జగన్ రెడ్డి.. భస్మాసురుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భస్మాసురుడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు

జగన్ రెడ్డి.. భస్మాసురుడు

– అబద్ధాల్లో డాక్టరేట్ ఇవ్వాలి

– 72 రోజుల్లో జనమే సాగనంపుతారు

– నెల్లూరు ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు

విధాత: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భస్మాసురుడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఆదివారం నెల్లూరు ఎస్వీజీఎస్ మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రా… కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ తనకు తానుగా అర్జునుడు.. అభిమన్యుడు అంటూ పురాణాలు వల్లె వేస్తున్నారని.. నిజానికి ఆయన భస్మాసురుడు అంటూ చంద్రబాబు విమర్శించారు. అబద్ధాల్లో సీఎం జగన్ కు డాక్టరేట్ ఇవ్వాలన్నారు. 72 రోజుల్లో ప్రజలు జగన్ నెత్తిన ఓటు పెట్టి భస్మం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ ఫ్యానుకు ఉండే మూడు రెక్కలని ప్రజలు పీకి పాతరేస్తారని చెప్పారు. రివర్స్ పాలనలో రివర్స్ గిఫ్ట్ ఇస్తారని అన్నారు. గల్లా జయదేవ్ ను వేధించడంతోనే రాజకీయాలే వద్దనుకునే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని, ఆయన కుటుంబం రాజకీయాలు వద్దనే దుస్థితిని వైసీపీ ప్రభుత్వం కల్పించిందని అన్నారు.


రాష్ట్రంలో రైతు ఇప్పటికే చితికిపోగా.. ధాన్యం కొనుగోళ్లలోనూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. అప్పులు అధికమై రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. తుగ్లక్ ఆలోచనలు, సైకో పాలనతో ఏపీలో జగన్ విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారని విమర్శించారు. జగన్ పతనం ప్రారంభమైందని, దానిని దేవుడు కూడా కాపాడలేడని చంద్రబాబు హెచ్చరించారు.