జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ.. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు
జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకుంటే పోలీసులు గాలింపు చేపట్టి.. వాడిని పట్టుకుంటారు

విధాత: జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకుంటే పోలీసులు గాలింపు చేపట్టి.. వాడిని పట్టుకుంటారు. తప్పించుకున్నది కరుడుగట్టిన నేరస్థుడైతే స్పెషల్ ఆపరేషన్ లాంటివి చేసి అదుపులోకి తీసుకుంటారు. కానీ ఈక్వెడార్ (Ecuador) దేశం మాత్రం ఏకంగా స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించింది. జైలు నుంచి అడాల్ఫో మాషియస్ అనే గ్యాంగ్‌స్టర్ తప్పించుకుపోవడంతో (Criminal disappears) దేశవ్యప్తంగా 60 రోజుల పాటు అత్యయిక స్థితి ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది.
ఇక్కడి గువాకిల్ జైలు నుంచి అడాల్ఫో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అతడు అతి క్రూరమైన లాస్ కొనెరోస్ అనే క్రిమినల్ గ్రూప్‌కి నాయకత్వం వహిస్తున్నాడు. 2011లో అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 34 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించారు. ఆ శిక్షలో ఉండగానే తప్పించుకుని పారిపోయాడు. ప్రభుత్వం పోలీసులకు, ఆర్మీకి పూర్తి అధికారాలు ఇచ్చింది. వెంటనే జైళ్లను వారు అదుపులోకి తీసుకుంటారు.
ఎమర్జెన్సీ ప్రకటించాం కాబట్టి భద్రతా సిబ్బందికి రాజకీయంగా, చట్టపరంగా ఎటువంటి అడ్డంకులూ రావు. ప్రజలు ఇందుకు సహకరించాలి. ఇది మనందరి యుద్దం అని దేశ అధ్యక్షుడు డానియెల్ నొబోవా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు శాంతి స్థాపనకు ఏ మాత్రం సహకరించవని ఆయన అభిప్రాయపడ్డారు. నేరస్థులతో తాము చర్చలు జరపబోమని.. వారిని మట్టుబెట్టి తీరతామని స్పష్టం చేశారు. ఈక్వెడార్‌లో పాతుకుపోయిన గ్యాంగ్‌స్టర్‌లను ఏరివేసి శాంతిని నెలకొల్పుతామనే హామీతో నొబోవా గత నవంబరులోనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
మరోవైపు ఎమర్జెన్సీ ప్రకటించడంతో దేశంలోని వివిధ ప్రాంతాలను సైన్యం తన అధీనంలోకి తీసుకుంటుంది. అయితే గత ప్రభుత్వాలు కూడా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించి నేరస్థులను మట్టుబెట్టి చెబుతూ ఉండేవి. కానీ అవేవీ సత్ఫలితాలను ఇవ్వలేదని నిపుణులు చెబుతున్నారు. కాగా ఇప్పుడు తప్పించుకుపోయిన జోస్ అడాల్ఫో మషియస్ అలియాస్ ఫిటో.. లాస్ కొనేరస్ గ్యాంగ్‌కు నాయకుడు. మాదక ద్రవ్యాల రవాణా, హత్యలు తదితర నేరాలకు పాల్పడేవాడు. ప్రస్తుతం అతడి కోసం 3 వేల మంది ప్రత్యేక భద్రతా సిబ్బంది, సైన్యం, పోలీసులు అణువణువూ జల్లెడ పడుతున్నాయి.