ఎన్ని‘కల’లు: సాయాల్లోనూ.. పోటీ పడుతున్న నాయకులు..!
విధాత: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నుండి టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు ఒక్కసారిగా సామాన్య ప్రజల పాలిట అపద్బాంధవులై, మానవతకు మారుపేరుగా మారిపోతున్నారు. ఇంతకాలం ఒకటికి పది సార్లు వారి చుట్టూ తిరిగితే కానీ పట్టించుకోని, పని చేయని నాయకులు కూడా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా జనాదరణ పొందేందుకు రకరకాల సహాయాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. సిట్టింగ్గ్ ఎమ్మెల్యేలు డబల్ బెడ్ రూములు, రోడ్లు, సీడీఎఫ్ నిధుల […]

విధాత: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నుండి టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు ఒక్కసారిగా సామాన్య ప్రజల పాలిట అపద్బాంధవులై, మానవతకు మారుపేరుగా మారిపోతున్నారు. ఇంతకాలం ఒకటికి పది సార్లు వారి చుట్టూ తిరిగితే కానీ పట్టించుకోని, పని చేయని నాయకులు కూడా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా జనాదరణ పొందేందుకు రకరకాల సహాయాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
సిట్టింగ్గ్ ఎమ్మెల్యేలు డబల్ బెడ్ రూములు, రోడ్లు, సీడీఎఫ్ నిధుల కేటాయింపులు, సంక్షేమ పథకాల వంటి వాటితో జనాధారణకు ఎత్తులు వేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న ఆశావహులు స్వచ్ఛంద సంస్థల పేరిట, ట్రస్టుల మాటున ప్రజలకు తమ సహాయాలను అందిస్తూ వారి మనసు దోచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆపదలో ఉన్న వారికి, చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంలో అధికార విపక్ష పార్టీల ఆశావహులు పోటీలు పడుతుండగా, తద్వారా బాధిత కుటుంబాలకు ఎంతో కొంత ఉపశమనం దక్కుతుంది.
తమ రాజకీయ ప్రత్యర్థులు రూపాయి సాయం చేస్తే తాము రెండు రూపాయల సాయం చేస్తామన్నట్లుగా నాయకులు పోటీలు పడుతున్నారు. ఈ క్రమంలో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు, సామాగ్రి కాలిపోయిన గులాం రహమాని కుటుంబానికి బీఆర్ఎస్ నేత పిల్లి రామరాజు పరామర్శించి 20 వేల ఆర్థిక సాయం అందించారు.
అనంతరం ఇదే కుటుంబానికి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించి 75 వేల ఆర్థిక సాయం అందించారు. తాజాగా చందనపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట్ల ఇదయ్య కుటుంబానికి వెంకటరెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఇటీవల నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తన పర్యటనలను పెంచిన వెంకటరెడ్డి అదే స్థాయిలో పలు కుటుంబాలకు ఆర్థిక సహాయాలు, దేవాలయాల నిర్మాణాలకు లక్షల విరాళాలు అందిస్తూ ఒక్కసారిగా జోరు పెంచారు.
పిల్లి మాత్రం నియోజకవర్గంలో నిత్యం నాలుగైదు కుటుంబాలకు 10 నుంచి 20,000 చొప్పున సాయం అందిస్తూ ఆర్ధిక సాయాల్లో ముందున్నారు. గుత్తా అమిత్ రెడ్డి తమ గుత్తా వెంకటరెడ్డి ట్రస్ట్ ద్వారా తమ వంతు సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తుండగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశావహుడు బత్తుల లక్ష్మారెడ్డి తనదైన సాయాలతో నియోజకవర్గ ప్రజల్లో పెనవేసుకుపోయాడు.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం నియోజకవర్గంలో భారీ ఎత్తున ఆర్థిక సహాయాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా దండు మల్కాపూర్ రోడ్డు ప్రమాదం మృతులకు ఆర్థిక సాయం అందజేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ప్రభుత్వపరమైన నిధులు కాకుండా సొంత నిధులు ఖర్చు చేయడంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అందరికంటే ముందున్నారు. ఆయన నిత్యం తన నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు కుటుంబాలకు రకరకాల ఆర్థిక సహాయాలు అందిస్తున్నారు.
ఇక జిల్లా ఎమ్మెల్యే లందరికీ పెద్దన్నగా ఉండే మంత్రి జి.జగదీష్ రెడ్డి సైతం తన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికాయుతంగా ప్రజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తన అధికారిక కార్యక్రమాల్లో కలిసే, ఎదురుపడే లబ్ధిదారులను, రైతులను, సామాన్య ప్రజలను పలకరిస్తూ వారి యోగక్షేమాల ఆరా తీస్తూ అవసరమైన వారికి కావలసిన సాయం చేస్తున్నారు.
మరికొందరు ఎమ్మెల్యేలు, పార్టీల ఆశావాహులు యువజన సంఘాలకు క్రీడా సామాగ్రి అందజేస్తూ, క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా, నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్‌లు అందిస్తున్నారు. మొత్తంగా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎమ్మెల్యేలు, ఆశావహులు తమ అధికార దర్పాన్ని పక్కన పెట్టి ఆకస్మాత్తుగా సామాన్య జనానికి చేరువవుతూ దానకర్ణులుగా మారడం ప్రజలను ఆలోచింపజేస్తున్నది, ఆశ్చర్య పరుస్తున్నది.