Kavitha: లేఖ కాక చల్లారిందా..కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కవిత!

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బుధవారం తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ తో ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో భేటీ అయ్యారు. భర్త అనిల్ తో కలిసి ఆమె కేసీఆర్ ను కలిశారు. పార్టీలో పరిణామాలపై కేసీఆర్ ను ప్రశ్నిస్తూ ఇటీవల లేఖ రాసి రచ్చ చేసిన కవిత వ్యవహారం బీఆర్ఎస్ రాజకీయాల్లో దుమారం రేపింది. కేసీఆర్ చుట్టు దెయ్యాలు ఉన్నాయని..పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని..కేసీఆర్ నాయకత్వం తప్ప తాను మరెవరి నాయకత్వం అంగీకరించబోనంటూ పరోక్షంగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులకు వ్యతిరేకంగా ఆమె రాసిన లేఖ..చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి.
కేసీఆర్ కు లేఖ రాసిన అనంతరం కవిత తొలిసారిగా ఆయనను ప్రత్యక్షంగా కలవడం ఇదే తొలిసారి కావడంతో వారి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే బుధవారం కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే ముందు జరిగిన కేసీఆర్, కవిత భేటీలో ఆమె రాసిన లేఖ వివాదం చర్చకు రాకపోవచ్చని…కాళేశ్వరం విచారణ అంశంపైనే వారు చర్చించి ఉండవచ్చని సమాచారం.
మరోవైపు కేసీఆర్ ను కలిసిన అనంతరం ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు వెళ్లారు. కేసీఆర్ వెంట ఓపెన్ కోర్టుకు 9 మంది బీఆర్ఎస్ నేతలను కమిషన్ అనుమతించింది. అందులో కవిత, కేటీఆర్ పేర్లు లేకపోవడం గమనార్హం. మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ సంతోష్ రావు, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పద్మారావు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎక్స్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లను కమిషన్ అనుమతించింది.