Car Stolen | పట్టపగలే జేపీ నడ్డా సతీమణి మల్లిక కారు చోరీ.. ఎలాగంటే..!

Car Stolen | పట్టపగలే జేపీ నడ్డా సతీమణి మల్లిక కారు చోరీ.. ఎలాగంటే..!

Car Stolen : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సతీమణి మల్లిక కారు చోరీకి గురైంది. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారును దొంగిలించారు. దేశ రాజధాని ఢిల్లీలోని గోవిందపురి ఏరియాలో ఈ చోరీ జరిగింది. మార్చి 19న మధ్యాహ్నం 3-4 గంటల మధ్య జరిగిన ఈ చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ అధ్యక్షుడి వాహనానికే భద్రత లేకుంటే.. ఇక ప్రజలకు రక్షణ ఏముంటందనే విమర్శలు వస్తాయనే ఆలోచనతో ఈ విషయాన్ని గుట్టుగా ఉంచినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. జేపీ నడ్డా సతీమణి మల్లికకు చెందిన టయోటా ఫార్చూనర్‌ కారును ఆమె డ్రైవర్‌ జోగిందర్‌ మార్చి 19న సర్వీసింగ్‌కు ఇచ్చాడు. అదే రోజు మధ్యాహ్నం కారును సర్వీసింగ్ సెంటర్‌ నుంచి తీసుకొస్తూ డ్రైవర్‌ జోగిందర్‌ మార్గమధ్యలో భోజనం చేసేందుకు తన ఇంటి వద్ద ఆగాడు. ఇంటి ముందు కారును పార్క్‌ చేసి, లోపలికి వెళ్లి భోజనం చేశాడు. తర్వాత బయటికి వచ్చి చూస్తే కారు లేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ కారును దొంగిలించారు.

డ్రైవర్‌ జోగిందర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. దొంగలు కారును గురుగ్రామ్‌ దిశగా తీసుకెళ్లినట్లు తేలింది. నాలుగైదు రోజులుగా గాలిస్తున్నా ఇప్పటికీ ఆ కారు ఆచూకీ లభ్యం కాలేదు. చోరీకి గురైన ఆ కారు హిమాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఉంది. కారును రికవరీ చేసేందుకు గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.