ఉంచలేదు. ఉన్నది కొద్దికాలమే అయినా, అక్కడ కూడా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రముఖులకు నిషేధమే. నిజానికి సచివాలయమంటే ప్రజా కార్యాలయం. అక్కడికి అధికారులను, మంత్రులను కలిసేందుకు ఎంతోమంది వస్తుంటారు. రావాలి కూడా. ఈ చర్యలతో క్రమక్రమంగా ప్రజానీకాన్ని కేసీఆర్ దూరం చేసుకున్నాడు. అది తనకు అర్థం కాలేదు.
పోలీస్ యంత్రాంగాన్ని పటిష్టపరిచినా, ఉన్నతాధికారులుగా మాత్రం ఒకరిద్దరిని మినహాయిస్తే మిగతా అంతా అసమర్థ అస్మదీయులనే ఎంచుకున్నాడు. అటువంటి వారికి ఎంత గొప్ప సౌకర్యాలిచ్చినా, ఏం లాభం? నగరంలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారింది. తెల్లవారఝాము వరకు నడిచే పబ్బులు.. డ్రగ్గులకు ఆలవాలమయ్యాయి. నగరంలో ఎన్నడూ లేని విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సంబంధం లేని వారు కూడా తాగుబోతుల డ్రైవింగ్‌కు బలయైపోయారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు బలవుతున్నారు. ఐపీఎస్ అకున్‌సభర్వాల్ నిజాయితీగా డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించ ప్రయత్నిస్తే, సినిమా దోస్తులందరూ లోపలే ఉంటారని భయపడి, ఆ పోలీస్‌నే శంకరగిరి మాన్యాలకు తరలించారు. అప్పటినుండి మాదకద్రవ్యాలకు తెలంగాణ రాష్ట్రం, పంజాబ్ తర్వాత దేశంలోనే రెండో అడ్డాగా మారిపోయింది.
ఇంకో మహమ్మారి ధరణి. ఇది కరోనా కంటే భయంకరంగా జనాలను పీడించింది. సోమేశ్‌కుమార్ అనే ఓ బీహార్ ఐఎఎస్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అయినప్పటికీ, తెలంగాణకు రప్పించుకుని, ధరణిని అప్పగించారు. భూమి అంటే ఏమిటో, ఒక చిన్న గుంట పొలం మీద రైతుకు ఎంత మమకారం ఉంటుందో తెలియని వాడు ధరణి పోర్టల్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించి, రాష్ట్రంలోని భూయాజమాన్య వ్యవస్థను సమూలంగా భ్రష్టుపట్టించాడు. పనిలోపనిగా తనూ వందల కోట్లు వెనకేసుకున్నట్లు అధికారుల గుసగుసలు. ధరణి లేకుంటే, రైతుబంధు రాదని దాదాపు బ్లాక్‌మెయిల్ చేసిన అధినాయకుడు, అదే తన పాలిట శాపంగా మారిందని గుర్తించలేకపోయారు.
నిజానికి ధరణికి, రైతుబంధుకు సంబంధమేమిటి? రైతుబంధు అనేది ఒక సంక్షేమ పథకం. ధరణి భూ వ్యవహారాల నిర్వహణ వ్యవస్థ. రైతుబంధు ఉన్నా, లేకపోయినా, ధరణి ఉండాలి, ఉంటుంది కూడా. వాస్తవానికి ల్యాండ్ రికార్డులు నిర్వహించడంలో తెలంగాణ కంటే ఎన్నో రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి, పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో సహా. ఎక్కడో మారుమూల గ్రామంలోని ఒక చిన్న గట్టు పంచాయితీని కోర్టు మెట్లెక్కేదాకా తీసుకొచ్చారు. వీఆర్వోల వ్యవస్థ, ఎమ్మార్వోల వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఏమీ తెలియని కలెక్టర్లకు అధికారం అప్పగిస్తే జనం ఎక్కడికి తిరగాలి? ఆలోచన మంచిదే అయినా, వీఆర్వో-ఎమ్మార్వో వ్యవస్థను పునఃవ్యవస్థీకరించాలే తప్ప తప్పించకూడదు.
ధరణి పోర్టల్‌ను ప్రభుత్వమే అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సింది పోయి, ఎక్కడో విదేశాల్లో ఉన్న ఏజెన్సీకి ధారదత్తం చేసారు. అత్యంత సున్నితమైన సమాచారం కలిగిఉండే ధరణి పరాధీనమైతే ఉత్పన్నమయ్యే సమస్యలను అసలు పట్టించుకోలేదు. ఏ రైతులైతే కేసీఆర్‌ను తమ బంధువనుకున్నారో, వారే తనని శత్రువుగా పరిగణించారు. రైతులు ఎంతటి కష్టాన్నయినా భరిస్తారు కానీ, తన భూమి తనకు కాకుండా పోతుంటే ఆఖరిశ్వాస వరకూ పోరాడతాడు. కేసీఆర్ అదీ మర్చిపోయాడు.
అసలు కేసీఆర్ తెలంగాణనే మర్చిపోయాడని అందరికి చాలా ఆలస్యంగా అర్థమయింది. టీఆర్ఎస్ కాస్తా బీఆరెస్‌గా మారిపోయి, ‘దోభీకా కుత్తా…’లా అయిపోయింది. ఇక్కడే మొదటి దెబ్బ చాలా బలంగా పడింది. ఎప్పుడైతే పార్టీ పేరులోనుండి తెలంగాణ మాయమైందో, అప్పుడే పార్టీ ప్రజలకు, శ్రేణులకు దూరమయింది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణనే తీసేస్తే, ఇంకా ఆ పార్టీ ఎందుకు? ఎవరు చెప్పినా వినని మొండితనం ఇంతదాకా తెచ్చింది. మొన్నటి నియోజకవర్గ సమావేశాల్లో లీడర్లు, కార్యకర్తలు పేరు వెనక్కితెండీ అని కేటీఆర్‌తో నెత్తీనోరు బాదుకుని చెప్పినా, దున్నపోతు మీద వానపడ్డట్టు అయింది.
రాష్ట్రం ‘సర్వతోముఖాభివృద్ధి’ చెందింది కాబట్టి, ఇక దేశాన్ని నరేంద్రమోదీ కబంధహస్తాలనుండి విడిపించాలని కంకణం కట్టుకుని దేశ పర్యటనకు బయలుదేరాడు. కోట్లకు కోట్లు విరాళాలు విసిరేసాడు. దేశానికి ప్రధాని అయ్యే అవకాశం తనకే ఉందని బలంగా నమ్మాడు. అన్ని భాషల్లో దినపత్రికలు తేవాలని కూడా ఏర్పాట్లు చేసాడు. ధనం ఎంతపనైనా చేయిస్తుందని నమ్మి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎన్ని పార్టీలకు ఎంత ఫండ్ ఇవ్వాలో కూడా నిర్ణయించుకున్నాడు. ఈ విషయం ఒక జాతీయస్థాయి జర్నలిస్టును దిగ్భ్రాంతికి గురిచేసింది. కేసీఆర్‌ను “మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ ఆఫ్ ది కంట్రీ”గా ఆయన తన సన్నిహితుల దగ్గర అభివర్ణించాడు.
తన ఎమ్మెల్యేలు, మంత్రులు బకాసురులుగా మారిపోయారని వేలాదిగా ఫిర్యాదులు వస్తే, తెలిసి కూడా వాటిని నిర్లక్ష్యం చేసి మూడోసారి ఓటమిని మూటకట్టుకున్నాడు. ఎంతో మంది ప్రముఖులను, కవులను, సాహితీవేత్తలను, మేధావులను, జర్నలిస్టులను ఎవరి స్థాయిలో వారు ఎక్కడపడితే అక్కడ అత్యంత హీనంగా అవమానించారు. అహంకారం, పొగరులో తండ్రికంటే రెండాకులు ఎక్కువే చదివిన కుమారుడు కూడా ఇదే అంటరానితనాన్ని పాటించాడు. కొంతలో కొంత హరీశ్‌రావు ప్రజల్లో ఉండటం ఆయనకు మేలు చేసింది. ఆయనే నిజమైన రాజకీయ నాయకుడు. కేటీఆర్ ఒక విజయవంతమైన సీఈవో అయితే, హరీశ్ ఒక విజయవంతమైన నాయకుడు. అయినా, అందరూ అవినీతిలో ఒకే తాను ముక్కలు.
ఇలా అందరూ అవినీతి దగ్గరవుతూ, ప్రజలకు దూరమవుతున్నామన్న విషయాన్ని కనిపెట్టలేకపోయారు. తీరా తెలుసుకునేసరికే ఆలస్యమయిపోయింది. పది మంది ముఖ్యమంత్రులున్న కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం కట్టబెట్టారు. చచ్చిపోయిన పాములను తిరిగి బతికించి అందలం ఎక్కించారు. పాపం.., తాము గెలిచామనీ, మంత్రులం కూడా అయ్యామని ఇంకా చాలామందికి ఎక్కలేదు. ఇలా కేసీఆర్ ఓడిపోయి, రేవంత్ రెడ్డిని గెలిపించాడు. కాంగ్రెస్‌కు ఓటేసిన 90శాతం మందికి రేవంత్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు. కానీ, ఏం చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితికి రాష్ట్రప్రజలను తీసుకొచ్చింది కేసీఆరే.
ఇప్పడు శత్రువుకు శత్రువు మిత్రుడే అన్న సామెత రాష్ట్రంలో అమలవుతోంది. బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వారి లక్ష్యం దక్షిణం. దక్షిణం దక్కాలంటే ముందుగా తెలంగాణ దక్కాలి. అది జరగాలంటే ముందు కేసీఆర్‌ను తప్పించాలి. బీఆరెస్‌ను భూస్థాపితం చేయాలి. అందుకు కాసేపు కాంగ్రెస్‌తో అంటకాగినా తప్పులేదనేదే మోదీ-షా ద్వయం పన్నాగం. రేవంత్‌ను దగ్గరకు తీయడంలో, అడిగినవన్నీ ఇవ్వడంలో ఇదే పరమార్థం. ఆ తర్వాత రేవంత్‌ను దించడం వారికి నల్లేరు మీద బండి నడకే.
రెండు మూడు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభాస్థానాల్లో గెలుపెవరిదనేదానిపై పెద్దగా ఎవరికీ ఆత్రుత లేదు. గెలిచేదెవరో దాదాపుగా తెలిసిపోయింది. సింహభాగం కాంగ్రెస్, బీజేపీలకే అనేది నిర్ధారితమైపోయింది. కేసీఆర్ ఇప్పటికే కాడి ఎత్తేసాడని కామెంట్. సింహంలా గర్జించే కేసీఆర్ ఇప్పడు మాట్లాడటానికే బయటకు రావడంలేదు. ఇంతకుముందు ఉన్న తేజస్సు పూర్తిగా క్షీణించింది. అసెంబ్లీ ఓటమి ఆయనను మానసికంగా కూడా ఓడించింది. ఓడిపోవడం ఆయనకు కొత్తేం కాకపోయినా, ఫీనిక్స్‌లా లేచే శక్తి ఇప్పుడు లేదు. ఆయన లేకపోతే ప్రచారమే లేదు. మరి? హైదరాబాద్ ఎట్లాగూ మజ్లిస్ ఖాతాకే కాబట్టి, నిజమైన పోటీ 16 స్థానాలకే. వీటిలో బీఆర్ఎస్ స్థానమేమిటి? ఎక్కడుంది? అంటే అందరి దగ్గరా ఒకటే సమాధానం.
ఎక్కడా లేదని. ఒక్కటీ రాదని. అప్పుడేమిటి భారత రాష్ట్ర సమితి పరిస్థితి? ఇప్పటికే ఒక్కొక్కరుగా ఎంపీలు, మాజీ ఎంపీలు పార్టీని వీడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కటీ రాకపోతే ఇక మిగిలేది ఎవరు? ఇప్పటికే 15మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు చెపుతున్నారు. 2014లో జరిగినదానికి ఇప్పుడు రివర్స్‌లో జరగబోతోంది. ఆఖరికి కుటుంబ సభ్యులైనా ఉంటారా? అనేది ఓ మాట. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ బాడీ లాంగ్వేజీల్లో చాలా తేడా వచ్చేసింది. నిర్వేదంగా ఉన్నారు. పార్టీ నీరసంగా ఉంది. ఒకవిధంగా వెంటిలేటర్‌పై ఉన్నట్లే. ఊహించినట్లే ఒక్కటీ రాకపోతే, అదే తెలంగాణ రాష్ట్ర సమితికి.. సారీ.. భారత రాష్ట్ర సమితికి ఆఖరి శ్వాస.
కానీ, మరణశయ్యపైనుండి లేవాలంటే, తిరిగి బీఆరెఎస్‌కు అమృతం పోయాలంటే, కేసీఆరే తెగించాలి. క్యాడర్‌లోని ఉదాసీనతను పారదోలాలి. చేసిన తప్పలన్నింటినీ సరిదిద్దుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా 2014కు పూర్వం కేసీఆర్ కావాలి. అందరినీ కలుపుకొనిపోవాలి. కోటరీని బద్దలు కొట్టాలి. బిచ్చగాడైన తనను చేరేంత దగ్గరుగా ఉండాలి. తనవారెవరో, కానివారెవరో కచ్చితంగా తెలుసుకోవాలి. తన మీడియాకు పూర్వవైభవం తేవాలి.
అంతా ఒకేమాటపై, ఒక్కతాటిపై నిలవాలి. నీళ్లు లేని పొలాలకు వెళ్లాలి. కరెంటు లేని ఇళ్లకు, పరిశ్రమలకు వెళ్లాలి. కాంగ్రెస్ నాయకులను తిట్టడం వదిలేసి, ప్రజాసమస్యలను పూర్తిగా భుజాలకెత్తుకోవాలి. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ప్రోది చేసుకోవాలి. మళ్లీ ఒక ఉద్యమంలా పోరాడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమయ్యేనా.? కేసీఆర్ పడి లేచిన కడలి తరంగంలా కదలగలడా? ఏమో.. నమ్మకమైతే లేదు గానీ, జరిగితే మాత్రం అది అద్భుతమే.
పార్టీ దుర్గతికి కారణమెవ్వరు? నిస్సందేహంగా కేసీఆర్ ఒక్కడే. నింగికెగిసినప్పుడూ ఒక్కడే. పాతాళానికి పడినప్పుడూ ఒక్కడే. చరిత్ర గతిని ఎవరూ మార్చలేరు. ఇలాగే విర్రవీగిన ఎందరో కేసీఆర్‌లు కాలగర్భంలో కలిసిపోయారు. వేలాది పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఈ విషయం తెలియంది కాదు. అహంకారం వల్ల వచ్చే నష్టాలలో ఈ ‘మినహాయింపు’ కూడా ఒకటి. యుగాలు మారినా, తరాలు మారినా, చరిత్ర మారదు. మారేది కాలం మాత్రమే.
-అధర్వ