టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రా వ్యక్తి.. వివాదాస్పదమైన ప్రభుత్వ నిర్ణయం
పోటీ పరీక్షల నిర్వాహణ గతంలో మాదిరిగా లీకేజీలు, అవినీతి మయంగా ఉండకుండా పక్కాగా నిర్వహించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా

విధాత : పోటీ పరీక్షల నిర్వాహణ గతంలో మాదిరిగా లీకేజీలు, అవినీతిమయంగా ఉండకుండా పక్కాగా నిర్వహించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన.. కొత్త చైర్మన్, సభ్యుల నియామక ప్రక్రియ సైతం వివాదాస్పదమవుతున్నది. కొత్త సభ్యుల నియామక ప్రక్రియలో ఆంధ్రా అధికారికి చోటు దక్కడం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యోగ నియామక బోర్డులో స్వరాష్ట్రంలో మళ్లీ ఆంధ్రా అధికారుల పెత్తనం ఏమిటన్న రచ్చ రేగుతుంది.
ఇటీవల ఏర్పాటైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు సభ్యుల్లో ఆంధ్రకు చెందిన యరబాడి రామ్మోహన్ రావు అనే వ్యక్తికి కాంగ్రెస్ ప్రభుత్వం చోటు కల్పించింది. రామ్మోహన్ రావు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యక్తి కాగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఉద్యోగుల విభజన సంధర్భంగా తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్న 214 మందిలో రామ్మోహన్ రావు ఒకరు. అయితే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించి పోస్టింగ్ ఇవ్వలేదు. రామ్మోహన్ రావు ఇటీవలే పోస్టింగ్ తీసుకొని టీఎస్‌జెన్‌కోలో ఈడీగా కొనసాగుతున్నారు. ఏప్రిల్లో పదవీ విరమణ కావాల్సిన రామ్మోహన్ రావును టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తం ఉందన్న చర్చ జోరుగా నడుస్తున్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత గుడ్డిగా టీఎస్పీఎస్సీలో ఆంధ్రాకు చెందిన రాంమోహన్‌రావును ఎలా నియమించిందన్న ప్రశ్న వినిపిస్తున్నది. ఈ పరిణామంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఏమంటారన్నది చర్చనీయాశంమైంది.