నమాజ్ చేసుకుంటున్న ముస్లింలపై పోలీసు ప్రతాపం
ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై విద్వేషపూరితంగా వ్యవహరిస్తుంటే.. పలువురు అధికారులు సైతం అదే బాటలో నడుస్తున్నరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి

- వీడియో వైరల్.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై విద్వేషపూరితంగా వ్యవహరిస్తుంటే.. పలువురు అధికారులు సైతం అదే బాటలో నడుస్తున్నరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని మతాలు సమానమని బోధించే ఈ భారతదేశంలో.. రోడ్డుపై నమాజ్ చేసుకుంటున్న ముస్లింను ఒక పోలీసు అధికారి కాలితో తన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసుల చర్యలను పలువురు తీవ్రంగా విమర్శించడంతో సదరు పోలీసును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది.
శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఢిల్లీలోని ఇంద్రలోక్ ప్రాంతంలోని ఒక మసీదు వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకున్నారు. మసీదు ప్రాంగణం నిండిపోవడంతో కొందరు రోడ్డుపైనే నమాజ్ చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అక్కడి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఒక పోలీసు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. రోడ్డుపై నమాజ్ చేసుకుంటున్నవారిని కాలితో తన్నాడు. దీంతో వారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
दिल्ली के इंद्रलोक में सड़क पर नमाज पढ़ रहे लोगों को पुलिस ने लात मारी.
लोगो ने थाना घेरा! pic.twitter.com/6qoDds3DoR
— Shivam Pratap Singh (@journalistspsc) March 8, 2024
ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మానవత్వ కనీస సూత్రాలు అర్థం చేసుకోలేని ఢిల్లీ పోలీసు సైనికుడొకరు నమాజ్‌చేసుకుంటున్నవారిని కాలితో తన్నాడు. ఈ సైనికుడి మనస్సులో ఇంత విద్వేషం ఎందుకు నిండింది? సదరు అధికారిపై ఢిల్లీ పోలీసులు తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతడిని సర్వీసు నుంచి వెంటనే తొలగించాలి’ అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై డీసీపీ (నార్త్) ఎంకే మీనా స్పందిస్తూ.. ఈ ఉదంతంలో దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. సదరు అధికారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు కోరారు.
వాస్తవానికి ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకోవడాన్ని దేశ చట్టాలు అనుమతిస్తున్నాయి. కానీ.. ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ముస్లింలు రోడ్లపై నమాజ్ చేసుకుంటున్నందుకు పోలీసులు అరెస్టు చేసిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి. ఇలాగే ఈ ఏడాది జనవరిలో ఒక 35 ఏళ్ల ట్రక్ డ్రైవర్ గుజరాత్‌లోని బనక్‌స్కాంత జిల్లాలో రోడ్డు మీద ప్రార్థన చేసుకుంటుంటే.. అనుమతి లేకుండా నమాజ్ చేశారంటూ అరెస్టు చేశారు.