వైసీపీ చుట్టూ డ్ర‌గ్స్ ఉచ్చు?

విశాఖ తీరంలో గురువారం సీబీఐ అధికారులు సీజ్ చేసిన 25వేల కిలోల నిషిద్ధ మాద‌క ద్ర‌వ్యాల‌

వైసీపీ చుట్టూ డ్ర‌గ్స్ ఉచ్చు?
  • వైసీపీ.. బ్రెజిల్‌ సంబంధాల‌పై సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్‌
  • ఊతమిస్తున్న విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు
  • ఏపీ అధికారుల‌పై సీబీఐ ఫిర్యాదు
  • డ్రగ్స్ దిగుమతిదారు వైసీపీ పార్టీ వ్యక్తే?
  • ఏపీ ప్రభుత్వానికి సంబంధంలేదు
  • స‌ర్టిఫికెట్ ఇచ్చిన సంధ్యా ఆక్వా సీఎక్స్‌వో
  • ట్రెండింగ్‌లో #JaganForDrugs ఎక్స్‌

విధాత ప్ర‌త్యేక ప్ర‌తినిధి: విశాఖ తీరంలో గురువారం సీబీఐ అధికారులు సీజ్ చేసిన 25వేల కిలోల నిషిద్ధ మాద‌క ద్ర‌వ్యాల‌(డ్ర‌గ్స్‌) కేసు వైసీపీ చుట్టూ తిరుగుతోందా? బ్రెజిల్ నుంచి జ‌ర్మ‌నీ మీదుగా భార‌త్‌లోని విశాఖ‌కు వ‌చ్చిన ఈ డ్ర‌గ్స్ కింగ్‌పిన్ ఎవ‌రు? ఇంట‌ర్‌పోల్ స‌మాచారంతో విశాఖ పోర్టులో డ్ర‌గ్స్ ప‌ట్టుకున్న సీబీఐ అధికారుల ద‌ర్యాప్తు స‌మ‌యంలో ఏపీ అధికారులు ఎందుకు హ‌డివిడి చేశారు? ఎవ‌రి కోసం హ‌డావిడి చేశారు? చేపల మేత తయారీలో వినియోగించే డ్రైఈస్ట్ పేరుతో దిగుమతి చేసుకున్న కంపెనీ వ్యవహారాలు వెనక ఎవరున్నారు? దీనికి కారకులు ఎవరు? ఆ సంస్థ యజమానులు ఎవ‌రు చెబితే ఈ వ్య‌వ‌హారంలో ఇరుక్కున్నారు? క‌ల‌క‌లం రేపిన విశాఖ డ్ర‌గ్స్ కేసు ఏపీ అధికార పార్టీ మెడ‌కు చుట్టుకోబోతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వస్తోంది.

ఏపీ రాజ‌కీయాల్లో వేడి పుట్టించిన విశాఖ డ్ర‌గ్స్‌!

బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ ను సీబీఐ ప‌ట్టుకోవ‌డంతో ఏపీలో రాజ‌కీయ సెగ పెరిగింది. ఈ డ్ర‌గ్స్‌తో సంబంధ‌మున్న వ్య‌క్తులు టీడీపీవారే నంటూ వైసీపీ, వైసీపీ వారే నంటూ టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకున్నాయి. సంధ్య ఆక్వా యజ‌మాని కూన వీర‌భ‌ద్ర‌రావు, ఆయ‌న భార్య ఫోటోల‌తో సంక్రాంతి శుభాకాంక్ష‌లు ఫ్లెక్సీల్లో వైసీపీ నేత‌లు ఉన్న ఫోటోల‌ను టీడీపీ సోష‌ల్ మీడియా వైర‌ల్ చేసింది. సంధ్య ఆక్వా సీఎక్స్‌వో ప్రెస్‌మీట్ పెట్టి, ఈ కేసులో ఏపీ ప్ర‌భుత్వానికి సంబంధంలేద‌ని చెప్ప‌డం ఒక విడ్డూర‌మైతే, దాన్ని వైసీపీ సోష‌ల్ మీడియా వైర‌ల్ చేయ‌డం మ‌రో విడ్డూరంగా మారింది. ఏపీని జ‌గ‌న్ డ్ర‌గ్స్‌కు అడ్డాగా మార్చార‌ని, జ‌గ‌న్ అంటే డ్ర‌గ్స్, డ్ర‌గ్స్ అంటే జ‌గ‌న్ అని టీడీపీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) లో చేసిన హంగామా ట్రెండింగ్ అయింది.

స‌మ‌గ్ర ద‌ర్యాప్తుకు టీడీపీ డిమాండ్‌!

విశాఖ‌లో ప‌ట్టుబ‌డిన డ్ర‌గ్స్‌పై సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ కోరింది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ మేర‌కు రాజ‌మండ్రిలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి డిమాండ్ చేశారు. విశాఖ పోర్టులో తనిఖీలకు వచ్చిన సీబీఐ, కస్టమ్స్​ అధికారులను కంటైనర్ తెరవకుండా ఆపడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేశారని ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్ దిగుమతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండానే ఇన్ని వేల కోట్ల మాదకద్రవ్యాలను డ్రై ఈస్ట్ పేరుతో దిగుమతి చేశారా అని ప్రశ్నించారు. వేల కిలోల వంతున డ్రగ్స్ రాష్ట్రానికి వస్తుంటే రాష్ట్రంలో యువత ఏమైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం ప్రభుత్వమే డ్రగ్స్ రప్పించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయని గోరంట్ల పేర్కొన్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకునే సమయంలో ఏపీ పోలీసులు పోర్టు అధికారులు సహకరించకపోవడంతోనే ఏదో కుట్ర ఉందని, అందుకే డ్రగ్స్ వ్యవహారంపై మొత్తానికి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని గోరంట్ల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇర‌కాటంలో ప‌డేసిన విజ‌యసాయి ట్వీట్లు

సంధ్యా ఆక్వా య‌జ‌మాని, కోట‌య్య చౌద‌రి, కూన వీర‌భ‌ద్ర‌రావు పేరుతో గతంలో ఇచ్చిన వైసీపీ యాడ్ ప్రతిపక్షాలకు ప్రచారంగా మారింది. విజ‌య‌సాయిరెడ్డి డైర‌క్ట‌ర్‌గా ఉన్న విహంగ ల్యాబ్స్‌, కైలాష్ ల్యాబ్స్‌లో 2020లో సంధ్యా ఆక్వా వీర‌భ‌ద్ర‌రావు డైరెక్ట‌ర్‌గా చేర‌డాన్ని ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తాయి. ఇది అధికార పార్టీని తీవ్ర ఇర‌కాటంలో ప‌డేసింది. టీడీపీ విమర్శలను వైసీపీ సోషల్ మీడియా స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌లేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవ‌లం సంధ్యా ఆక్వా సీఎక్స్‌వో ప్రెస్‌మీట్ పెట్టి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పిన విష‌యాన్ని ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్ స‌జ్జ‌ల భార్గ‌వ‌రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేసుకున్నారు. ఇక బ్రెజిల్‌తో వైసీపీ నేత‌ల‌కు ముందునుంచే సంబంధాలు ఉన్నాయని తెలిపేలా, బ్రెజిల్ నూత‌న అధ్య‌క్షుడికి విజ‌యసాయిరెడ్డి ఎక్స్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు చెప్పిన ట్వీట్ కూడా వైసీపీ పార్టీని ఇరకాటంలో పడేసింది. విజ‌య‌సాయిరెడ్డి త‌ర‌చూ బ్రెజిల్ రాజ‌కీయాల‌పై ట్వీట్ చేయ‌డం, ఈ డ్ర‌గ్స్ బ్రెజిల్ నుంచి లోడ్ కావ‌డం, బ్రెజిల్‌లో ఇండియ‌న్ అంబాసిడ‌ర్‌గా సురేష్‌రెడ్డి ప‌నిచేస్తుండ‌టాన్ని టీడీపీ సోష‌ల్ మీడియా హైలెట్ చేసి స‌క్సెస్ అయింది.

గ‌తంలోనూ భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

గ‌తంలో ముంద్రా పోర్టులో ప‌ట్టుబ‌డిన హెరాయిన్ మూలాలు, వివిధ రాష్ట్రాల‌లో ప‌ట్టుప‌డుతున్న గంజాయి స‌ర‌ఫ‌రా మూలాలు అన్నీ ఏపీ వైపే వేలెత్తి చూపుతున్నాయి. గ‌తంలో ప‌ట్టుబ‌డిన హెరాయిన్ సరుకు మీద ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీ విజయవాడ అడ్ర‌స్‌లో న‌మోదైంది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా దొరికిన హెరాయిన్ విజయవాడ అడ్రస్ తో ఉండడంతో, ఆ సరుకు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చింది కావడంతో, ఇక జీఎస్టీ నెంబర్ కూడా దానికి ఉన్న నేపథ్యంలో ఏపీకి చెందిన అధికార పార్టీ నేత‌ల హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపించాయి. హెరాయిన్ ప‌ట్టుబ‌డిన వార్త వచ్చిన గంటలో నే నాటి విజయవాడ సీపీ ఏపీ నేత‌ల‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కనీసం ప్రాథమిక ఎంక్వైరీ చేశారా ? అంటూ నాడు ప్ర‌తిప‌క్ష టీడీపీ కూడా ప్రశ్నించింది.

డ్రగ్స్ కేసు వెనకున్న బిగ్ బాస్ ఎవరు?

ఏపీకి దిగుమంతి అవుతున్న నిషేధిత డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. నాటి హెరాయిన్ కేసులో కానీ, నిన్న‌టి భారీ డ్ర‌గ్స్ కేసులోకానీ కింగ్‌పిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం ర‌హ‌స్యంగానే ఉంటోంది. హెరాయిన్ కేసులో ప‌ట్టుబ‌డిన కాకినాడకు చెందిన సుధాకర్ ఆషీకీ ట్రేడింగ్ కంపెనీ ఓనర్ పై, అతని భార్య పై జ‌గ‌న్ ప్రభుత్వం ఎలాంటి ద‌ర్యాప్తు చేయ‌లేద‌ని టిడిపి ఆరోపిస్తోంది. ఏ ప్రాతిపదికన ఇంత పెద్ద హెరాయిన్ ముఠాతో మీకు సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తారని ప్రశ్నించింది. అతి సాధారణ వ్యక్తిగా కనిపిస్తున్న మాచవరపు సుధాకర్ విజయవాడలో ఆఫీసు పెట్టి తాలిబన్ల నుంచి 72 వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తాడా? ఇతని వెనుకున్న బిగ్ బాస్ పై మీరు ఎందుకు విచారణ చేయలేదు అంటూ జగన్ సర్కార్ కు గ‌త ఏడాదిలోనే సూటి ప్రశ్నలు సంధించింది. అదే ఏడాది బెంగుళూరులో పట్టుబడిన సింథటిక్ డ్రగ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయని తేల్చారు క‌ర్ణాట‌క పోలీసులు.

డ్రగ్స్ వ్యవహారంలో ఇంత దుమారం కొనసాగుతున్నా ఏపీ పోలీసులు ఎందుకు ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చెయ్యటం లేదనే ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హెరాయిన్ కేసులో అరెస్ట్ అయిన సుధాకర్‌కు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడికి మ‌ధ్య ఉన్న లావాదేవీల‌పై విచార‌ణ చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి.. జగన్ కు, వైసీపీ నేతలకు ఈ డ్ర‌గ్స్ వ్యవహారంతో సంబంధం లేకుంటే సీబీఐ విచారణ కోరాలనే డిమాండ్ కూడా సోష‌ల్ మీడియాలో వ‌స్తోంది.

డ్ర‌గ్స్ రాజ‌ధానిగా ఏపీ- కేంద్రం నివేదిక‌

ఏపీ డ్రగ్స్ రాజధానిగా మారిందంటూ 2022 డిసెంబ‌ర్‌లోనే కేంద్రం వెలువరించిన ఓ నివేదిక ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఏపీలో డ్రగ్స్ దందాను ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’ నివేదికలో కేంద్రం బట్టబయలు చేసింది. 2021-22 ఏడాదిలో దేశంలో పట్టుబడిన డ్రగ్స్‌పై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాల కంటే అత్యధికంగా… కేంద్ర బలగాలు ఏపీలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొంది. ఏపీలో(2022 నాటికి)… 18,267 కేజీల డ్రగ్స్‌‌ను సీఆర్‌పీఎఫ్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. 1,057 కేజీల గంజాయి, 97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్ర చందనాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.

ఎమ్మెల్యే ద్వారంపూడి చుట్టూ వివాదం

కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికార పార్టీలో కీలక నేత. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. కాకినాడ‌పోర్టు వేదిక‌గా జ‌రుగుతున్న డ్ర‌గ్స్ కార్యాక‌లాపాల్లో ద్వారంపూడి, ఆయ‌న అనుచ‌ర‌ల హ‌స్తం ఉంద‌ని టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాకినాడలో పలు వ్యాపారాలు చేస్తున్న ద్వారంపూడి.. ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటార‌ని ప్ర‌తిప‌క్ష‌నేత‌లు ఆరోపించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నారంటూ అలీషా అనే వ్యాపారిని కేంద్రంగా చేసుకుని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. అలీషా పై ఆయిల్ అక్రమ రవాణా సహా వివిధ కేసులు కూడా ఉన్నాయి. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న నేరాలలో ఆయన పాత్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే అలీషా దగ్గరే హెరాయిన్ కేసులో ప‌ట్టుబ‌డ్డ‌ సుధాకర్ కొంతకాలం పని చేయడంతో వారిద్దరికి సంబంధాలున్నాయని, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఉందనే విమర్శలకు ఆస్కారం ఏర్పడింది.

డాగ్ స్క్వాడ్ అడిగితేనే వెళ్లాం – విశాఖ సీపీ

విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్ లో అనుమానిత మాదక ద్రవ్యాలు కేస్ పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని విశాఖ సీపీ ర‌విశంక‌ర్ అయ్య‌న్నార్ వెల్ల‌డించారు. సీబీఐ డాగ్ స్క్వాడ్‌ను అడిగితే వెళ్లాము తప్ప.. ద‌ర్యాప్తును అడ్డుకోలేదని విశాఖ పోలీస్ కమిషనర్ చెప్పారు. తమవల్ల సోదాలు ఆలస్యం అయ్యాయన్న వ్యాఖ్యలను ఖండించారు. కంటైనర్ టెర్మినల్ తమపోలీస్ కమిషనరేట్ పరిధి కూడా కాదన్నారు. అయినా కస్టమ్స్ ఎస్పీ పిలవడం వల్ల వెళ్లామని చెప్పుకొచ్చారు.

పోలీసు స్పందన చూస్తూంటే.. అడ్డగోలుగా అడ్డం పడటానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డ్ర‌గ్స్ కేసులో చంద్ర‌బాబు, పురందేశ్వ‌రి బంధువులు: స‌జ్జ‌ల‌

విశాఖ డ్రగ్స్ కేసులో చంద్రబాబు, పురంధేశ్వరి బంధువులకే సంబంధాలు ఉన్నాయ‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజలను కన్ఫ్యూజ్‌ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంద‌ని, కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయి విచారణ జరపాల‌ని స‌జ్జ‌ల డిమాండ్ చేశారు.