త్వరలో వెంటిలేటర్ పైకి వైసీపీ: చంద్రబాబు
రేపో, ఎల్లుండో వైసీపీ వెంటిలేటర్ పైకి వెళ్లబోతోంది. నో డౌట్... ఆపార్టీలో తిరుగుబాటు మొదలైంది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు

– ఎన్నికలకు ముందే ఓడిపోయింది
– టీడీపీ గేట్లు తెరిస్తే.. ఆపార్టీ గేమ్ ఓవర్
– జగన్ బాధితులే నా స్టార్ క్యాంపెయినర్లు
– ఓటుతో కలియుగ భస్మాసురుడిని తరిమికొట్టండి
– రాజమండ్రి సభలో చంద్రబాబు పిలుపు
రాజమహేంద్రవరం: రేపో, ఎల్లుండో వైసీపీ వెంటిలేటర్ పైకి వెళ్లబోతోంది. నో డౌట్… ఆపార్టీలో తిరుగుబాటు మొదలైంది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ-జనసేన పొత్తు అనగానే అధికార పార్టీకి ప్యాంట్లు తడిచాయి.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా ఆపార్టీ నేతలు భయపడి పారిపోతున్నారని చెప్పారు. సోమవారం రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మండి పడ్డారు. పలు ప్రశ్నలతో జగన్ ను నిలదీశారు. ‘వైసీపీలో ఇప్పటికే 68 మంది ఎమ్మెల్యేలను తీసేశారు. అందులో 29 మందికి సీట్లు గల్లంతు. బదిలీలు చేసేస్తున్నారు నేతలను. నా రాజకీయ జీవితంలో నేతల బదిలీ ఎప్పుడూ చూడలేదు. ఒక ఊరి చెత్త ఇంకో ఊరిలో వేస్తే బంగారం అవుతుందా?’ అని ప్రశ్నించారు. 49 మంది బడుగు, బలహీన వర్గాల నేతలను, 11 మంది దళితులు, నలుగురు బీసీలను వైసీపీ దూరం పెట్టిందన్నారు. ‘మీ సీటుకో దండమని నలుగురు ఎంపీలు పారిపోయారు. వైసీపీ గేమ్ ఓవర్… టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ’ అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పాలనలో నష్టపోయిన బాధితులే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించారు. జగన్ సామాజిక న్యాయం అంటాడు..మళ్లీ రాష్ట్రం అంతా తన వర్గానికి చెందిన సామంతులతో పాలన చేస్తాడని ఎద్దేవా చేశారు.
– సైకో రెడ్డిని తరిమికొట్టండి
రాష్ట్రంలో సైకో పాలన జరుగుతోందని చంద్రబాబు విమర్శించారు. మానసిక రోగి రాష్ట్రాన్ని పాలించడం బాధాకరమని అన్నారు. ఈ ముఖ్యమంత్రి విశాఖలో మీటింగ్ పెట్టాడు. రాజకీయ విమర్శలకు నేను బాధపడను. కానీ నాది, పవన్ ది ఫోటో పెట్టి బూటు కాలితో తన్నించాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఏమనాలి? ఇలాంటి చర్యలను నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా? అని నిలదీశారు. ప్రజల కోసమే మిమ్మల్ని భరిస్తున్నాం. మీ సంగతి తేల్చడం….నాకు ఒక్క నిమిషం పని. దుర్మార్గుడి చేతి నుంచి ప్రజలను కాపాడాలనే నేను తపిస్తున్నాను అని అన్నారు. టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. జగన్ పెద్ద సైకో అయితే మాచర్ల ఎమ్మెల్యే చిన్న సైకో. ఆంబోతుల మాదిరిగా వైసీపీ నేతలు ఊరిమీద పడ్డారు. నా ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్ జగన్ రెడ్డీ అంటూ హెచ్చరించారు. ‘కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లి నియోజకవర్గానికి పోతే… ఆంబోతు రాంబాబు ఆయనపై దాడి చేశాడు.. ఆంబోతూ …నీకు కళ్లెం వేస్తా…. వదలిపెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తా. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. అవినీతి డబ్బుతో, అధికార మదంతో ప్రవర్తిస్తే తగిన శాస్తి చేస్తాను. వదిలిపెట్టను ఎవర్నీ. ఖబద్ధార్ …జాగ్రత్తగా ఉండు’ అంటూ హితవు పలికారు. ఊరికో దళితుడిని బలిచేశావ్.. సామాజిక న్యాయం గురించి మాట్లాడే జగన్ రెడ్డి సామంత రాజులతో పాలన చేస్తున్నాడు. రాష్ట్రమంతా వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిదే పెత్తనమని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే వైసీపీ ఓడిపోయిందని, రాష్ట్రాన్ని కాపాడుకోవడడం మనందరి బాధ్యత అన్నారు. ఐదేళ్లలో ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? డీఎస్సీ పెట్టాడా? ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నాడు. గంజాయి వల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక 72 రోజుల కౌంట డౌన్… సైకిల్ ఎక్కండి… గ్లాస్ పట్టుకోండి. టీడీపీ- జనసేన జెండాలు పట్టుకోండి అంటూ పిలుపునిచ్చారు.
– బకాయిలు చెల్లించమంటే బెదిరిస్తావా:
ఆరోగ్యశ్రీని అటకెక్కించి పేదల ప్రాణాలతో సీఎం జగన్ చెలగాటం ఆడుతున్నాడని చంద్రబాబు అన్నారు. ‘రూ.1200 కోట్లు బకాయిలు చెల్లించకుండా రౌడీలను పంపి బెదిరిస్తున్నాడు. ఆస్పత్రులు భయపడొద్దు. మేం వస్తున్నాం. ఆదుకుంటాం. పెండింగ్ బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు’ అని అన్నారు. మేము వచ్చాక ఈ దొంగలు తిన్న డబ్బులు కక్కిస్తా అని హెచ్చరించారు. రాజమండ్రి ఎంపీ రీల్స్ మాస్టర్. ఆవ భూముల కుంభకోణంలో ఎంపీగారి వాటా రూ. 150 కోట్లు అని ఆరోపించారు. అనపర్తి ఎమ్మెల్యే మరోపేరు గ్రావెల్ రెడ్డి. ఆయన సతీమణి కూడా అదే పని. కోట్లు కొల్లగొట్టాడు. కుటుంబం మొత్తం అవినీతిమయం. రాజానగరం జక్కంపూడి రాజా …బ్లేడ్ బ్యాచ్ లీడర్. పేదల ఇళ్ల స్థలాలు కొట్టేస్తున్నాడు. గొప్ప నాయకుడు. కొండలు కరిగించేస్తున్నాడు. ఆయన భోజనమే ఇసుక, గ్రావెల్. కొవ్వూరు మంత్రిని గోపాలపురానికి తరిమేశారు. మరో ఎమ్మెల్యే తలారి అవినీతికి అడ్డా. ఆయన సీటూ పాయే. ఆయన కొవ్వూరు ఈవిడ గోపాలపురానికి. అక్కడ చెత్త ఇక్కడికి ఇక్కడ చెత్త అక్కడికి వేస్తే గెలుస్తారా? చిన్నప్పుడు నేను ఊళ్లలో చూసే వాణ్ని కనికట్టు ఆటలు. వాటికి లేటెస్ట్ వెర్షనే జగన్మాయ అంటూ ఎద్దేవా చేశారు.
– వచ్చేది మన ప్రభుత్వమే:
కలియుగ భస్మాసురుణ్ణి తరిమికొడదాం. సైకో పాలనకు నేనూ బాధితుణ్ణే అంటూ చంద్రబాబు అన్నారు. ఐదేళ్లు మనకు దారి దొరకలేదు. ఎంపీ జయదేవ్…రాజకీయ విరామం కోరాడంటే అర్ధం చేసుకోండి. సైకో దెబ్బకు అందరూ పారిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధాం. 72 రోజుల్లో జరిగే ఎన్నికల్లో వజ్రాయుధం లాంటి మీ ఓటుతో భస్మాసురుడిని తుదముట్టించాలన్నారు. నష్టపోయిన బాధితులే నాకు స్టార్ క్యాంపెయినర్లు. సైకో పాలన పోవాలి. సైకిల్ పాలన రావాలి. తెలుగుదేశం-జనసేన ఐక్యత వర్ధిల్లాలి అని చంద్రబాబు నాయుడు రా కదలి రా సభలో పిలుపు నిచ్చారు.