CM KCR | వ్యవసాయం కిందపడనీయద్దు: సీఎం కేసీఆర్‌

పంట నష్టాన్ని పరిశీలించిన సీఎం రేగడి తండా, అడవి రంగాపురంలో దెబ్బతి పంటల పరిశీలన ఎకరాకు రూ.10వేల పరిహారం కౌలు రైతులను ఆదుకోవాలి భారీ పోలీసు బందోబస్తు పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయాన్ని కిందికి పడనీయొద్దని, వెనక్కి పోనీయవద్దంటూ సీఎం కేసీఆర్ (CM KCR) రైతులకు ధైర్యం అందించారు. మేమంతా మీకు ధైర్యం చెప్పడానికే వచ్చినాం, ఇంకా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. మీరంత ధైర్యం చెడకుండా ముందుకే పోవాలి. […]

  • By: Somu    latest    Mar 23, 2023 11:07 AM IST
CM KCR | వ్యవసాయం కిందపడనీయద్దు: సీఎం కేసీఆర్‌
  • పంట నష్టాన్ని పరిశీలించిన సీఎం
  • రేగడి తండా, అడవి రంగాపురంలో దెబ్బతి పంటల పరిశీలన
  • ఎకరాకు రూ.10వేల పరిహారం
  • కౌలు రైతులను ఆదుకోవాలి
  • భారీ పోలీసు బందోబస్తు
  • పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయాన్ని కిందికి పడనీయొద్దని, వెనక్కి పోనీయవద్దంటూ సీఎం కేసీఆర్ (CM KCR) రైతులకు ధైర్యం అందించారు. మేమంతా మీకు ధైర్యం చెప్పడానికే వచ్చినాం, ఇంకా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. మీరంత ధైర్యం చెడకుండా ముందుకే పోవాలి. అందుకే మేమంతా వచ్చామన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేగడి తండా అడవి రంగాపురం గ్రామాల్లో వడగండ్ల వానతో వంట నష్టపోయిన ప్రాంతాలను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. దీనికి ముందు పంట నష్టపోయిన ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. ఖమ్మం నుంచి ముందుగా మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రేగడి తండా గ్రామానికి చేరుకొని అక్కడ రైతులతో మాట్లాడారు. అనంతరం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకొని పంట పొలాలను పరిశీలించి రైతుల ఆవేదనను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మునపటిలాగా అగో అంటే ఆరు నెలలకు గాకుండా.. దొంగలు పడ్డంక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కాకుండా…మీ నష్ట పరిహారాన్ని తొందరగానే పంపిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడే సిఎం కెసిఆర్ రైతులనుద్దేశించి మాట్లాడారు.

ఎకరాకు పదివేల పరిహారం ప్రకటన

పంటల నష్టాలకు ఎక్కడైనా రూ.3 వేలే ఇస్తారని మన రైతుల కోసం మన ప్రభుత్వం ఎకరాకు పదివేల పరిహారాన్ని చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నేను హైదరాబాద్ నుండే ఈ ప్రకటన చేయవచ్చు. కానీ, నేను స్వయంగా పంటల నష్టాలు చూడాలనుకున్నాను. రైతులను ఓదార్చాలనుకున్నానని కెసిఆర్ చెప్పారు. రైతులతో మాట్లాడాలని భావించానని అందుకే వచ్చానని ఆయన అన్నారు.

పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని పంటలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. నేను వ్యవసాయం చేస్తాను, మంత్రి నిరంజన్ రెడ్డి, దయాకర్ రావులు కూడా వ్యవసాయం చేస్తున్నామని, స్వయంగా మేమంతా రైతులం కాబట్టి రైతు కష్టం తెలుసని అన్నారు.

కౌలు రైతులను కూడా ఆదుకోవాలి

కౌలుకు తీసుకున్న రైతులను కూడా ఆదుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా వారికి కూడా అండగా ఉంటుందన్నారు. రైతులే కౌలుదారులను ఆదుకునే విధంగా కలెక్టర్లు వ్యవహరించాలన్నారు. రైతులే దయ తలచి వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు రైతులను, కౌలు రైతులను పిలిచి మాట్లడతారని చెప్పారు. రైతులు పొందే పరిహారంలోనే ఎంతో కొంత కౌలు రైతులకు కూడా అందేవిధంగా చూస్తే బాగుంటుందన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులను ఆదుకుంటున్నది తెలంగాణ రాష్ట్రమేనని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం, పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దు. నిరాశ పడొద్దని ధైర్య వచనాలు అందించారు. రైతులకు ఇచ్చేది సహాయం కాదు.. పునరావాసమని సీఎం చెప్పారు.

పంట నష్టాన్ని పరిశీలించిన సీఎం

అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ముందుగా ఎరియల్ వ్యూ ద్వారా, తర్వాత స్వయంగా నష్టపోయిన పంటలను సిఎం కెసిఆర్ పరిశీలించారు. పంటల నష్టాలపై సంబంధిత రైతులు సిఎం కెసిఆర్ కు వివరించారు. పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, ఫోటో ఎగ్జిబిషన్ ను సిఎం చూశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ అనే భాస్కర్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎంపీ కవిత, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సిఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సిపి రంగనాథ్, అడిషన్ కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పెద్ద వంగర, దుగ్గొండి ప్రాంతాలలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.