30 ఏండ్ల చ‌రిత్ర‌ను కాంగ్రెస్ తిర‌గ రాయ‌బోతున్నదా?

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్ర‌మే. ఆయా పార్టీల అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం మ‌రికొద్ది గంట‌ల్లో తేల‌నుంది

  • By: Somu    latest    Dec 02, 2023 12:51 PM IST
30 ఏండ్ల చ‌రిత్ర‌ను కాంగ్రెస్ తిర‌గ రాయ‌బోతున్నదా?
  • ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు నిజం కానున్నాయా..?


విధాత‌: తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్ర‌మే. ఆయా పార్టీల అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం మ‌రికొద్ది గంట‌ల్లో తేల‌నుంది. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల ప్ర‌కారం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంద‌ని స్ప‌ష్టమైంది. కానీ అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం తామే మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని ధీమాతో ఉంది.


ఇలా ఎవ‌రి అంచ‌నాలు వారికి ఉన్నాయి. అయితే తెలంగాణ‌లో అడ్ర‌స్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ 30 ఏండ్ల చ‌రిత్ర‌ను తిర‌గ రాస్తుందా..? అనే అంశంపై జోరుగా చ‌ర్చ కొన‌సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల ప్ర‌కారం.. కాంగ్రెస్ పార్టీ ఆ రికార్డును బ్రేక్ చేయ‌బోతున్న‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. మ‌రి రికార్డు సృష్టిస్తారా..? ర‌న్న‌ర‌ప్‌గా నిలుస్తారా..? అన్న‌ది మ‌రికొద్ది గంట‌ల్లో తేల‌నుంది.


ఇక తెలంగాణ వ్యాప్తంగా త్రిముఖ పోటీ ఉంటుంద‌ని అంద‌రూ ఊహించారు. కానీ ద్విముఖ పోటీనే ఉన్న‌ట్లు ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేశాయి. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే త్రిముఖ పోటీ ఉంది. ప్ర‌ధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నార‌ని ఆ పార్టీ నేత‌లు విశ్వాసంతో ఉన్నారు. 70 సీట్ల‌తో తామే అధికారంలోకి రాబోతున్నామ‌ని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్య‌క్తం చేస్తోంది.


అయితే తెలంగాణ‌లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్ర‌మించింద‌ని చెప్పొచ్చు. క‌ర్ణాట‌క‌లో ఫైవ్ పాయింట్ ఫార్ములా వ‌ర్క‌వుట్ కావ‌డంతో తెలంగాణ‌లో ఆరు గ్యారెంటీల‌తో వివిధ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించి, ప్ర‌చారం చేసింది. తెలంగాణ‌లో మ‌ళ్లీ ఇందిర‌మ్మ రాజ్యం నెల‌కొల్ప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని చెబుతూ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌చారంలో దూసుకుపోయారు.


ఇక మూడోసారి అధికారం చేజిక్కించుకునేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇందిర‌మ్మ రాజ్యం అంటేనే దోపిడీ, దొంగ‌ల రాజ్యం.. ఎమ‌ర్జెన్సీ పెట్టి అంద‌ర్నీ జైల్లో వేసిన చ‌రిత్ర‌.. సాగు, మంచినీళ్ల‌తో పాటు క‌రెంట్ కోత‌లు పెట్టి, రైతుల ఆత్మ‌హ‌త్య‌లకు కార‌ణ‌మైన.. ఆ దిక్కుమాలిన రాజ్యం మ‌ళ్లీ కావాల్నా అంటూ కేసీఆర్ త‌న ఉప‌న్యాసాల్లో విరుచుకుప‌డ్డారు.


ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే 2014, 2018 ఎన్నిక‌ల్లో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ఓట‌మి చ‌విచూడ‌నుందా..? అస‌లు తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ త‌న ఉనికిని కాపాడుకోనుందా..? ఆ పార్టీ గ‌త చ‌రిత్ర ఏంటి..? అనే విష‌యాల్లోకి వెళ్తే.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు 21 సీట్ల‌ను మించ‌లేదు. గ‌త 30 ఏండ్ల చ‌రిత్రను ప‌రిశీలించిన‌ప్ప‌టికీ 60 సీట్ల‌ను దాట‌లేదు. మ‌రి ఇప్పుడు ఫ‌లితం ఎలా ఉండ‌బోతుంద‌నేది మ‌రి కొద్ది గంటల్లో స్ప‌ష్టం కానుంది.


తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఇది..


2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత అదే ఏడాది శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగాయి. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి కేవ‌లం 21 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో 19 స్థానాల్లో మాత్ర‌మే గెలుపొందింది. క‌నీసం మేజిక్ ఫిగ‌ర్ 60ని కూడా అందుకోలేక‌పోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నిక‌ల్లో మేజిక్ ఫిగ‌ర్‌ను దాటి అధికారాన్ని కైవ‌సం చేసుకోబోతున్నామ‌ని కాంగ్రెస్ నాయ‌క‌త్వం ధీమాతో ఉంది. కాగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా పొన్నాల ల‌క్ష్మ‌య్య ఉన్నారు. 2018 ఎన్నిక‌ల‌ప్పుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. తాజాగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది.


1989లో అత్య‌ధికంగా 59 సీట్లు..


ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 60 సీట్ల‌కు పైగా సాధించ‌లేదు. 1989 ఎన్నిక‌ల్లో అత్య‌ధికంగా 59 స్థానాల్లో గెలుపొందింది. నాడు ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్‌కు 181 సీట్లు వ‌చ్చాయి. 1989లో పీసీసీ అధ్య‌క్షుడు నెద‌రుమ‌ల్లి జ‌నార్ధ‌న్ రెడ్డి. 1999 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో 42 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే గెలుపొందింది కాంగ్రెస్ పార్టీ. 1994 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్‌కు వ‌చ్చింది కేవ‌లం 26 సీట్లు మాత్ర‌మే. 1999, 1994లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. 2004 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్‌కు 185 సీట్లు రాగా, తెలంగాణ‌లో వ‌చ్చిన‌వి 48 మాత్ర‌మే. 2009లో 156 స్థానాల్లో గెలుపొంద‌గా, తెలంగాణ‌లో 49 స్థానాల్లో గెలుపొందింది హ‌స్తం పార్టీ.



మ‌రి ఇప్పుడు కాంగ్రెస్ చ‌రిత్ర తిర‌గ‌రాస్తుందా..?


గత 30 ఏండ్ల‌ చరిత్రను ప‌రిశీలిస్తే, కాంగ్రెస్‌కు తెలంగాణలో వచ్చిన అత్యధిక సీట్లు 59 మాత్రమే. 60 సీట్లు ఏనాడూ దాటలేదు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో సాధించిన విజ‌యం అంతంతమాత్రమే. ఈ సారి అధికారంలోకి రావాలంటే, గ‌త చ‌రిత్ర‌ను బ్రేక్ చేయాలంటే, ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల ప్ర‌కారం.. ఆ స్థాయిలో కాంగ్రెస్ సీట్లు కైవసం చేసుకోవాలి. మ‌రి రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిర‌గ‌రాసి, 2024 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌కు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచి కాబోతుందా..? ఆ ఫ‌లితం కోసం డిసెంబ‌ర్ 3వ తేదీ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు వేచి చూడాల్సిందే.