13న చేవేళ్లలో బీఆరెస్ బహిరంగ సభ
గ్రేటర్ పరిధిలో బీఆరెస్ పార్టీ బలంగా ఉందని, అన్ని ఎమ్మెల్యేలను బీఆరెస్ భారీ మెజార్టీతో గెలుచుకుందని ఈ నేపథ్యంలో వచ్చే నెల 13వ తేదీన చేవెళ్లలో బీఆరెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.

- గ్రెట్‌ర్‌లో ఆ మూడు సీట్లు మావే
- బీఆరెస్ టికెట్‌తోనే రంజిత్‌రెడ్డికి గుర్తింపు
- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
విధాత: గ్రేటర్ పరిధిలో బీఆరెస్ పార్టీ బలంగా ఉందని, అన్ని ఎమ్మెల్యేలను బీఆరెస్ భారీ మెజార్టీతో గెలుచుకుందని ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ఎత్తులు వేసిన గ్రేటర్ పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో బీఆరెస్‌దే విజయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 13వ తేదీన చేవెళ్లలో బీఆరెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. బుధవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమై, లోక్‌సభ ఎన్నికలపై చర్చించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 13వ తేదీన కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించి, విజయంతం చేయాలన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చేవెళ్ల సిటింగ్ ఎంపి రంజిత్‌రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందన్నారు.
2019లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారని, ఈ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ముందు అశక్తతను వ్యక్తం చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి, కేవలం అధికారం, ఆస్థుల కోసమే రంజిత్ రెడ్డి బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారని విమర్శించారు. రంజిత్ రెడ్డి తన సోదరి అని చెప్పుకునే కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి.. అరెస్టు చేసిన రోజే.. ఆయన నవ్వుకుంటు పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరిన స్వార్థపరుడని మండిపడ్డారు.
గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసన్నారు. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని, అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవని, స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని జోస్యం చెప్పారు.