క్రెడిట్ స్కోర్ చూసుకుంటున్నారా.. జాగ్రత్త! ఈ తప్పులు చేస్తే తిప్పలు తప్పవు
విధాత: మార్కెట్లో అప్పు పుట్టాలంటే పరపతి తప్పనిసరి. బ్యాంకులు ఎవ్వరికైనా రుణాలిచ్చే ముందు వారికున్న క్రెడిట్ స్కోర్‌ను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటున్నాయిప్పుడు. అందుకే క్రెడిట్ స్కోర్ చాలాచాలా ముఖ్యమైన అంశం. మనలో చాలామంది తరచూ ఈ క్రెడిట్ స్కోర్లను చూసుకుంటూనే ఉంటాం. అయితే ఈ క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం తప్పదు. నిజానికి ఆన్లైన్లో క్రెడిట్ స్కోర్ సేవలను అందించే చాలా వెబ్సైట్లే ఉన్నాయి. కానీ వీటిలో విశ్వసనీయత ఎంత? అన్నది కూడా […]

విధాత: మార్కెట్లో అప్పు పుట్టాలంటే పరపతి తప్పనిసరి. బ్యాంకులు ఎవ్వరికైనా రుణాలిచ్చే ముందు వారికున్న క్రెడిట్ స్కోర్‌ను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటున్నాయిప్పుడు. అందుకే క్రెడిట్ స్కోర్ చాలాచాలా ముఖ్యమైన అంశం.
మనలో చాలామంది తరచూ ఈ క్రెడిట్ స్కోర్లను చూసుకుంటూనే ఉంటాం. అయితే ఈ క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం తప్పదు. నిజానికి ఆన్లైన్లో క్రెడిట్ స్కోర్ సేవలను అందించే చాలా వెబ్సైట్లే ఉన్నాయి. కానీ వీటిలో విశ్వసనీయత ఎంత? అన్నది కూడా చూసుకోవాల్సిందే.
ఏం చేయకూడదు
లోన్ అగ్రిగేటర్ వంటి అన్ఆథరైజ్డ్ వెబ్సైట్ల నుంచి క్రెడిట్ స్కోర్‌ను తీసుకుంటే మీ డాటాకున్న గోప్యతను కోల్పోయినట్టే. మీ పేరు, వయసు, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్ వంటి వివరాలు మార్కెట్లోకి వెళ్లిపోతాయి. దీనివల్ల క్రెడిట్ కార్డు సంస్థలు, ఆన్లైన్ లోన్ అగ్రిగేటర్స్ నుంచి మీకు కాల్స్ రావడం మొదలవుతుంది.
ఫలితంగా వృత్తిగత, వ్యక్తిగత జీవనానికి అంతరాయమే. అంతేగాక ఆన్లైన్ మోసాల బారిన కూడా పడే ప్రమాదం ఉన్నది. తెలిసో తెలియకో కొందరు తమ బ్యాంక్ వివరాలనూ వెబ్సైట్లో పేర్కొంటున్నారు. దీంతో ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్న ఘటనల్నీ చూస్తున్నాం.
ఇక దొరికిన వెబ్సైట్ నుంచి క్రెడిట్ స్కోర్ తీసుకుంటే అందులోని ప్రామాణికతనూ ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా మీ ఈ-మెయిల్ నుంచి ఎటువంటి లింక్స్‌ను ఎవ్వరికీ పంపరాదు. అవి మోసగాళ్ల చేతికి చిక్కి ఫిషింగ్ స్కాంలకు దారితీయవచ్చు.
ఎక్కడ చెక్ చేసుకోవాలి
దేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలున్నాయి. అవి.. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఈక్వీఫాక్స్, క్రిఫ్ హైమార్క్, ఎక్స్‌పరియన్. ఇవన్నీ కూడా మీ క్రెడిట్ స్కోర్‌ను కచ్ఛితంగా చూపుతాయి. అలాగే వన్స్కోర్ వంటి యాప్‌ల్లోనూ మన క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవచ్చు. ఇది ఉచితంగా సిబిల్, ఎక్స్‌పరియన్ నుంచి డాటాను సేకరించి మనకు అందిస్తుంది.
క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండిలా..
క్రెడిట్ స్కోర్ 800 ఆపై ఉంటేనే మీకు రుణ పరపతి ఎక్కువ. వడ్డీరేట్లూ తక్కువగా ఉంటాయి. అయితే రుణ చెల్లింపుల్లో వైఫల్యం, చెక్ బౌన్స్, అనవసర గ్యారంటీలు మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించే వీలున్నది. కాబట్టి అవసరమైతే తప్ప రుణాల జోలికి వెళ్లవద్దు. అలాగే పదేపదే రుణాల కోసం ఎంక్వైరీలు చేయవద్దు. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే ఆకర్షణీయమైన స్కోర్ మీ సొంతం.