Diamond Found By Laborer| వజ్రం దొరికింది..కూలీ దశ మారింది

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పొలాల్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు జనం పొలాల్లో వజ్రాల కోసం అన్వేషిస్తుండటం తెలిసిందే. అదృష్టం కలిసి వచ్చి ఒక్క వజ్రం దొరికిన చాలు..మా కష్టాలన్ని తీరిపోతాయన్న ఆశతో ఏటా వానకాలంలో పొలాలలో వజ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు. అలా వజ్రాల వేట సాగించే వారిలో కొందరికే ఎదో ఒక సైజు వజ్రం దొరికి అదృష్టవంతులవుతుంటారు. తాజాగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో జొన్నగిరి, తుగ్గలి, ఎర్రగుడి, పగిడిరాయి లాంటి తదితర గ్రామాల్లోని ప్రజలు వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో తుగ్గలి మండలంలోని పెండేకల్లు గ్రామానికి చెందిన రోజువారీ కూలీ ఓ రైతు పొలంలో మట్టి పనులు చేస్తున్న సమయంలో భూమిలో తళుక్కుమని మెరిసిపోతున్న వజ్రం కనిపించింది. మొదట ఆ కూలీ సాధారణ రాయి అని అనుకున్నాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్లి తనకు భూమిలో దొరికిన రాయిని చూపించాడు. అది మామూలు రాయి కాదని అత్యంత విలువగల వజ్రమని వ్యాపారి చెప్పాడు.
తనకు ఆ వజ్రం రూ.10 లక్షలకి అమ్మాలని వ్యాపారి కోరాడు. కానీ కూలీ మాత్రం ఆ వజ్రాన్ని అమ్మడానికి ఒప్పుకోలేదు. బహిరంగ మార్కెట్లో ఆ వజ్రానికి రూ. 50 లక్షల పైగానే పలుకుతుందని కూలీ ఊహించాడు. వ్యాపారి ఎంతగా ఒత్తిడి తెచ్చినా కూలీ మాత్రం ఆ వజ్రం అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ధర కుదరకపోవడంతో ఆ వ్యాపారి నిరాశగా వెనుదిరిగాడు. ఇక రైతు కూలీకి వజ్రం దొరికిందన్న సంగతి తెలుసుకున్న జనం దానిని చూసేందుకు పెండెకల్ లోని అతని ఇంటికి క్యూ కట్టారు. అంతటితో ఆగకుండా ఆ వజ్రం దొరికన ప్రాంతంలో తమకు కూడా ఏమైనా చిన్నదో పెద్దదో వ్రజాలు దొరుకుతాయేమోనన్న ఆశతో అన్వేషణ సాగిస్తున్నారు.