బీజేపీలో చేరిన BRS నేతల్లో అసంతృప్తి.. ఈటల బయటకు రాక తప్పదు: రేవంత్ రెడ్డి
బీజేపీలో ఈటల లక్ష్యం నెరవేరట్లేదు.. బయటకు రాక తప్పదు పొంగులేటితో భట్టి చర్చలు: రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టం.. విధాత: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియంతత్వ ధోరణులను జీర్ణించుకోలేక ఆయనను గద్దె దించేందుకు బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని పీసీసీ అధినేత, మల్కాజిగిరి ఎంపి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి పలు అంశాలపై మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్‌ను గద్దె దించాలనే […]

- బీజేపీలో ఈటల లక్ష్యం నెరవేరట్లేదు.. బయటకు రాక తప్పదు
- పొంగులేటితో భట్టి చర్చలు: రేవంత్ రెడ్డి
- పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టం..
విధాత: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియంతత్వ ధోరణులను జీర్ణించుకోలేక ఆయనను గద్దె దించేందుకు బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని పీసీసీ అధినేత, మల్కాజిగిరి ఎంపి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి పలు అంశాలపై మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.
కేసీఆర్‌ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని, ఆ లక్ష్యం అక్కడ నెరవేరడం లేదని ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి స్పష్టమవుతున్నదని అన్నారు. కాని బీజేపీలో చేరిన తరువాత అక్కడ కూడా కేసీఆర్ కోవర్టులు, ఇన్ఫార్మర్లు ఉన్నారనేది అర్థమైందని రేవంత్ వివరించారు. దీంతో ఈటల తన లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన మాటలను బట్టి సుస్పష్టమవుతుందన్నారు.
బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్క తాను ముక్కలేనని తెేలిందన్నారు. ఈటల రాజేందర్ మాటలను పరిగణనలోకి తీసుకుంటే రెండు పార్టీలు ఒకటేనని, దీనిపై రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని కోరారు. ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరని, వారి సిద్ధాంతాలు పూర్తిగా భిన్నమని చెప్పారు.
బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులు, ఇన్ఫార్మర్లు ఉన్నారంటే ఈటలకు లోపల ఎక్కడో అసంతప్తి ఉన్నట్లే కదా? అన్నారు. బీఆర్ ఎస్‌ను అధికారంలోకి రాకుండా చేసేందుకు బీజేపీలో చేరినా ఆ లక్ష్యం నెరవేరడం లేదనే దిగులుతో ఈటల ఉన్నారని అర్థమవుతున్నదన్నారు. భవిష్యత్తులో ఈటల, విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లు తమ దారి తాము చూసుకుంటారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
వీరు నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే నాయకులని, రాజేందర్ కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అయినా, మునుగోడు ఉప ఎన్నిక అయినా అభ్యర్థిని బట్టి ఓట్లు పడ్డాయని చెప్పారు. ఇదే రీతిన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు పడే అవకాశాలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీలోని కోవర్టులు, ఇన్ఫార్మర్ల కారణంగా కేసీఆర్ విష వలయంలో ఈటల చిక్కుకున్నారన్నారు. రాజేందర్ కు ఇష్టం లేకున్నప్పటికీ బీజేపీలోకి వెళ్లక తప్పలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈటల లెఫ్టిస్టు భావాలు కలిగిన నాయకుడు అని, కానీ గత్యంతరం లేక రైటిస్టు పార్టీలోకి వెళ్లేలా కేసీఆర్ పన్నాగం పన్నాడన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో డబ్బులు పంచే ఇష్టం లేకున్నప్పటికీ ఓటర్లకు పంచేలా కేసీఆర్ రెచ్చగొట్టాడని రేవంత్ రెడ్డి వివరించారు.
బీఆర్ఎస్ అసంతృప్త నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకు సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చర్చలు జరుపుతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టం తీసుకువస్తామన్నారు. కేసిఆర్ కు మొదటి నుంచీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కక్ష ఉందని విమర్శించారు. కేసీఆర్ జన్మదినం రోజు కాకుండా అంబేద్కర్ జయంతి రోజున సచివాలయం ప్రారంభిస్తే బాగుండేదన్నారు.
మదనపల్లిలో రేవంత్ పూజలు
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం మదనపల్లి గ్రామంలో హునుమాన్ దేవాలయంలో రేవంత్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఆ తరువాత హాత్ సే హాత్ జోడో యాత్రను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 60 రోజుల పాటు యాత్ర సాగనున్నదని ఆయన కరపత్రాలను విడుదల చేశారు.
మదనపల్లి నుంచి దుద్యాల వెళ్తుండగా మధ్యలో చెలకల్లో కూలీలు, రైతులను కలిసి మాట్లాడారు. వేరుశనగ దిగుబడి, మద్ధతు ధర ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. పంటల గిట్టుబాటు ధరలపై వారి అభిప్రాయం ఏంటో తెలుసుకున్నారు. గతంలో మీరు ఇచ్చిన అవకాశంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివద్ధి చేశానని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతి పేదవాడికీ న్యాయం జరుగుతుందన్నారు. పంటల బీమా ఇవ్వకుండా, రైతు చనిపోతే డబ్బులు ఇస్తానని కేసిఆర్ చెబుతున్నారని రేవంత్ విమర్శించారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ ఆపేది లేదని, మరింతగా పెంచుతామని రేవంత్ హామీ ఇచ్చారు.