NVSS Prabhakar: రేవంత్‌ రెడ్డి స్థానంలో సీఎంగా మళ్లీ కేసీఆర్‌..

NVSS Prabhakar: రేవంత్‌ రెడ్డి స్థానంలో సీఎంగా మళ్లీ కేసీఆర్‌..
  • జూన్‌ 2 లేదా డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌లో బీఆరెస్‌ విలీనం
  • బీజేపీ సీనియర్‌ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు

NVSS Prabhakar : తెలంగాణలో సీఎం మార్పు ఖాయమంటూ బీజేపీ సీనీయర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందన్నారు. జూన్ 2న లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ పార్టీ విలీనం జరుగనుందని..సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారని ప్రభాకర్ జోస్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానంటూ చెప్పుకొచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా కేటీఆర్ నాయకత్వంలోనూ పనిచేస్తానంటున్నారని..కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరి..రాజీ జరిగిన నేపథ్యంలోనే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారని ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. ఇక మిగిలింది కేవలం అధికార మార్పిడి, పార్టీల విలీనం మాత్రమేనని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సోనియమ్మ తెలంగాణపై మాట నిలుపుకున్నారని చెప్పుకుంటు వచ్చారని..ఇక కేసీఆర్ మాట నిలబెట్టుకునేందుకు పార్టీని విలీనం చేస్తారన్నారు.

తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలన పూర్తయి..కాంగ్రెస్ పాలన మొదలైన క్రమంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని ఒక్కో కుంభకోణం వెలుగు చూస్తున్న క్రమంలో ఏం చేయాలన్నదానిపై చర్చల అనంతరం రెండు పార్టీల విలీనానికి నిర్ణయం జరిగిందన్నారు. కవిత కు న్యాయ సలహాలు అందిస్తున్న న్యాయవాదిని చట్టసభకు కాంగ్రెస్ ఎంపిక చేసిందని, బీఆర్ఎస్ స్కామ్ లపై విచారణలలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఇదంతా ఆ రెండు పార్టీల విలీన ప్రక్రయలో భాగమేనన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో గ్రామసభల ద్వారా ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందకుండా ఆ పార్టీల కేడర్ కే అందుతున్నాయన్నారు. అందుకే వారి పాలనలో సంక్షేమ పథకాల అమలులో న్యాయ విచారణ జరుపాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర నిధులున్నాయన్నారు.

ఆపరేషన్ సిందూర్ తో ప్రధాని మోదీ నాయకత్వంలో సైనిక పరంగా, దౌత్య పరంగా పాకిస్తాన్ పై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చాటిందన్నారు. మరోవైపు దేశంలోని కమ్యూనిస్టులు మాత్రం ఉగ్రవాదంపై భారత్ పోరుపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. దేశంలో కమ్యూనిస్టుల రాజకీయాలు చూస్తే వారి పార్టీ అభివృద్ధి కంటే బీజేపీని దెబ్బతీసే విధానంపైనే సాగడం విచారకరమన్నారు. కాలం చెల్లిన కమ్యూనిజం దేశంలో రోజురోజుకు బలహీనమవుతున్నప్పటికి వారు దేశీయ విధానాలను అనుసరించడం లేదని విమర్శించారు.