Coromandel | సరిగ్గా 14 ఏండ్ల క్రితం.. ఇదే శుక్రవారం రాత్రి.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం
Coromandel| ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్(Coromandel) ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది కోరమండల్ ఎక్స్‌ప్రెస్. గూడ్స్ రైలును ఢీకొట్టడమే కాకుండా పక్కనే పట్టాలపై బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అదే సమయంలో ఆ పట్టాలపైకి దూసుకొచ్చిన షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోరమండల్ బోగీలను ఢీకొట్టింది. దీంతో అక్కడ మరణ మృదంగం మోగింది. 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 900 మందికి పైగా […]

Coromandel|
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్(Coromandel) ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది కోరమండల్ ఎక్స్‌ప్రెస్. గూడ్స్ రైలును ఢీకొట్టడమే కాకుండా పక్కనే పట్టాలపై బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అదే సమయంలో ఆ పట్టాలపైకి దూసుకొచ్చిన షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోరమండల్ బోగీలను ఢీకొట్టింది.
దీంతో అక్కడ మరణ మృదంగం మోగింది. 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 900 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా స్వాతంత్ర్యం అనంతరం ఇప్పటి వరకు జరిగిన రైలు ప్రమాదాలతో పోల్చితే ఒడిశా రైలు ప్రమాదం.. దేశ చరిత్రలోనే అత్యంత ఘోర రైలు ప్రమాదంగా మిగిలిపోయింది.
అయితే ఇదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 14 ఏండ్ల క్రితం ఇదే శుక్రవారం రోజున ఘోర ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ఆ ఘటన ఆసక్తికరంగా మారింది. 2009 ఫిబ్రవరి 13వ తేదీన జైపూర్ రోడ్ రైల్వే స్టేషన్ దాటుతుండగా.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది.
ఆ రోజు కూడా శుక్రవారమే. రాత్రి 7:30 నుంచి 7:40 గంటల మధ్య ట్రాక్ మార్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంజిన్ మరో ట్రాక్‌పై పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు పూర్తిగా దెబ్బతినగా, కొన్ని బోగీలు సురక్షితంగానే ఉన్నాయి. గూడ్స్ రైలును ఢీకొట్టడంతో కోరమండల్ భారీ కుదుపులకు గురైంది. దీంతో ఏం జరిగిందో ప్రయాణికులకు అర్థం కాలేదు. కొద్ది క్షణాల్లోనే కొన్ని బోగీలు పక్కకు ఒరగడంతో.. మిగతా ప్రయాణికులు అప్రమత్తమయ్యారు.
ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బోగీల్లో ఇరుక్కున్న ప్రయాణికులను కాపాడేందుకు యత్నించారు. పట్టాలపై ప్రయాణికుల మాంసపు ముద్దలు చూసి తోటి ప్రయాణికులు చలించిపోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా తల్లడిల్లిపోయింది.