రైతు బంధు ఎలా ఇస్తున్నారు..అధికారులను ప్రశ్నించిన ధరణి కమిటీ
ఏ రైతులు ఏ పంట వేస్తున్నారో లెక్కలు కూడా లేని వింత పరిస్థితి ప్రభుత్వానికిది. దీంతో రైతు బంధు ఎలా ఇస్తున్నారో చెప్పాలని కమిటీ అధికారులను ప్రశ్నించింది.

పంట ఏన్యుమరేషన్ ఏదీ
కౌలు రైతులను గుర్తించేది ఎలా
జాయింట్ సర్వే చేస్తే అటవీ- రెవెన్యూ పంచాయతీ తెగుతుందా
విధాత: ఏ రైతులు ఏ పంట వేస్తున్నారో లెక్కలు కూడా లేని వింత పరిస్థితి ప్రభుత్వానికిది. దీంతో రైతు బంధు ఎలా ఇస్తున్నారో చెప్పాలని ధరణి కమిటీ వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించింది. శనివారం సచివాలయంలో ధరణి కమిటీ వ్యవసాయ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమైంది. ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రేమండ్ పీటర్, భూమి సునీల్, బి. మధుసూధన్, సీసీఎల్ ఏ రేమండ్ పీటర్‌లు సమావేశంలో పాల్గొన్నారు. కమిటీ అడిగిన ప్రశ్నకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టా భూముల డేటా ఆధారంగానే రైతు బంధు వేస్తున్నామని కమిటీకి వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఏ రైతులు ఏ పంట వేశారన్న సరైన వివరాలు లేవన్న విషయం తేట తెల్లమైంది. గత ప్రభుత్వం డాంభికంగా ఉత్తుత్తి లెక్కలు చెప్పిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలురైతులకు కూడా రైతు భరోసా కల్పించాలని నిర్ణయించిన నేపధ్యంలో కౌలు రైతుల గుర్తింపుపైనా సుధీర్ఘ చర్చ జరిగింది. కౌలు రైతులను గుర్తించాలంటే ప్రత్యేక చట్టం ఉండాలన్న చర్చ జరిగింది. వ్యవసాయ భూమిని కౌలు రైతులు భూ యజమానుల వద్ద కౌలుకు తీసుకొని సాగు చేయడానికి ప్రత్యేక మైన కౌలు చట్టం ఉండాలని అభిప్రాయ పడ్డారు. ఏపీలో ప్రస్తుతం కౌలు చట్టం అమలు అవుతున్నదని, దానిని అధ్యయనం చేసి అలాంటి చట్టాన్ని తీసుకు వచ్చి కౌలు రైతులను గుర్తిస్తేనే వారికి రైతు భరోసా ఇవ్వడం సాధ్యమవుతుందన్న అభిప్రాయం కమిటీ ముందుకు వచ్చినట్లు సమాచారం.
అలాగే అటవీ, రెవెన్యూ సహహద్దు వివాదాలపై కూడా కమిటీ చర్చించింది. లక్షల ఎకరాల భూమిపై ఈ వివాదం కొనసాగుతున్నదని అధికారులు కమిటీకి వివరించారు. ఈ మేరకు లక్షల ఎకరాల భూమి ధరణిలో ఎన్ రోల్ కాలేదని అటవీ అధికారులు కమిటీకి వివరించారు. వాస్తవంగా రిజర్డ్వ్ ఫారెస్ట్ భూమి ఎన్ రోల్ అయింది కానీ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయని భూములు ఎన్ రోల్ కాలేదని రెవెన్యూ అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వివాదంపై జాయింట్ సర్వే చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు 2.30 లక్షల మంది గిరిజన ఆదివాసీలకు 6.50 లక్షల ఎకరాల పోడు భూములకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యలపై ఏవిధంగా ముందుకు వెళితే సమస్య పరిష్కారం అవుతుందన్న దానిపై చర్చించినట్లు తెలిసింది.
దేవాదాయ, వక్ఫ్, లాండ్ సర్వే సెటిల్ మెంట్ శాఖలతో వచ్చే వారం భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది. ఈ శాఖలతో సమావేశం తరువాత రెండు జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నట్లు సమాచారం.