ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర: సీఎం కేజ్రీవాల్
దేశ రాజధానిలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కుట్ర పన్నుతున్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు

- ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలుకు రూ.25 కోట్ల ఆఫర్
- ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు
విధాత: దేశ రాజధానిలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కుట్ర పన్నుతున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని రూ. 25 కోట్ల ఆఫర్‌తో కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని విమర్శించారు. ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరుపుతున్నదని, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనను త్వరలో అరెస్టు చేస్తామని బెదిరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీలోని ఆప్ సర్కారును కూల్చాలనే కుట్ర బీజేపీకి ఉన్నట్టు తేలిందని చెప్పారు.
శనివారం సుదీర్ఘ సోషల్ మీడియా పోస్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అనేక ఆరోపణలు చేశారు. “ఇటీవల వారు (బీజేపీ) మా ఢిల్లీ ఎమ్మెల్యేలలో ఏడుగురిని సంప్రదించారు. ‘మేము కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తాం. ఆ తర్వాత మేము ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేస్తాం. 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిగాయి.. ఇతరులతో కూడా మాట్లాడుతున్నాం. ఆ తర్వాత ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం.. మీరు కూడా రండి. ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు ఇస్తాం. ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై గెలిపిస్తాం” అని పేర్కొన్నారు.
21 మంది ఎమ్మెల్యేలను సంప్రదించినట్టు వాదన ఉన్నప్పటికీ, కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలను మాత్రమే సంప్రదించారని, ఆప్‌కి అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తున్నదని కేజ్రీవాల్ తెలిపారు. వారందరూ ఉత్సాహపరిచే ఆఫర్‌ను గట్టిగా తిరస్కరించారని చెప్పారు.
“మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి నన్ను అరెస్టు చేయడం లేదని దీని అర్థం, కానీ, వారు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నుతున్నారు” అని కేజ్రీవాల్ తెలిపారు. ‘గత తొమ్మిదేండ్లుగా మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎన్నో కుట్రలు పన్నారు. కానీ, అవి ఏ మాత్రం ఫలించడం లేదు. దేవుడు, ప్రజలు మమ్మల్ని ఎప్పుడూ ఆదరించారు.. మా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నారు.. ఈ సారి కూడా వాళ్ల నీచమైన పనిలో విఫలమవుతారు” అని పేర్కొన్నారు.