CPI | తెలంగాణ విభజన హామీల సాధనకు సీపీఐ ప్రజాపోరు యాత్ర

మార్చి 25న బయ్యారంలో ప్రారంభం హనుమకొండలో ఏప్రిల్ 5న ముగింపు 200 మందితో 770 కిలోమీటర్ల పాదయాత్ర సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతల హాజరు బీజేపీ హామీల అమలుకు తొమ్మిదేళ్ళుగా ప్రజల నిరీక్షణ సభలు,సమావేశాలతో ప్రజా చైతన్యం పాదయాత్ర కన్వీనర్ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం సీపీఐ (CPI) ప్రజాపోరు యాత్ర చేపట్టింది. ఈ నెల 25 నుండి మానుకోట (Manukota) […]

CPI | తెలంగాణ విభజన హామీల సాధనకు సీపీఐ ప్రజాపోరు యాత్ర
  • మార్చి 25న బయ్యారంలో ప్రారంభం
  • హనుమకొండలో ఏప్రిల్ 5న ముగింపు
  • 200 మందితో 770 కిలోమీటర్ల పాదయాత్ర
  • సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతల హాజరు
  • బీజేపీ హామీల అమలుకు తొమ్మిదేళ్ళుగా ప్రజల నిరీక్షణ
  • సభలు,సమావేశాలతో ప్రజా చైతన్యం
  • పాదయాత్ర కన్వీనర్ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం సీపీఐ (CPI) ప్రజాపోరు యాత్ర చేపట్టింది. ఈ నెల 25 నుండి మానుకోట (Manukota) జిల్లా బయ్యారం నుంచి సీపీఐ పాదయాత్ర ప్రారంభం కానున్నది. ఏప్రిల్ 5న హనుమకొండ (Hanumakonda) లో భారీ బహిరంగ సభతో ముగియనున్నది. యాత్రను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రారంభించనున్నారు.

ఏప్రిల్ 5న పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని కుడా మైదానములో వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా (D.Raja) ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభ, ముగింపు బహిరంగ సభలతో పాటు యాత్ర అడుగడుగునా సభలు, సమావేశాలను నిర్వహిస్తారు.

విభజన హామీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం

2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు హామీలను ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతాలలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చట్టంలో పలు అంశాలను చేర్చారు. దానికి అనుగుణంగానే మహబూబాబాద్ జిల్లాలో అపారమైన ఇనుప ఖనిజాలు ఉన్న బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఏజెన్సీ ప్రాంతమైన, అత్యధికముగా గిరిజనులు ఉండే ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. దక్షిణ, ఉత్తర భారతదేశానికి వారధిగా, రైల్వే కూడలిగా ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సహా రైల్వే సంబంధిత భారీ పరిశ్రమలు నెలకొల్పాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుండి నేటివరకు విభజన హామీల అమలుకు శ్రద్ధ చూపలేదు. రావలసిన నిధులను కేటాయించకుండా నిర్లక్ష్యం చేసింది.

సింగరేణి ప్రైవేటీకరణ పై నిరసన

విభజన హామీలతో పాటు బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేసి సింగరేణి ఆద్వర్యంలోనే మైనింగ్ నిర్వహించాలని, హైదరాబాద్ నుండి జనగామ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలని, పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని పాదయాత్ర ద్వారా డిమాండ్ చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పేదలు సిపిఐ నాయకత్వంలో భూ పోరాటాలు నిర్వహించి ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్నారు. వారందరికీ పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యాత్ర సందర్భంగా డిమాండ్ చేస్తారు.

200 మందితో 770 కిలోమీటర్ల పాదయాత్ర

మార్చి 25న ప్రారంభం.. ఏప్రిల్ 5 న ముగిసే సీపీఐ ప్రజాపోరు యాత్రలో 200 మంది సీపీఐ కార్యకర్తలు పాల్గొంటారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలలో, 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పన్నెండు రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర సందర్భంగా పలు సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సభలకు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, సీపీఐ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు.

యాత్రకు సహకరించాలని వినతి: తక్కెళ్ళల పెల్లి శ్రీనివాసరావు

తెలంగాణా ప్రజలకు ఎలాంటి మేలు చేయకుండా హిందూత్వ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ప్రజాపోరు యాత్ర కన్వీనర్ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఆయన పాదయాత్ర కార్యక్రమం వివరాలను వివరించారు. ఎన్నికలలో లబ్ధి కోసం బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణాకు నిధులు కేటాయించకుండా, విభజన హామీలను నెరవేర్చకుండా తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ళుగా సిపిఐ, ఇతర ప్రజాసంఘాలు హామీల అమలుకు పోరాటం చేస్తున్నా పట్టించుకోకుండా బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిందని అన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్రజలలో ఎండగట్టేందుకే సీపీఐ ప్రజాపోరు యాత్రను చేపట్టిందని అన్నారు. అన్ని వర్గాలు ప్రజలు సహకరించాలని తక్కెళ్లపెల్లి విన్నవించారు.