బ్రహ్మోత్సవాలకు ‘చెరువుగట్టు’ముస్తాబు! పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం
పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం చెర్వుగట్టు తరలిరానున్న లక్షలాది భక్తులు అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం హోదా పెంపునకు పంపిన ప్రతిపాదనలు పదేళ్లుగా పెండింగ్‌లో.. విధాత: తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన నల్గొండ జిల్లా నార్కట్ పల్లి చెరువుగట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో శైవ భక్తులు తరలిరానున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో దేవాదాయ […]

- పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం చెర్వుగట్టు
- తరలిరానున్న లక్షలాది భక్తులు
- అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం
- హోదా పెంపునకు పంపిన ప్రతిపాదనలు పదేళ్లుగా పెండింగ్‌లో..
విధాత: తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన నల్గొండ జిల్లా నార్కట్ పల్లి చెరువుగట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో శైవ భక్తులు తరలిరానున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో దేవాదాయ శాఖ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఈనెల 28 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆరు రోజులపాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 29వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4:00 గంటలకు పార్వతీ రామలింగేశ్వర కళ్యాణోత్సవ ఘట్టాన్ని నిర్వహించనున్నారు. 31 వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4:00 గంటలకు స్వామివారి అగ్నిగుండాల క్రతువు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం ఉదయం 6:30 గంటలకు దోపోత్సవము, అశ్వవాహన సేవ, రాత్రి 7:00గంటలకు మహా పూర్ణాహుతి పుష్పోత్సవము, ఏకాంత సేవలు నిర్వహించనున్నారు. 2వ తేదీ గురువారం సాయంత్రం 4:00 గంటలకు గ్రామోత్సవమును చెరువుగట్టు, ఎల్లారెడ్డిగూడెంలో నిర్వహించడంతో బ్రహ్మోత్సవాల పర్వం ముగియనుంది.
బ్రహ్మోత్సవాల్లో ముఖ్యఘట్టమైన స్వామివారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున తలంబ్రాల బియ్యం, పట్టు వస్త్రాలను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమర్పించనున్నట్లుగా ఆలయ కార్యనిర్మాణ అధికారి ఎస్.నవీన్ తెలిపారు.
మహిమాన్వితం చెరువుగట్టు క్షేత్రం
చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం మహిమాన్వితమైనదిగా భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా, ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. విజయవాడ- హైదరాబాద్ రోడ్డు మార్గంలో నార్కట్ పల్లి వద్ద ఉన్న చెరువుగట్టు గుట్ట పైన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరుడు కొలువుతీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు.
స్థల పురాణం
పూర్వం కార్త్య వీర్యార్జున చక్రవర్తి సపరివారంగా వేట కోసం దండకారాణ్యానికి వెళ్తాడు. వెటాడిన తర్వాత విశ్రాంతి కోసం దగ్గరలోని జమదగ్ని ఆశ్రమానికి వెళ్తాడు. అప్పడు జమదగ్ని మహర్షి తన దగ్గర ఉన్న కామధేనువు సహాయంతో క్షణాల్లో రాజపరివారానికి పలు రకాల వంటలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ధేనువు మహత్తును తెలుసుకున్న రాజు కామధేనువును నాకు కావాలని అడుగుతాడు. మహర్షి ఒప్పుకోకపోవడంతో రాజు జమదగ్ని మహర్షి తలను ఖండించి కామధేనువును అపహరిస్తాడు.
విషయం తెలుసుకున్న పరశురాముడు మహోగ్రుడై భూమండలంలో ఒక్క క్షత్రియ రాజు కూడా లేకుండా సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందులో భాగంగానే తండ్రి జమదగ్నిని చంపిన కార్తవీర్యార్జునుడిపై దండెత్తి సంహరిస్తాడు. అనంతరం పరశురాముడు 21మార్లు భూప్రదక్షిణం చేసి కంటబడిన క్షత్రియ రాజులను సంహరిస్తాడు.
క్షత్రియ సంహారానంతరం తన పాప ప్రక్షాళన కోసం.. లోక కళ్యాణార్థం 108 పవిత్ర క్షేత్రాలలో శివలింగ ప్రతిష్ట చేసి తన తపోశక్తిని ప్రతి క్షేత్రంలోని శివలింగానికి దార పోసి విశ్వశాంతిని స్థాపిస్తాడు. అలా పరశురాముడు ప్రతిష్టించిన 108 శివలింగాల్లో చెరువుగట్టు శివలింగం ఆఖరిది కావడం విశేషం.
ఈ క్షేత్రంలో శివలింగం ప్రతిష్టించిన పరశురాముడు శివ దర్శనం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేయగా ఎంతకు శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఆగ్రహించి శివలింగంపై తన పరశువు( గొడ్డలి)తో కొట్టాడు. అప్పుడు ప్రత్యక్షమైన మహాశివుడు ఇన్నాళ్లుగా పరశురాముడు తపస్సు చేసి నన్ను మెప్పించిన ఈ క్షేత్రం దివ్య క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందుతుందని, కలియుగాంతం వరకు ఇక్కడ తాను కొలువై ఉండి భక్తుల కోరికలు తీరుస్తానని వాగ్దానం చేసి అంతర్ధానమయ్యాడని స్థల పురాణం.
మూడు గుండ్ల విశిష్టత
చెరువుగట్టు కొండపైన మూడు గుండ్లకు కూడా విశిష్టత ఉంది. మూడుగుండ్లను ఎక్కి అక్కడి శివలింగాన్ని దర్శించుకునే వారి కష్టాలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. చెరువుగట్టులో అమ్మవారు పార్వతి ఆలయం కొండకింద కొలువై ఉండడం విశేషం. కొండపైన గర్భాలయంలో కొలువైన రామలింగేశ్వరుని దర్శించుకున్నాక ఎల్లమ్మ, ఆంజనేయస్వామి, కాలభైరవుడి దర్శనానంతరం కొండ దిగువన పార్వతీ, భద్రకాళి, వీరభద్ర దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీ.
అమవాస్య రాత్రి నిద్ర చేస్తే…
ప్రతినెల అమావాస్య రోజున, సోమవారాల్లో చెరువుగట్టుకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మానసిక, శారీరక వ్యాధులు నరదోష, గ్రహ దోషాలు పోతాయన్న విశ్వాసంతో అమావాస్య రోజు రాత్రి చెర్వుగట్టుపై నిద్ర చేసేందుకు భక్తులు అధికంగా వస్తుంటారు. కొండ పైన జడల రామలింగేశ్వరుడికి పాదుకా పూజలు, ఒడి బియ్యం సమర్పణ సాధారణ రోజులతో పాటు బ్రహ్మోత్సవాల్లో కూడా కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవంలో ఒడి బియ్యం సమర్పణకు, అగ్నిగుండాల ఘట్టంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
చెరువుగట్టు అభివృద్ధి పట్టని ప్రభుత్వం
జిల్లాలో అతిపెద్ద దేవస్థానంగా పేరుగాంచిన చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుతం సహాయ కమిషనర్ (ఏసి) హోదాలోనే కొనసాగుతుంది. ఉప కమిషనర్ (డిసి) హోదాకు పెంచేందుకు పంపిన ప్రతిపాదనలు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. వరుసగా మూడేళ్లు కోటి రూపాయల ఆదాయం దాటితే దేవస్థానానికి డీసీ కేడర్ పదోన్నతి లభించాల్సి ఉంది. అయితే చెరువుగట్టు దేవస్థానంలో పదేళ్లుగా కోటి నుండి 10కోట్లకు పైగా ఆదాయం పెరిగినప్పటికీ డిసి కేడర్ హోదా ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఇక్కడ ఏసీ కేడర్ సిబ్బందితో వసతుల కల్పన చేయలేకపోతున్నందున, డిసి క్యాడర్ కల్పించి సిబ్బందిని పెంచి భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్న డిమాండ్ భక్తుల నుంచి వినిపిస్తుంది.
ఉజ్జయిని మహంకాళి ఆలయం తెలంగాణ ఏర్పాటు పిదప ఏసీ కేడర్ నుండి డీసీ క్యాడర్ కు అప్ గ్రేడ్ అయిందని, అలాంటప్పుడు 2012లో డీసీ కేడర్ హోదా కోసం ప్రతిపాదించిన చెరువుగట్టు ఆలయానికి ఇప్పటిదాకా డీసీ కేడర్ హోదా ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.
అవినీతి, అక్రమాలకు నిలయంగా…
ఇదే సమయంలో చెరువుగట్టు క్షేత్రం అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందన్న ఆరోపణలకు సైతం వేదిక అయింది. దేవస్థానం నిర్వహించిన టెండర్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఫిర్యాదులపై దేవాదాయ శాఖ వరంగల్ డిసి శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేపట్టిన విచారణ రాజకీయ జోక్యంతో అటకెక్కిపోగా అక్రమార్కులకు అడ్డు కట్ట లేకుండా పోయింది.
పొరుగు సేవల ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులుగా మారిపోగా, టెంకాయలు, కోడే మొక్కులు, తల వెంట్రుకలు, టోల్ గేట్, దుకాణాల నిర్వహణ కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా భక్తులను దోపిడీ చేస్తున్నారు. ఆలయ సొమ్ము దోచుకోవడంలో ఉద్యోగులు గ్రూపులుగా విడిపోగా, కాంట్రాక్టర్లు, పాలకవర్గ సభ్యులు, అధికారులు ‘తిలాపాపం తలాపిడికెడు’ అన్నట్లుగా దేవుడి సొమ్ము స్వాహా చేస్తున్నారన్న విమర్శలు భక్తుల నుండి వ్యక్తం అవుతున్నాయి.