44 రోజుల్లో 1.20 లక్షల ఉద్యోగాలు మటాష్
-భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్న కార్పొరేట్లు -ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 340 కంపెనీల్లో లే-ఆఫ్‌లు -జనవరిలో పోయిన లక్షకుపైగా కొలువులు -ఈ నెలలోనే రోడ్డునపడ్డ 17,400 మంది టెక్ ఎంప్లాయీస్ విధాత: వందలు కాదు.. వేలు కాదు.. లక్షల్లో పోతున్నాయి ఉద్యోగాలు. చుట్టుముడుతున్న ఆర్థిక మాంద్యం భయాల నడుమ కార్పొరేట్లు వ్యయ నియంత్రణ చర్యల వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున ఆయా కంపెనీలు లే-ఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. పెద్ద, చిన్న సంస్థలంటూ తేడా లేకుండా ఉద్యోగుల్ని […]

-భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్న కార్పొరేట్లు
-ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 340 కంపెనీల్లో లే-ఆఫ్‌లు
-జనవరిలో పోయిన లక్షకుపైగా కొలువులు
-ఈ నెలలోనే రోడ్డునపడ్డ 17,400 మంది టెక్ ఎంప్లాయీస్
విధాత: వందలు కాదు.. వేలు కాదు.. లక్షల్లో పోతున్నాయి ఉద్యోగాలు. చుట్టుముడుతున్న ఆర్థిక మాంద్యం భయాల నడుమ కార్పొరేట్లు వ్యయ నియంత్రణ చర్యల వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున ఆయా కంపెనీలు లే-ఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. పెద్ద, చిన్న సంస్థలంటూ తేడా లేకుండా ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి.
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 340 సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి. జనవరిలోనే లక్షకుపైగా కొలువులు పోవడం గమనార్హం. ఇక ఈ నెలలో కేవలం టెక్ ఇండస్ట్రీలోనే 17,400 మందికిపైగా ఉద్యోగులు ఇంటికెళ్లిపోయారు. భారత్‌లోనూ ఈ ప్రభావం ఉండగా, చాలామందికి పింక్ స్లిప్‌లు వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
యాహూ, బైజూస్, గోడాడీ, గిట్‌హబ్, ఈబే, ఆటోడెస్క్, ఓఎల్ఎక్స్ గ్రూప్ తదితర సంస్థలు ఈ నెల ఉద్యోగుల్ని తీసేస్తున్న వాటిలో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థలు గత నెల భారీగా లే-ఆఫ్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతర రంగాలతో పోల్చితే టెక్నాలజీ కంపెనీల్లోనే అత్యధికంగా ఉద్యోగాలు పోతున్నాయి.
ఒక్క జనవరిలోనే సగటున రోజుకు 3,300 మందికిపైగా టెక్కీలు ఉద్యోగాల్ని కోల్పోయారు. వీరందరిని 288కిపైగా సంస్థలు తీసేశాయి. ఇక నిరుడు నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించిన మెటా (ఫేస్‌బుక్).. ఈ ఏడాది మరిన్ని ఉద్యోగ కోతలకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో 2,000 మందిని తీసేస్తున్నట్టు విమానయాన దిగ్గజ సంస్థ బోయింగ్ స్పష్టం చేసింది.
ఇందులో మూడు వంతుల మంది టీసీఎస్ బెంగళూరుకు ఔట్‌సోర్సింగ్‌గా ఇచ్చిన ఉద్యోగులే కావడం గమనార్హం. ఇక గత ఏడాది మొత్తంగా వెయ్యికిపైగా సంస్థలు 1,54,336 మంది ఉద్యోగుల్ని తొలగించినట్టు లే-ఆఫ్స్ ట్రాకింగ్ సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఈ చెప్తున్నది. ఈ ఏడాది కోతలతో కలుపుకుంటే 2.5 లక్షల ఉద్యోగాలు పోయినట్టవుతున్నది.