Congress | బీఆరెస్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌.. కాంగ్రెస్‌ చావో రేవో

Congress | బీఆరెస్‌ అవినీతిపై జనంలో విస్తృత ప్రచారం అభివృద్ధి ముసుగును ఎండగట్టాలని నిర్ణయం కాంగ్రెస్‌ సీఎంలు, మంత్రులు, కీలక నేతలతో రాష్ట్రంలోని 119 నియోజవకర్గాల్లో సభలు ప్రత్యేకంగా కేంద్రీకరించిన కాంగ్రెస్‌ నాయకత్వం తెలంగాణ సాకారంలో వాస్తవాలు వెల్లడించే యోచన విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ ఏర్పాటు, అందుకు కాంగ్రెస్‌ చేసిన కృషి ఏమిటి? దానికి కేసీఆర్‌ హైజాక్‌ చేసిన తీరు, రాష్ట్రంలో అభివృద్ధి తదితర అంశాల్లో అధికార బీఆరెస్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్నది. తెలంగాణ […]

  • By: krs    latest    Sep 02, 2023 12:58 AM IST
Congress | బీఆరెస్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌.. కాంగ్రెస్‌ చావో రేవో

Congress |

  • బీఆరెస్‌ అవినీతిపై జనంలో విస్తృత ప్రచారం
  • అభివృద్ధి ముసుగును ఎండగట్టాలని నిర్ణయం
  • కాంగ్రెస్‌ సీఎంలు, మంత్రులు, కీలక నేతలతో
  • రాష్ట్రంలోని 119 నియోజవకర్గాల్లో సభలు
  • ప్రత్యేకంగా కేంద్రీకరించిన కాంగ్రెస్‌ నాయకత్వం
  • తెలంగాణ సాకారంలో వాస్తవాలు వెల్లడించే యోచన

విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ ఏర్పాటు, అందుకు కాంగ్రెస్‌ చేసిన కృషి ఏమిటి? దానికి కేసీఆర్‌ హైజాక్‌ చేసిన తీరు, రాష్ట్రంలో అభివృద్ధి తదితర అంశాల్లో అధికార బీఆరెస్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్నది. తెలంగాణ ఏర్పాటు త‌రువాత రెండుసార్లు అధికారంలోకి రాలేక పోయిన కాంగ్రెస్‌.. ఈసారి చావో రేవో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనేక క‌ష్ట న‌ష్టాల‌కు ఓర్చి తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసినప్పటికీ.. అధికారంలోకి రాలేకపోయిన పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న జాతీయ నాయకత్వం.. రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందని చెబుతున్నారు.

నిత్య క‌ల‌హాల‌తో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ను గాడిలో పెట్టిన జాతీయ నాయ‌కులు.. ఇప్పుడు గెలుపుపై దృష్టి సారించారని సమాచారం. ఇందుకోసం నాలుగు అంశాల‌పై విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని నిర్ఱ‌యించారు. ఈ మేర‌కు దేశవ్యాపంగా ఉన్న కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ నాయ‌కులతో రాష్ట్రంలోని మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఒక్క రోజు పూర్తిగా ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం.

సదరు నియోజకవర్గంలో పర్యటించే నాయకులు.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ చేసిన కృషిని వివరించడం ద్వారా ఇప్ప‌టివరకు రాష్ట్రంలో వ‌న్‌వేగా న‌డుస్తున్న కేసీఆర్ అనుకూల ప్ర‌చారాల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇవ్వాల‌న్న నిశ్చితాభిప్రాయానికి కాంగ్రెస్ వ‌చ్చిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే త‌మ రాష్ట్రాల‌లో కూడా అభివృద్ధిని చేస్తున్నామ‌ని, కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఎలా అమలు చేస్తున్నదీ ఆ రాష్ట్రం నుంచి వచ్చే నేతలు వివరిస్తారని సమాచారం.

10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆరెస్ ప్ర‌భుత్వంపైన‌, నియోజ‌క వ‌ర్గాల‌లో ఎమ్మెల్యేల‌పైన తీవ్ర అసంతృప్తి ఉన్న‌ట్లు కాంగ్రెస్ నిర్వ‌హించిన స‌ర్వేల్లో వెల్ల‌డైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామస్థాయిలో డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల స‌మ‌స్య‌తో పాటు స్థానిక బీఆరెస్ నేత‌ల ఆగ‌డాలు కూడా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని అంటున్నారు. వీటిని ప్ర‌ధాన అస్త్రాలుగా తీసుకొని ప్ర‌చారం చేయాల‌న్న ఆలోచ‌న‌లో జాతీయ నేత‌లున్నారని పార్టీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిపైనా వివరణ

సీఎం కేసీఆర్ దేశంలో ఎక్క‌డా, ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేస్తున్నామని చెబుతున్న సంగతి తెలిసిందే. దీనిని కూడా గట్టిగా కౌంటర్‌ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల‌లో ఏవిధంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారో వివ‌రిస్తారని సమాచారం.

అలాగే కాంగ్రెస్‌ అధిష్ఠానం తరఫున తొలుత ప్రియాంక గాంధీ, అనంతరం రాహుల్‌గాంధీ, ఇటీవల మల్లికార్జున ఖర్గే సమక్షంలో వెల్లడించిన కాంగ్రెస్‌ డిక్లరేషన్లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో పంట‌ల బోన‌స్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న‌ది. క‌ర్ణాట‌క‌లో గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు, రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్‌, నిరుద్యోగ భృతి ఇలా వివిధ ప‌థ‌కాల గురించి వివ‌రిస్తారని చెబుతున్నారు.

ఇదీ తెలంగాణ వెనుక కాంగ్రెస్‌ కృషి..

తెలంగాణ తన వల్లే వచ్చిందని సీఎం కేసీఆర్‌ తరచూ చెబుతుంటారు. ప్రజలు కూడా అదే నిజమనుకునే పరిస్థితిలోకి వెళ్లిపోయారని, అంతగా ఆ విషయాన్ని బీఆరెస్‌ ప్రచారం చేసుకున్నదని ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు యుపీఏ ప‌దేళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన కృషిని ప్రజల్లో లోతుగా వివరించాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా 2014లో తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసిందీ తెలియ‌జేస్తారు.

ఆనాడు కాంగ్రెస్‌లో ఉన్న ఆంధ్రా నాయ‌కులు పూర్తిగా వ్య‌తిరేకించినా, పార్ల‌మెంట్‌లో పెప్ప‌ర్ స్ప్రేలు కొట్టినా ప‌ట్టుద‌ల‌తో నాడు బిల్లును తీసుకురావ‌డం కోసం చేసిన క‌స‌ర‌త్తునంతా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. సోనియా గాంధీ ఇచ్చిన మాట కోసం ఒక రాష్ట్రంలో పార్టీ పూర్తిగా దెబ్బ‌తిన్నా కూడా ఏ విధంగా బిల్లును తీసుకు వ‌చ్చిందో తెలియ‌జేస్తారు. ఇందు కోసం ఆనాటి సంఘ‌ట‌న‌ల‌ను వివ‌రించాల‌ని నిర్ణ‌యించారని సమాచారం.

అవినీతిపైనా సమరభేరి

సంక్షేమ ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందాల‌ని ప్ర‌త్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే, ఇక్క‌డి ప్ర‌జ‌ల సంప‌ద‌ను బీఆరెస్‌ ఏ విధంగా కొల్లగొట్టిందనే విష‌యాన్ని ఈ స‌భ‌ల‌లో వివ‌రిస్తారని సమాచారం. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో అవినీతి మొద‌లు ద‌ళిత బంధు ప‌థ‌కంలో 30 శాతం క‌మిష‌న్ వ‌ర‌కు అన్ని వివ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. ఈ మేర‌కు కాంగ్రెస్ నాయ‌క‌త్వం పేప‌ర్ వ‌ర్క్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ మేర‌కు బీఆరెస్ అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తులు రాష్ట్రం ఏర్పాటు నాటికి ఎంత‌? ఇప్పుడెంత‌? అని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. దేశంలో ఏ ముఖ్య‌మంత్రి సంపాదించ‌నంత సంపాదించాడు కాబ‌ట్టే త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తే దేశంలో జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్దతు ఇచ్చే పార్టీల‌కు ఎన్నిక‌ల ఖ‌ర్చు పెడ‌తాన‌ని చెప్పినట్టు వార్తలు వచ్చిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌చారంలోకి తీసుకు రావాల‌న్న ఆలోచ‌న‌లో జాతీయ కాంగ్రెస్ నేత‌లు ఉన్న‌ట్లు తెలుస్తున్నది.