రేపు బెంగళూరు బంద్.. ముదురుతున్న కావేరీ జల వివాదం

రేపు బెంగళూరు బంద్.. ముదురుతున్న కావేరీ జల వివాదం
  • తమిళనాడుకు నీరివ్వొద్దంటూ ప్రభుత్వానికి హెచ్చరిక


విధాత: కర్ణాటకలో కావేరీ జలాల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తమిళనాడుకు కావేరీ నీటిని ఇవ్వడాన్ని అక్కడి పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈక్రమంలో మంగళవారం బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, ఇతర ట్రాన్స్ పోర్ట్ సర్వీసులన్ని పూర్తి బంద్ కానున్నాయి.


ఈ మేరకు కావేరీ జల సంరక్షణ సమితితో పాటు మరికొన్ని సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రజలు బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని సహకరించాలని ఆ సంఘాలు కోరాయి. రైతు సంఘాలు, కొన్నిప్రొ-కన్నడ సంఘాలు, ప్రతిపక్షపార్టీలు కలిపి సంయుక్తంగా ఈబంద్ కు పిలుపునిచ్చాయి. కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాలను తమిళనాడుకు ఇవ్వడాన్ని ఈసంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. బంద్ సందర్భంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నారు.


కావేరీ జలసంరక్షణ సమితితో పాటు రైతు సంఘాలు, బెంగుళూరు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ జరుగనున్నది. టౌన్ హాల్ నుంచి ఎస్ బీఎమ్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగనుంది. అనంతరం అక్కడే భారీ జనసభ నిర్వహించనున్నారు. కాగా బంద్ కు అత్యవసర సంస్థలకు మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించారు. హాస్పిటల్స్ , నర్సింగ్ హోమ్స్, మెడికల్ షాపులు వంటి కొన్ని అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు.