చందాలు ఇవ్వడమే పాపమా..?: రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొనకుండా చేసేందుకు బీజేపీ ఈడీ నోటీసులు ఇప్పించిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిజాయితీగా పని చేసే నేతలకు ఈడీ నోటీసులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కు నోటీసులు […]

విధాత, హైదరాబాద్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొనకుండా చేసేందుకు బీజేపీ ఈడీ నోటీసులు ఇప్పించిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిజాయితీగా పని చేసే నేతలకు ఈడీ నోటీసులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలైన షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని చెప్పారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక నడిపించడానికి కాంగ్రెస్ నాయకులు చందాలు ఇవ్వడమే పాపమా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు నేతలు నేషనల్ హెరాల్డ్ పత్రికకు కోటి రూపాయల చందా ఇస్తే.. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ను ఎందుకు వదిలేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాంగ్రెస్ లేకుండా చేస్తామని మా పార్టీలోని క్రియాశీలక నాయకుడికి బీజేపీ నేతలు చెప్పారు. దేశంలోని, రాష్ట్రంలోని సీనియర్ నేతలకు, పీసీసీ చీఫ్ రేవంత్ కు కూడా ఈడీ నోటీసులు తప్పవని చెప్పారు’ అని తెలిపారు.
ప్రస్తుతం బీజేపీ పార్టీ ఖాతాలో రూ.5వేల కోట్ల వరకూ ఉన్నాయని, ఇంత డబ్బు ఎలా వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీకి చందాలు ఇచ్చిన నాయకుల్లో ఒక్కరికైనా ఈడీ నోటీసులు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి రానన్ని చందాలు ఒక బీజేపీకే ఎలా వచ్చాయన్నారు. అధికారిక లెక్కలే ఇలా ఉంటే.. అనధికార లెక్కల ప్రకారం ఎన్ని వేల కోట్లు వచ్చి ఉంటాయి..? అని అన్నారు.
రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు గానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను కాళేశ్వరం నిర్మాణంపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకున్నా ఇప్పటి వరకూ తీసుకోలేదన్నారు.
ఈడీ కేసులతో సోనియా, రాహుల్ గాంధీని వేధించాలని చూశారని చెప్పారు. ఈడీ అంటే బీజేపీ ఎలక్షన్ డిపార్ట్ మెంట్ లా మారిందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి రాబోతున్న సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నోటీసులు ఇచ్చారంటూ మండిపడ్డారు.

మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొంటామన్నారు. అందరికంటే ముందే అభ్యర్థిని పెట్టి, ప్రచారం చేస్తున్నామని చెప్పారు. ‘మునుగోడులో కొనుగోలు, అమ్మకాలే జరుగుతున్నాయి. మేము ఆడ బిడ్డకు సీటు ఇచ్చాం. తెలంగాణలో గుణాత్మక మార్పు తీసుకురావాలంటే మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించండి. మునుగోడు ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అని అన్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్రకు రక్షణ కల్పించకుండా, అడ్డుకోవడానికి కేంద్రం కుట్రలు పన్నుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసులు ఇప్పించి.. బీజేపీలో చేర్చుకునేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తమ అనుబంధ సంఘాలను పక్కనపెట్టి దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందని రేవంత్ మండిపడ్డారు.