యూపీఐలో కొత్త వ్యక్తికి డబ్బు పంపాలంటే నాలుగు గంటలు ఆగాల్సిందే..!’ కొత్త నిబంధన
సైబర్ ఆర్థిక మోసాల (Cyber Financial Crimes) ను నియంత్రించేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్న కేంద్రప్రభుత్వం.. యూపీఐ చెల్లింపుల (UPI Payments) కు సంబంధించి కీలక ప్రతిపాదన సిద్ధం చేసింది

విధాత: సైబర్ ఆర్థిక మోసాల (Cyber Financial Crimes) ను నియంత్రించేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్న కేంద్రప్రభుత్వం.. యూపీఐ చెల్లింపుల (UPI Payments) కు సంబంధించి కీలక ప్రతిపాదన సిద్ధం చేసింది. ఓ ఇద్దరి మధ్య మొదటి సారి జరిగే చెల్లింపులకు నిర్దిష్ట సమయం వేచి ఉండేలా నిబంధనను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ సమయం సుమారుగా నాలుగు గంటలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రూ.2000లకు పైబడి ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి డబ్బు చెల్లింపు జరుగుతుంటే.. డబ్బు పడాల్సిన వ్యక్తి 4 గంటల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. దీని వల్ల వేగానికి మారుపేరైన యూపీఐ వ్యవస్థలో చెల్లింపులు ఆలస్యమవుతాయనే వాదన ఉన్నప్పటికీ.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఇది అవసరమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అయితే యూపీఐ లోనే కాకుండా ఇమిడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్)లలోనూ దీనిని అమలు చేయనున్నారు. ఖాతా సృష్టించిన తర్వాత తొలి పేమెంట్‌ను ఆలస్యం చేయడం ఈ ప్రతిపాదన ఉద్దేశం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే వివిధ అనుమతుల స్వీకరణకు సంబంధించి అది ఇప్పటికే జరుగుతోందని.. ఇద్దరి మధ్య తొలి పేమెంట్ విషయంలోనే నాలుగు గంటల వెయిటింగ్ పిరియడ్‌ను తీసుకురానున్నామని స్పష్టం చేశాయి. వారు కొత్త యూజర్లా లేదా అప్పటికే ఉన్నవారా అనేది సంబంధం లేదని పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనకు సంబంధించి ప్రభుత్వం, ఆర్బీఐలతో పాటు గూగుల్, రేజర్‌పే వంటి వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించామని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
‘ఒక కొత్త వ్యక్తికి మీరు పేమెంట్ చేయగానే.. ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకోవడానికి, లేదా ఆ మొత్తంలో మార్పు చేయడానికి మీకు నాలుగు గంటల సమయం ఉంటుంది. తొలుత మేము ఏ మొత్తానికైనా ఇదే నిబంధనను పెట్టాలని అనుకున్నాం. కానీ కిరణా దుకాణాల వంటి వాటి దగ్గర ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో.. రూ. రెండు వేలను బెంచ్‌మార్క్‌గా పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించాం’ అని పేర్కొన్నారు.
పెరుగుతున్న సైబర్ మోసాలు…
యూపీఐ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలూ పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 13,530 సైబర్ నేరాలు జరిగినట్లు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఇందులో బాధితులు కోల్పోయిన మొత్తం అక్షరాలా రూ.30,252 కోట్లు. ఇందులో 49 శాతం కేసులు డిజిటల్ పేమెంట్ల ద్వారా డబ్బులు కోల్పోయినవే కావడం గమనార్హం.