ఇక చీల్చాల్సిందేనా?

ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను అనుసరించాలన్న యోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారా? ప్రభుత్వం పడిపోతుందంటూ పదే పదే

ఇక చీల్చాల్సిందేనా?

విపక్షానికి, స్వపక్షానికి అదే చెక్‌

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

ఫిరాయింపులకు రంగం సిద్ధం?

చట్టం వర్తించకుండా ఏర్పాట్లు

ఒకే దఫాలో కనీసం 18 మంది

బీఆరెస్ ఎమ్మెల్యేల చేరికలపై

పావులు కదుపుతున్న సీఎం?

విధాత: ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను అనుసరించాలన్న యోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారా? ప్రభుత్వం పడిపోతుందంటూ పదే పదే బెదిరిస్తున్నవారికి గతంలో వారు అనుసరించిన అస్త్రంతోనే దిమ్మతిరిగే సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారా? బొటాబొటీ మెజర్టీతో ఉన్న ప్రభుత్వాన్ని దుర్బేధ్యంగా మార్చేందుకు బీఆరెస్‌ శాసనసభాపక్షంలో చీలిక తెచ్చేందుకు రంగాన్ని రెడీ చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోమారు విజయం సాధిస్తే.. ప్రస్తుతం స్వల్ప మెజార్టీతో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు ఏ మాత్రం వెనుకాడబోరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈలోపే ఎదురుదెబ్బ తీయాలన్న అభిప్రాయంతో రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తున్నది. నిజానికి పార్టీ ఫిరాయింపులను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన కాంగ్రెస్‌ నాయకుడు.. ఇంతకాలం వేచిచూసే ధోరణి అనుసరించారు. అయితే ఇటీవల బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సహా, కేటీఆర్ నుంచి, అదే సమయంలో బీజేపీ నేతల నుంచి కొన్ని నెలల్లోనే తన ప్రభుత్వం పడిపోతుందన్న మాటలను రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. స్వతహాగా ఫిరాయింపులను ప్రొత్సహించరాదన్న ఒట్టు తీసి గట్టున పెట్టి.. ఆత్మరక్షణ సూక్తి స్ఫూర్తిగా తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఫిరాయింపు అస్త్రం ప్రయోగించే సమయం వచ్చిందనుకుంటున్నారని అంటున్నారు. ఇందుకు విపక్ష నేత కేసీఆర్ చూపిన బాటలోనే, ఆయన వ్యూహంతో ఆయన పార్టీనే దెబ్బకొట్టి, తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలన్న నిర్ణయానికి రేవంత్ వచ్చినట్లుగా తెలుస్తున్నది.

2014లో కేసీఆర్ ప్రభుత్వానికి 63మంది ఎమ్మెల్యేలు ఉండగా, స్పష్టమైన మెజార్టీ సాధన కోసమంటూ అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆరెస్‌లోకి చేర్చుకున్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డికి కూడా 64మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవైపు బయట బీఆరెస్‌, బీజేపీ ఎప్పుడు ప్రభుత్వం కూలుతుందా? అని ఎదురుచూస్తున్నాయి. మరోవైపు ఎప్పుడు తమకు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందా? అని కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు సహా పలువురు అదును కోసం పొంచి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బీఆరెస్ ఎమ్మెల్యేల వలసలకు గేట్లు తెరవాలని నిర్ణయించుకున్నారని అంతర్గతంగా ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పలువురు బీఆరెస్‌ ఎమ్మెల్యేలు నియోజకవర్గ పనుల కోసం అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. వారు కలిసిన ప్రతి సందర్భంలోనూ వారు రేపో మాపో పార్టీ మారబోతున్నారన్న వార్తలు గుప్పుమన్నయి. కానీ.. అవి వాస్తవ రూపం దాల్చలేదు. ప్రస్తుతం బీఆరెస్ నుంచి 15నుంచి 18ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో టచ్‌లో ఉన్నారని, రేవంత్ సై అంటే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని కొంతకాలంగా ప్రచారం కొనసాగుతున్నది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు మెజార్టీగా ఉన్నారని సమాచారం.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో బీఆరెస్ బలహీన పడింది. మరోవైపు గతంకంటే బీజేపీ బలం పెంచుకున్నది. ఇక అధికార పార్టీతో కలిసి, స్వీయ కార్యాలయను చక్కబెట్టుకోవడం ఎంఐఎంకు అలవాటు అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎంఐఎం స్వల్ప కాలంలోనే రేవంత్‌రెడ్డికి మొగ్గు చూపింది. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రస్తుతం ఎంఐఎం మద్దతు కూడగట్టడంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే సఫలీకృతమయ్యారు. ఇటీవల చాంద్రాయణ గుట్ట మెట్రో రైల్ విస్తరణలో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని, ఐదేళ్లు నిశ్చింతగా పాలించుకోవచ్చని ఇచ్చిన భరోసా వ్యాఖ్యలే బహిరంగ నిదర్శనంగా నిలిచాయి. అయినప్పటికీ సొంత పార్టీలో సీఎం కుర్చీ కోసం కాచుకు కూర్చున్న నేతల నుంచి తనకు ముప్పు రాకుండా, ప్రతిపక్షం సంఖ్యాబలం సైతం తగ్గించేందుకు బీఆరెస్ నుంచి ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వక తప్పదని రేవంత్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫిరాయింపుల చట్టం వర్తించకుండా!

బీఆరెస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల చట్టం బారిన పడకుండా తగిన సంఖ్యతో కూడిన ఎమ్మెల్యేలను ఒకేసారి కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల కథనం. తద్వారా అటు పదేపదే ప్రభుత్వాన్ని పడిపోతుందన్న విపక్షం బీఆరెస్, బీజేపీ మాటలకు చెక్ పెట్టడంతో పాటు వలస ఎమ్మెల్యేలతో తనకు సమకూరే అదనపు బలంతో సొంత పార్టీ నేతల తిరుగుబాటు ఆలోచనలకు చెక్ పెట్టవచ్చని తద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడగొట్టినట్లుగా రేవంత్ వ్యూహంగా ఉందంటున్నారు.

పార్లమెంటు ఎన్నికలకు ముందా.. తర్వాతా

బీఆరెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రక్రియ పార్లమెంటు ఎన్నికలకు ముందా లేక తర్వాతనా అన్నది తేలాల్సివుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో ఇక్కడ అభివృద్ధి పనులను నిర్వహించడంలో, నిధుల మంజూరులో రేవంత్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నది. అసలే పార్లమెంటు ఎన్నికలు తన పాలనకు రెఫరెండమ్ అంటూ ప్రకటించారు. దీంతో గ్రేటర్ పరిధిలోని లోక్‌సభ స్థానాలతో పాటు రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలు గెలవడం సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భారీ విజయాలు సాధించాలంటే పార్లమెంటు ఎన్నికలకు ముందే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, బీఆరెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే మంచిదన్న వాదనకు సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపినట్లుగా తెలుస్తున్నది.