ఐఏఎఫ్‌లోకి.. సీ295 రవాణా విమానం

- ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
- మరింత పెరగనున్న లాజిస్టిక్స్ సామర్థ్యాలు
విధాత: భారత వైమానిక దళం (IAF)లోకి మొదటి C295 రవాణా విమానాన్నిప్రవేశపెట్టారు. దీని ద్వారా లాజిస్టిక్స్ సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భారత్ డ్రోన్ శక్తి-2023 ప్రదర్శనను రక్షణమంత్రి ప్రారంభించారు.
దక్షిణ స్పానిష్ నగరమైన సెవిల్లెలో మొదటి C295 మీడియం టాక్టికల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాప్ట్‌ను భారత వైమానిక దళానికి అప్పగించారు. దాంతో గత వారం వడోదరలో ఈ రవాణా విమానం ల్యాండ్ అయింది. ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో భారతదేశం రూ. 21,935 కోట్ల ఒప్పందాన్నిగతంలో కుదుర్చుకున్నది.
రెండేండ్ల తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఈ నెల 13న C295 రవాణా విమానాలను అందుకున్నారు. రెండేండ్లలో మొత్తం 56 రవాణా విమానాలు డెలివరీచేయాల్సి ఉన్నది. తొలి విడతలో 16, మలివిడతలో 40 అందజేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.
C295 రవాణా విమానం ప్రత్యేక ఏమిటంటే..
C295 విమానం గరిష్ఠంగా 260 నాట్ల వేగాన్ని అందుకుంటుంది. 5 నుంచి 10 టన్నుల వరకు రవాణా సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. C295 ఎయిర్‌క్రాఫ్ట్ ముడుచుకునే ల్యాండింగ్ గేర్‌తో అమర్చబడి ఉంటుంది. అడ్డుపడని 12.69 మీటర్ల పొడవు గల ప్రెజర్డ్ క్యాబిన్‌ను కలిగి ఉంటుంది. C-295 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది.