Mutton keema | మెంతికూరతో మటన్‌ కీమా.. ఈ టేస్టీ కాంబినేషన్‌ ఎప్పుడైనా ట్రై చేశారా..?

Mutton keema | మెంతికూరతో మటన్‌ కీమా.. ఈ టేస్టీ కాంబినేషన్‌ ఎప్పుడైనా ట్రై చేశారా..?

Mutton keema: నాన్‌ వెజ్‌ ప్రియులకు అచ్చం మాంసం వంటలు తిని బోర్‌ కొడుతుంటుంది. అంతేగాక అచ్చం మాంసం వంటలు తినడం వల్ల రక్తంలో కొవ్వు పేరుకుంటుందన్న ఆందోళన కూడా ఈ మధ్య ఎక్కువైంది. దాంతో మాంసంతోపాటు ఆకూ కూరలో, కూర గాయాలో మిక్స్‌ చేసి వండుకోవడం ఎక్కువైంది. మెంతి కూర, మటన్‌ కీమా మిక్స్‌డ్‌ కర్రీ కూడా ఈ కోవకు చెందినదే. మటన్‌ కీమాను మెంతి కూరతో కలిపి వండటం వల్ల కూర రుచిగా ఉండటమేగాక, మన శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మరి ఈ స్పెషల్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు

  • శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమా 250 గ్రాములు
  • రెండు కట్టలు శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి కూర
  • సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్‌
  • మటన్‌ మసాలా, బిర్యానీ ఆకులు
  • కొద్దిగా పసుపు, తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి

తయారీ ఇలా..

కుక్కర్‌లో కొద్దిగా నూనె పోసి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్‌ కీమాను అందులో వేయాలి. దానికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, కారం బాగా కలిపి మూతపెట్టాలి. నాలుగైదు విజిల్స్ వచ్చే దాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

ఆ తర్వాత మూకుడు పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకులు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మూకుడులోనే కొద్దిగా నూనె వేడిచేసి హాఫ్‌ టీ స్పూన్‌ జీలకర్ర వేయాలి. అవి చిటపట లాడుతుండగా వెల్లుల్లి, అల్లం పేస్ట్‌, ధనియాల పొడి , ఉల్లిపాయలు, బిర్యానీ ఆకులు, గరం మసాలా వేసి వేయించాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్‌ కీమా వేసి నీళ్లు ఇగిరే దాకా సన్న సెగమీద ఉడకనివ్వాలి. చివరగా ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతికూర, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. మంచి సువాసనతో కుతకుత లాడుతూ కూర ఉడుకుతుంది.

దీనికి అవసరమైన వాళ్లు రెండు చిన్న టమాటాలను కూడా యాడ్‌ చేసుకోవచ్చు. కూర పూర్తిగా ఉడికేదాకా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. అంతే ఎంతో రుచికరమైన మటన్ కీమా మెంతికూర కర్రీ రెడీ. తర్వాత దీన్ని చక్కని సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకొని కొత్తిమీర, పుదీన, ఉల్లిపాయ, నిమ్మ స్లైస్‌లతో అందంగా గార్నిష్‌ చేయండి. ఈ కూరను రైస్‌తోగానీ, చపాతీలోగానీ చక్కగా ఆరగించవచ్చు. అన్నం, చపాతీ లాంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ కీమాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.