తరుముకొస్తున్న ఎన్నికల కోడ్‌

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.

  • By: Somu    latest    Feb 24, 2024 11:37 AM IST
తరుముకొస్తున్న ఎన్నికల కోడ్‌
  • శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు వారం రోజుల్లోగా పెట్టుకోండి
  • అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
  • హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్
  • రాజధాని తాగునీటి అవసరాలకు 50ఏండ్ల ప్రణాళికలు


విధాత, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. కొత్తగా చేపట్టాల్సిన పనులకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు ఏమైనా ఉంటే వారం రోజుల్లోగా పెట్టుకోవాలని ఆదేశాలిచ్చారు. హెచ్ఎండీఏ వాట‌ర్ వ‌ర్క్స్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, జీహెచ్ఎంసీ కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త పథకాల మంజూరీ.. నిధుల మంజూరుకు సంబంధించి అధికారులను, ప్రజాప్రతినిధులను పరుగులు పెట్టిస్తుంది.


ఇప్పటికే ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు 200యూనిట్ల గృహజ్యోతి, 500రూపాయలకే గ్యాస్‌సిలిండర్ పథకాలను ఈ నెల 27న ప్రారంభించాలని నిర్ణయించుకున్న రేవంత్‌రెడ్డి అధికారులను కూడా తమ శాఖల పరిధిలో చేపట్టాల్సిన కొత్త పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ఫ్రారంభోత్సవాలను వారం రోజుల్లోగా పెట్టుకోవాలని చెప్పడం గమనార్హం.


హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్


తెలంగాణ అభివృద్ధికి గుండెకాయల మారిన హైదరాబాద్ నగర అభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా గట్టి కసరత్తునే సాగిస్తున్నారు. అదిగాక కాంగ్రెస్‌కు గ్రామీణ తెలంగాణ బ్రహ్మరథం పడితే గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు గెలువకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డిలో కసి పెంచింది. నగర అభివృద్ధిపై ప్రజల నమ్మకాన్ని చూరగొనే రీతిలో పని చేయాలని ఆయన సంకల్పంగా పెట్టుకున్నారు. తన వద్దకు పనుల కోసం వస్తున్న గ్రేటర్‌లోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రాజకీయాలకు అతీతంగా ఆయన నిధులు మంజూరీ చేస్తు నగర అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా వ్యవహారిస్తు తన చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారు.


గత సీఎంల మాదిరిగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేయాలన్న భావనతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఐటీ, పారిశ్రామిక, ఫార్మా రంగాలకు ప్రొత్సాహం అందిస్తునే నగర మౌలిక వసతుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మూసీ నదిని థెమ్స్ నది తరహాలో ప్రక్షాళన చేయాలని ఆయన నిర్ణయించి ఇందుకోసం జైకా నిధుల సాధనతో కీలక ముందడుగు వేశారు. నగరంలో శాంతిభద్రతలపై ఇప్పటికే పోలీస్ శాఖలోని వివిధ విభాగాల ఆధికారుల్లో మార్పులు చేర్పులు చేయడంతో నగరంలో డ్రగ్ రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలను నిర్ధేశించారు.


ట్రాఫిక్ సమస్యలు, మెట్రో విస్తరణ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త మెట్రో మార్గాలకు షెడ్యూల్ లోగా శంకుస్థాపనలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కీలకంగా ఉన్న భూముల వ్యవహారం, రియల్ ఎస్టేట్ రంగం, భవన నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో విలువైన ప్ర‌భుత్వ ఆస్తుల, భూముల జాబితాను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని ఆదేశించడం ఆసక్తి రేపింది.


చెరువుల పరిరక్షణకు చర్యలు


హెచ్‌ఎండీఏ ప‌రిధిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్స్ ఫైల్స్ చాలవరకు కనిపించడం లేదని, ఆన్‌లైన్ లేకుండా ఇష్టారీతిగా అనుమతినిచ్చారని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు చేసి తనకు సమర్పించాలని కీలక ఆదేశాలిచ్చారు. హెచ్ ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోందని అధికారులను నిలదీసిన సీఎం రేవంత్‌రెడ్డి 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందేనని,చెరువులు ఆక్ర‌మ‌ణ‌కు గురికాకుండా వాటి వ‌ద్ద త‌క్ష‌ణ‌మే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


అధికారుల పనితీరుపై నిఘా ఉంటుందని, 15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయని, ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇంటికిపోతారని హెచ్చరించారు. ఉద‌య‌మే లేచి కాల‌నీల్లో ప‌ర్య‌టించని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ఇంటికి వెళ్లిపోవ‌చ్చ‌ని, కుర్చీల్లో కూర్చోే పోస్టులు కావాలంటే ఇస్తామని పరోక్ష హెచ్చరికలు చేశారు. ఆస్తి ప‌న్ను మ‌దింపు కోసం డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించడంపై అధ్యయనం చేయాలన్నారు. న‌గ‌రంలో పిల్ల‌ల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


మల్టిలెవల్ పార్కింగ్‌లు


హైదరాబాద్‌లో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్‌, పార్కింగ్ సమస్యల నియంత్రణ దిశగా ప్రైవేట్ సెక్టార్‌లో మల్టీ లెవల్ పార్కింగ్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్ధేశం చేశారు. హైద‌రాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హాలో వీడియో ప్ర‌క‌ట‌న‌ల బోర్డు ఏర్పాటు చేయాలని, మ‌ల్టీ యుటిలిటీ ట‌వ‌ర్స్‌ను ఏర్పాటుకు, వీధి దీపాలు మెరుగుద‌ల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. జీహెచ్ ఎంసీలో వ‌య‌స్సుపైబ‌డిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వడం ద్వారా విధుల నిర్వాహణను మెరుగుపరుచాలన్నారు.


నీటీ సమస్యల నివారణకు ముందస్తు ప్రణాళికలు


విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్‌లో అన్ని ప్రజలకు, కంపనీదారులకు ఎవరికి కూడా తాగునీటి కొరత లేకుండా చూడాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. నీటి కోసం స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని, మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌ణాళిక ర‌చించాల‌ని ఆదేశించారు. ఔట‌ర్ రింగు రోడ్డు బ‌య‌ట ఉన్న చెరువుల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించాల‌ని సూచించారు. నగరానికి వ‌చ్చే 50 ఏళ్ల తాగు నీటి అవ‌స‌రాల కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని అధికారుల‌కు సూచించడం ద్వారా నగర అభివృద్ది పట్ల తన ప్రాధాన్యతను సీఎం రేవంత్‌రెడ్డి చాటుకున్నారు.