INDIA Alliance | ‘ఇండియా’కు కలిసొచ్చే పరిణామాలే!

కేంద్రంలో తాను అధికారంలోకి రావడానికి ప్రాంతీయ పార్టీలను ముందుపెట్టి కాంగ్రెస్‌ను ఖతం చేయడం.. అధికారంలోకి వచ్చాక చీల్చడం మోదీ-షాలు పదేళ్లుగా అనుసరిస్తున్న విధానం

  • By: Somu    latest    Jan 29, 2024 11:50 AM IST
INDIA Alliance | ‘ఇండియా’కు కలిసొచ్చే పరిణామాలే!
  • ఎన్నికల్లో ఎవరెవరిపై పోరాడాలో స్పష్టత
  • నితీశ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ‘ఇండియా’



(విధాత ప్రత్యేకం)


కేంద్రంలో తాను అధికారంలోకి రావడానికి ప్రాంతీయ పార్టీలను ముందుపెట్టి కాంగ్రెస్‌ను ఖతం చేయడం.. తీరా అధికారంలోకి వచ్చాక ఆయా ప్రాంతీయ పార్టీల్లోనే చిచ్చుపెట్టి చీల్చడం మోదీ-షాలు పదేళ్లుగా అనుసరిస్తున్న విధానం. అందుకే ఈసారి ఎలాగైనా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి విపక్ష పార్టీలు ఐక్యం అయ్యాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. యూపీలో సమాజ్‌వాది పార్టీ, ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్‌ మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నాయి. బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసి పనిచేయనున్నాయి. జార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్నది.


తమిళనాడులో డీఎంకే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌తోనే కలిసి నడుస్తామని ప్రకటించింది. వామపక్షాలు మొదటి నుంచీ బీజేపీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. లౌకిక స్ఫూర్తిని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్‌తోనే కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే 2029లో తాము బలపడవచ్చనే అభిప్రాయంతో మమతాబెనర్జీ, కేజ్రీవాల్‌, నితీశ్‌కుమార్‌ వంటి నేతలు ఆలోచనలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అపుడు బీజేపీకి తామే ప్రత్యామ్నాయంగా మారుతామనే భావన కనిపిస్తున్నది.


ఇటువంటి ఆలోచనలకు అనుగుణంగానే నితీశ్‌ ఆయారాం- గయారాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ఇండియా కూటమిలో నెలకొన్న విభేదాలు ఒకంతుకు మంచివే. ఈ కూటమిలోని పార్టీలో కేంద్ర ప్రభుత్వానికే కాదు ఇంకా ఎవరితో పోరాడాలన్న స్పష్టత వచ్చింది. ప్రస్తుత రాజకీయా పరిణామాలకు అనుగుణంగా ఇండియా కూటమి తగిన ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్లాలని ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నానికి బీజేపీ ఆడే ఆటలో పావులుగా మారుతున్న అవకాశవాద పార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని సూచిస్తున్నారు.


బీజేపీ అవకాశవాదం వల్లనే


బీజేపీ మరోమారు అవకాశవాద రాజకీయాలకు పాల్పడిన క్రమంలోనే బీహార్‌లో ప్రభుత్వం మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్‌లో, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా.. కాంగ్రెస్‌ లేదా బీజేపీ యేతర ప్రభుత్వాలు ఏర్పడకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో అక్కడి ప్రాంతీయపార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనికి కారణం బీహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో (40+48+26) ఉన్న 114 లోక్‌సభ స్థానాలే. యూపీలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇలాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ముఖ్యమే.


అందుకే సిద్ధాంతాలు పక్కనపెట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాల వల్ల ప్రగతి కుంటుపడుతున్నదని దుమ్మెత్తిపోసి, ఫలితాల అనంతరం అవే పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది. బీజేపీ రాజకీయ అవకాశవాదం బీహార్‌లో నితీశ్‌కుమార్‌కు, మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిండే, అజిత్‌పవార్‌లకు, కర్ణాటకలో కుమారస్వామి వంటి వారికి కూటములు మార్చడానికి దోహదం చేస్తున్నది. బీజేపీకి ఈ రాష్ట్రాల్లో బలం లేదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినా, ఇలా కూలిపోయే ప్రభుత్వాలను నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసినా అర్థం అవుతుంది.