పేటలో కుల సంఘ భవనాల ‘కుంపటి’! BRS, కాంగ్రెస్ మధ్య రగులుతున్న చిచ్చు
నిధులు రాకుండా అడ్డుకున్నారని బీఆర్ఎస్ విమర్శ ఆరోపణ తప్పంటున్న కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి వర్సెస్ మాధవరెడ్డి రూ.15 కోట్ల నిధులకు జీవో జారీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కులసంఘ భవనాల నిర్మాణ నిధుల అంశం పై నర్సంపేటలో రాజకీయ కుంపటి రగులుతోంది. పేటలో వివిధ కుల సంఘాలకు భవనాలు నిర్మించే విషయమై ప్రభుత్వం విడుదల చేసే నిధులు రాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని గులాబి పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దీనికి […]

- నిధులు రాకుండా అడ్డుకున్నారని బీఆర్ఎస్ విమర్శ
- ఆరోపణ తప్పంటున్న కాంగ్రెస్
- సుదర్శన్ రెడ్డి వర్సెస్ మాధవరెడ్డి
- రూ.15 కోట్ల నిధులకు జీవో జారీ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కులసంఘ భవనాల నిర్మాణ నిధుల అంశం పై నర్సంపేటలో రాజకీయ కుంపటి రగులుతోంది. పేటలో వివిధ కుల సంఘాలకు భవనాలు నిర్మించే విషయమై ప్రభుత్వం విడుదల చేసే నిధులు రాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని గులాబి పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దీనికి ప్రతిగా తాము ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు కల్పించలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించారు.
గులాబీ పార్టీ నాయకుల తీరును కాంగ్రెస్ పీసీసీ నెంబర్ పెండెం, జిల్లా నాయకుడు తక్కలపల్లి రవీందర్రావు తదితరులు తీవ్రంగా విమర్శించారు. కాగా, ఎప్పుడో విడుదల కావలసిన నిధులను విడుదల కాకుండా అడ్డుకొని నియోజకవర్గ అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు మండిపడుతున్నారు. కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య ఈ అంశంపై రగడ కొనసాగుతోంది. తాజాగా మరోసారి చర్చకు దారి తీసింది.
పెద్ది వర్సెస్ దొంతి
తొలి నుంచి నర్సంపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారగా ఇటీవల పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. త్వరలో ఎన్నికలు రానున్నందున ఎవరికి వారు వెనక్కి తగ్గకుండా పరస్పర విమర్శనాస్త్రాలతో రాజకీయవేడిని పుట్టిస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ కు చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు పెరిగాయి. ఎప్పుడు పరస్పర రాజకీయ విమర్శలు చేసుకునే ఈ రెండు పార్టీల నేతలకు తాజాగా కుల సంఘ భవనాల నిధుల అంశం టాపిక్ గా మారింది.
కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుల సంఘ భవనాలకు నిధులు విడుదల చేయాలని విన్నవించారు. ఎమ్మెల్యే వినతి మేరకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
తీరా నిధులు విడుదల చేసే సమయానికి కాంగ్రెస్ కు సంబంధించిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ స్టే వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తము ఉందని బహిరంగంగానే ఎమ్మెల్యే ఆరోపించారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక నిధుల విడుదల జాప్యాన్ని తమపై నెట్టివేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.
రూ.15 కోట్ల నిధుల విడుదలకు జీవో జారీ
ఎమ్మెల్యే పెద్ది చొరవతో మంత్రి కేటీఆర్ కుల సంఘ భవనాలకు సంబంధించిన నిర్మాణం చేపట్టేందుకు జీవో నెంబర్ 44 ద్వారా రూ.15 కోట్లు విడుదల చేస్తూ జారీ చేసిన జీవో కాపీని శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అందజేశారు. జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమక్షంలో హైదరాబాదులో జీవో కాపీని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అందజేశారు.
కాంగ్రెస్ కారణంగా జాప్యం
నర్సంపేట నియోజకవర్గంలో సాగుతున్న అభివృద్ధిని ఓర్వలేక విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి నాయకులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కోర్టును ఆశ్రయించిన కారణంగానే ఇంతకాలం జాప్యమైందని అన్నారు.
ఈ ఆలస్యం వల్ల గతం కంటే ఇప్పుడు రెట్టింపు నిధులు భవన నిర్మాణాల కోసం కేటాయించారని వివరించారు. వెంటనే భవన నిర్మాణ పనులు చేపడుతామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నర్సంపేటలో అభివృద్ధిని అడ్డుకోలేరని నిధుల విడుదలకు సహకరించిన మంత్రులకు ఎమ్మెల్యే పెద్ది ధన్యవాదాలు తెలియజేశారు.