సీఎం రేవంత్‌రెడ్డి ఓ లీక్ వీరుడు.. ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు ట్యాప్
నాగార్జున సినిమా గ్రీక్ వీరుడు లెక్క సీఎం రేవంత్‌రెడ్డి ఓ లీక్ వీరుడుని..సీఎం పదవి నడపొస్తదలేదని ఫోన్ ట్యాపింగ్‌లపై చర్యలు తీసుకోకుండా లీకులెందుకు..డ్రామాలెందుకని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు

- లీకులు ఇవ్వడం కాదు..
- ట్యాపింగ్‌పై చర్యలేవి?
- ట్యాపింగ్‌పై నాకేమీ తెలియదు
- కాంగ్రెస్ పాలనపై సర్వత్రా అసంతృప్తి
- రేవంత్ బీజేపీలోకి జంప్ ఖాయం
- బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
విధాత : నాగార్జున సినిమా గ్రీక్ వీరుడు లెక్క సీఎం రేవంత్‌రెడ్డి ఓ లీక్ వీరుడుని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం పదవి నడపొస్తదలేదని ఫోన్ ట్యాపింగ్‌లపైకి మళ్లారని విమర్శించారు. ట్యాపింగ్ జరిగితే చర్యలు తీసుకోకుండా.. లీకులు? డ్రామాలు ఎందుకని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ‘అదేదో స్కామ్.. ఇదేదో స్కామ్ అని లీకులివ్వవడం ఎందుకు? డైరెక్ట్‌గా చెప్పరాదురా బై! సీదా చెప్పు.. ఇగో ఇది తప్పయింది.. వీడిని పట్టుకున్నాం.. లోపలేసినమని చెప్పేదానికి ఇక్కడక్కడా లీకులిచ్చుడెందుకు? యూట్యూబ్‌లలో ఎల్లన్నను మల్లన్ననను పట్టుకుని వానితో చెప్పించుడు.. తెల్లారిలేస్తే తిట్టిపించుడు ఎందుకు?’ అని అసహనం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ఆయన స్పందిస్తూ.. ‘వీళ్ల ఫోన్ వాళ్ల ఫోన్ ట్యాప్ అయ్యిందంటున్నాడు. కేసీఆర్ 10 లక్షల ఫోన్లు ట్యాపింగ్ చేసిండంటారు.. చేస్తే గీస్తే ఒకరిద్దరు లుచ్చగాళ్లవి ట్యాప్ చేసిండొచ్చు. నాకేం ఎరుకలేగాని, దొంగలవి, లంగలవి చేయొచ్చు. ఎందుకంటే అది పోలీసుల పని. అదేదో అంతర్జాతీయ కుంభకోణమన్నట్లుగా హంగామా చేయడం ఎందుకు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌కు అధికారం ఉన్నది కాబట్టి.. ధైర్యం ఉంటే తప్పులు బయటపెట్టాలని సవాలు చేశారు. ఎవరినైనా అరెస్టు చేసుకోవచ్చని, ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు.
సచివాలయంలో లంకెబిందెలుంటాయనుకుంటే ఖాళీ కుండలే ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. హైదరాబాద్‌లో నీళ్లు లేక ఖాళీకుండలే ఉన్నాయని ముందు ఆ నీళ్ల సమస్య పరిష్కరించాలని హితవు పలికారు. లంకె బిందెల కోసం వెతికేది దొంగలేనన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని.. బీజేపీలో చేరడమే ఆయన అంతిమ లక్ష్యమని కేటీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే కొంతమంది బీఆరెస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ అవుతారని సంచలన ఆరోపణలు చేశారు.
పదేళ్లలో చిల్లిగవ్వ కూడా ఇవ్వని బీజేపీ సర్కార్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి పదేళ్లుగా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులు ఇప్పుడెలా ఓట్లు అడుగుతారని నిలదీశారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కేజీవాల్ అరెస్టు అన్యాయం అంటున్న కాంగ్రెస్ నేతలకు కవిత అరెస్ట్ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
దమ్ముంటే మల్కాజ్‌గిరిలో పోటీకి రా..
ఒక్క సీటు గెలిచి చూపెట్టు.. బీఆరెస్ పని అయిపోయింది.. అంటున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మల్కాజిగిరిలో తనతో పోటీపడాలని కేటీఆర్ మరోసారి సవాలు విసిరారు. ఇద్దరం మల్కాజిగిరిలో పోటీ చేద్దాం రమ్మంటే.. రేవంత్‌రెడ్డి నోరు మెదపడం లేదన్నారు. మల్కాజిగిరిలో ఏడుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు గెలిచారని, మల్కాజిగిరి అంటేనే సీఎం భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికి తాను రేవంత్‌రెడ్డితో మల్కాజిగిరిలో తలపడేందుకు సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి.. ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని చ చాలెంజ్ చేశారు. మల్కాజిగిరిలో ఈ ఐదేండ్లలో రేవంత్ ఒక్క పని కూడా చేయలేదని, ఎవరినీ పలుకరించిన పాపాన పోలేదని చెప్పారు. ఆవేశానికి పోతే ఓడిపోతానని రేవంత్ భయపడ్డాడని, అందుకే తన సవాలుపై నోరు మెదపడం లేదని అన్నారు.
పోటీ వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్యనే
పదేళ్ల బీఆరెస్ నిజానికి, వంద రోజుల కాంగ్రెస్ అబద్ధానికి, పదేళ్ల బీజేపీ విషానికి మధ్య పార్లమెంటు ఎన్నికల్లో పోటీ జరుగుతుందని, ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదని కేటీఆర్ అన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. డిసెంబర్ 9న 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, రుణాలు తెచ్చుకోండని చెప్పి రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కరువు, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పదివేల పరిహారం ఇవ్వలేదన్నారు. అందుకే వంద రోజుల అబద్ధాల పాలనపై రైతుల్లో చర్చ మొదలైందని చెప్పారు. ఆటో డ్రైవర్లు మంట మీదున్నారని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన 36వేల ఉద్యోగాలను తామే ఇచ్చినట్టు చెప్పుకొంటుండటంతో యువత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ చెప్పారు. తులం బంగారం, 2500 ఇస్తామని ఇవ్వక పోవడంతో మహిళలు తిడుతురన్నారని, 4వేల పింఛన్ ఇవ్వక వృద్ధులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. కంటోన్మెంట్‌లో మనకు ఎమ్మెల్యే లేరని నిరాశ చెందవద్దన్న కేటీఆర్.. అక్కడ మన పార్టీకి చాకుల్లాంటి లాంటి నాయకులూ ఉన్నారని, లాస్య కుటుంబం, తమ్ముడు మన్నే క్రిశాంక్, గజ్జెల నగేష్ ఉన్నారని, అందరిని కలుపుకొని వెళ్ళండని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో తుఫానులా మెజార్టీ ఇచ్చారని, మూడు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీ వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఇతర పార్టీలు మూడున్నర లక్షలు దాటి ముందుకు వచ్చి గెలవాల్సివుందని అన్నారు. అలాగని నిర్లక్ష్యం పనికిరాదని నేతలు, కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ దగ్గర పదవులు పొంది, కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఎన్నికల పోటీలో ఉన్నవాళ్లు కావాలా? లేక సిన్సియర్‌గా కష్టకాలంలో కూడా కేసీఆర్ వెంట నడుస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి కావాల్నా ఆలోచించండని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.