భువనగిరిలో అవిశ్వాసం అలజడి.. అదే దారిలో నల్లగొండ
విధాత: భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులుపై అవిశ్వాసం ప్రతిపాదిస్తూ 19మంది కౌన్సిలర్లు మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతికి నోటీసు అందజేశారు. అవిశ్వాసం నెగ్గేందుకు 24 మంది కౌన్సిలర్ల బలం అవసరం ఉండగా అవిశ్వాస నోటీసు పై పది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఏడుగురు బిజెపి కౌన్సిలర్లు, అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సంతకాలు చేశారు. 35మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీ లో అవిశ్వాసం తీర్మానం నెగ్గాలంటే 24మంది సభ్యుల బలం అవసరం. మరో […]

విధాత: భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులుపై అవిశ్వాసం ప్రతిపాదిస్తూ 19మంది కౌన్సిలర్లు మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతికి నోటీసు అందజేశారు. అవిశ్వాసం నెగ్గేందుకు 24 మంది కౌన్సిలర్ల బలం అవసరం ఉండగా అవిశ్వాస నోటీసు పై పది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఏడుగురు బిజెపి కౌన్సిలర్లు, అధికార బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సంతకాలు చేశారు.
35మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీ లో అవిశ్వాసం తీర్మానం నెగ్గాలంటే 24మంది సభ్యుల బలం అవసరం. మరో ఐదుగురు కౌన్సిలర్ల మద్దతు కూడగట్టాల్సిన నేపథ్యంలో అధికార పార్టీలోని అసంతృప్తి కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు విపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలు స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కి తలనొప్పిగా మారింది.
అసంతృప్త కౌన్సిలర్లకు స్వయంగా ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి నచ్చచెప్పినప్పటికీ వారు ససేమిరా అంటూ అవిశ్వాసానికి వెళ్లడం గమనార్హం. ప్రతిపక్ష సభ్యుల అవిశ్వాసాన్ని గెలిపించేందుకు డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తో పాటు బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతును కూడగట్టుకునేందుకు అసంతృప్తి కౌన్సిలర్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అటు నల్లగొండలో సైతం చైర్మన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు. రేపొ మాపో కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసు అందించేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లతో ఇప్పటికే చర్చలు ముగించడం విశేషం. జిల్లాలో చండూర్, నందికొండ ఆలేరు, యాదగిరిగుట్టలో ఇటీవల అవిశ్వాస తీర్మానాల రచ్చ అధికార పార్టీలో అసమ్మతికి నిదర్శనంగా నిలిచింది.
అయితే మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మూడేండ్ల కాల పరిమితి నిబంధనను నాలుగేండ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటంతో అవిశ్వాసం నోటీసులపై ప్రభుత్వం నుండి తగిన మార్గదర్శకాలు లేక కలెక్టర్లు వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే అవిశ్వాసాలకు అడ్డు కట్టపడే అవకాశం కనిపిస్తుంది.