Uttam Kumar Reddy: రఫెల్ విమానాల కూల్చివేతపై కాంగ్రెస్ వాదనే నిజమైంది : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎయిర్ చీఫ్, సీడీఎస్ వ్యాఖ్యలే నిదర్శనం
ఆయనను కూడా దేశ వ్యతిరేకి అంటారా ?
ఆపరేషన్ సిందూర్ లో కూల్చబడిన యుద్ద విమానాల లెక్క చెప్పాలి
మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
విధాత, హైదరాబాద్ : ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ భారత్ కు చెందిన రఫెల్ యుద్ద విమానాలను కూల్చివేసిందన్న కాంగ్రెస్ వాదన నిజమని తేలిందని..ఇందుకు ఎయిర్ చీఫ్, సీడీఎస్ వ్యాఖ్యలే నిదర్శనమని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ లో కూలిన భారత విమానాలు, పాక్ విమానాల లెక్కలు చెప్పాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు ప్రశ్నిస్తే వారు దేశానికి, సైన్యానికి వ్యతిరేకులంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు విమర్శించడంపై ఉత్తమ్ మండిపడ్డారు. రఫెల్ సహా భారత యుద్ద విమానాలను పాక్ కూల్చి వేసిందని ఆపరేషన్ సిందూర్,ఎయిర్ చీఫ్, సీడీఎస్ బ్లూమ్ బర్గ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యు లో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత విమానాలు కూలాయి అని అని చెప్పినందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను కూడా దేశ వ్యతిరేకి అంటారా..? అని ఉత్తమ్ నిలదీశారు. ఇకనైనా ఆపరేషన్ సిందూర్ లో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్ కి చెందిన ఎన్ని ఫైటర్ జెట్స్ కూల్చారనేది కుడా స్పష్టం చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ సిందూర్ పై కాంగ్రెస్ రాజకీయం చేయడం లేదని, మా కంటే ఎక్కువ దేశ భక్తి ఎవరికి లేదన్నారు. కాంగ్రెస్ గాంధీ కుటుంబం నుంచి ఇద్దరు ప్రధానులు దేశంకోసం ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. యుద్ధ విషయాలు ప్రపంచం ముందు బహిరంగం గానే చెప్పాలి..లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదని ఉత్తమ్ స్పష్టం చేశారు.
యుద్ద విమానాల సంఖ్యను పెంచాలి
ఫైటర్ విమానాలు,ఆయుధాలు సరైన సమయానికి అందడం లేదని ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ మాట్లాడారని, వాయుసేనకు ఫైటర్ జెట్స్,ఆయుధాలు సరైన సమయానికి అందేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కోరారు. కేంద్రం ఎయిర్ ఫోర్స్ బలగాల టెక్నాలజీని ఆధునీకరించడంపై దృష్టిపెట్టాలని సూచించారు. నేను భారత్ చైనా సరిహద్దుల్లో మిగ్ 21,23 ఫైటర్ పైలట్ గా పనిచేశానని, దేశానికి 42 ఫైటర్ స్క్వాడ్రన్ ఉండాలి..కానీ 31 మాత్రమే ఉన్నాయని తెలిపారు. భారత దేశంలో సరిపడ యుద్ధ విమానాలు లేవని..సైన్యానికి అందడంలో ఆలస్యం అవుతుంది..ఇది దేశానికి మంచిది కాదు అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చెప్పారని ఉత్తమ్ గుర్తు చేశారు. సరైన టాలెంట్ ఉన్నవారు ఎయిర్ ఫోర్స్ కి రావడం లేదని ఎయిర్ చీఫ్ చెప్పారని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతికూల పరిస్థితుల్లో ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసినందుకు భారత రక్షణ దళాలకు మరోసారి అభినందనలు చెబుతున్నామన్నారు.