CPI | ఎంఐఎంకు లొంగి సమైక్యతా దినం అంటారా?: కూనంనేని
CPI | తెలంగాణ సాయుధ పోరాట దినంగా జరపండి జమిలి పేరుతో బీజేపీ డ్రామా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్ ఎంఐఎంకు లొంగి సెప్టెంబర్ 17ను సమైక్యతా దినంగా ప్రకటించారని, ఆయనకు ధైర్యం ఉంటే తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవంగా అధికారిక ఉత్సవాలు జరుపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం, అనంతరం జరిగిన సాయుధ […]

CPI |
- తెలంగాణ సాయుధ పోరాట దినంగా జరపండి
- జమిలి పేరుతో బీజేపీ డ్రామా
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్ ఎంఐఎంకు లొంగి సెప్టెంబర్ 17ను సమైక్యతా దినంగా ప్రకటించారని, ఆయనకు ధైర్యం ఉంటే తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవంగా అధికారిక ఉత్సవాలు జరుపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం, అనంతరం జరిగిన సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందని, హైదరాబాద్ సంస్థానంలో నిజాం పీడ తొలగకపోవడం వల్లనే సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిందని చెప్పారు. దాంతో నిజాంకు గత్యంతరం లేకనే కేంద్రంలోని పటేల్ ప్రభుత్వానికి లొంగిపోయారని, భూస్వాములు, దేశ్ ముఖ్ లు పట్టణాలకు వలస వెళ్ళారని తెలిపారు. మూడు వేల గ్రామాలను విముక్తి, పది లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారన్నారు. నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని అన్నారు. సాయుధ పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు.
బీజేపీ తప్పుడు ప్రచారం
బీజేపీ చెబుతున్నట్లుగా పటేల్ ప్రభుత్వం విమోచన చేస్తే, ప్రజలపై అకృత్యాలకు పాల్పడిన శత్రు రాజు నిజాం కు రాజ్ ప్రముఖ్ బిరుదు ఎందుకు ఇచ్చి, ఏటా కోటి రూపాయల భరణం ఎందుకు ఇచ్చారని, కాసీం రజ్వీని పాకిస్తాన్ కు పారిపోయేందుకు అవకాశం ఎందుకు ఇచ్చారని కూనంనేని ప్రశ్నించారు. సాయుధ పోరాటాన్ని బీజేపీ నాయకులు హిందూ, ముస్లింల గొడవగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. జమిలి ఎన్నికల పేరుతో బీజేపీ పెద్ద డ్రామా ఆడుతున్నదని విమర్శించారు.
మునుగోడు ఉప ఎన్నిక, కర్ణాటక ఎన్నికలతోనే బీజేపీ ప్రభంజనం ఆగిందని, రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలోనూ బీజేపీ గెలవదని అన్నారు. అందుకే జమిలి పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, జమిలి ఎన్నికలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధమని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయనే విమర్శలు తప్పించుకునేందుకే కవితకు మళ్లీ నోటీసులు పంపారని అన్నారు.
సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీ వెంకట్రాములు, నేదునూరి జ్యోతి, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, తోట మల్లికార్జున రావు, రాష్ట్ర నాయకులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు మోతె లింగారెడ్డి, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, దుప్పటి సాంబయ్య పాల్గొన్నారు.